Car Accident: మూడు కార్లు ఢీ.. యువకుడి మృతి
ABN , Publish Date - Jan 19 , 2025 | 04:52 AM
ఓ కారు ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఢీకొనడంతో యువకుడు మృతిచెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఐదుగురు కర్ణాటకవాసులకు గాయాలు
అచ్చంపేట టౌన్, జనవరి 18(ఆంధ్రజ్యోతి): ఓ కారు ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఢీకొనడంతో యువకుడు మృతిచెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.కర్ణాటకలోని గుల్బర్గా నుంచి ఒకే కుటుంబానికి చెందిన 12 మంది రెండు కార్లలో శ్రీశైలం వెళ్లి దైవదర్శనం చేసుకుని తిరుగు పయనమయ్యారు. శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై అచ్చంపేట మండలం హాజిపూర్ చౌరస్తా వద్ద వీరి కార్లను హైదరాబాద్ వైపు నుంచి రంగాపూర్ జాతరకు వెళుతున్న కారు అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది.
దీంతో రంగాపూర్ వెళుతున్న కారులోని హైదరాబాద్‌కు చెందిన యువకుడు బిలాల్ (28) తలకు బలమైన గాయాలై మృతి చెందాడు. ఈ కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. గుల్బర్గాకు చెందిన వారిలో ముందు కారులో ప్రయాణిస్తున్న విష్ణుకాంత్, విజయలక్ష్మి, వాసవి, మంజు, జగదీష్ అనే వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.