Bus Accident: ఇద్దరిని బలిగొన్న అతివేగం
ABN , Publish Date - Jan 19 , 2025 | 04:49 AM
అతివేగం ఇద్దరిని బలితీసుకుంది. ముందువెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనక నుంచి మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో రోడ్డు మీదపడి వెనక బస్సు క్లీనర్, గుండెపోటుకు గురై ఓ ప్రయాణికుడు మృతిచెందారు.
సూర్యాపేటలో ప్రైవేటుబస్సును వెనక నుంచి ఢీకొన్న మరో బస్సు క్లీనర్ మృతి.. గుండెపోటుతో గుంటూరుకు చెందిన ప్రయాణికుడి మృతి
సూర్యాపేట క్రైం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): అతివేగం ఇద్దరిని బలితీసుకుంది. ముందువెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనక నుంచి మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో రోడ్డు మీదపడి వెనక బస్సు క్లీనర్, గుండెపోటుకు గురై ఓ ప్రయాణికుడు మృతిచెందారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. ఏపీలోని నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సు డ్రైవర్ సూర్యాపేటలోని ఎన్టీఆర్ పార్క్ సమీపంలో సర్వీస్ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ వద్దకు రాగానే ఒక్కసారిగా వేగం తగ్గించాడు. అదే సమయంలో అతివేగంతో నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న మరో బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది.
వెనుక బస్సు క్లీనర్ ఒంగోలుకు చెందిన ఇండ్ల ప్రవీణ్ (22) ముందు అద్దానికి కొట్టుకున్నాడు. దీంతో అద్దం పగిలి బస్సు ముందు భాగంలో రోడ్డుపై పడిపోయాడు. బస్సు అతని పైనుంచి వెళ్లిపోవడంతో మృతిచెందాడు. ఈ ప్రమాదంతో వెనక బస్సులో ప్రయాణిస్తున్న గుంటూరుకు చెందిన పఠాన్ నయాబ్ రసూల్ (57) గుండెపోటుతో మృతిచెందాడు. కార్పెంటర్‌గా పనిచేసే రసూల్ హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్తున్నాడు. ప్రమాదంలో గాయపడిన పలువురు ప్రయాణికులు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొంది స్వస్థలాలకు వెళ్లిపోయారు.