Solar rooftops: సౌరశక్తితో జీరో బిల్లు
ABN , Publish Date - Aug 18 , 2025 | 04:57 AM
ఇంతకాలం ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) పరిధిలో మాత్రమే పరిమితమైన సోలార్ రూఫ్‌టా్‌పలు.. క్రమంగా ఇతర నగరాలు/మునిసిపాలిటీలకూ విస్తరించాయి.
ఔటర్ లోపలే కాదు ఓఆర్‌ఆర్ ఆవల కూడా సోలార్ యూనిట్లు
పెరుగుతున్న సౌరవిద్యుత్తు వినియోగం
కేంద్ర ప్రభుత్వ ‘బిజిలీ ముఫ్త్’ పథకంతో జోష్
హైదరాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఇంతకాలం ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) పరిధిలో మాత్రమే పరిమితమైన సోలార్ రూఫ్‌టా్‌పలు.. క్రమంగా ఇతర నగరాలు/మునిసిపాలిటీలకూ విస్తరించాయి. ఇప్పుడు గ్రామాల్లోనూ సౌర విద్యుత్తు వెలుగులు జిగేల్‌మంటున్నాయి. కరెంటు బిల్లుల భారం నుంచి తప్పుకోవడానికి వినియోగదారులు.. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు సోలార్ రూఫ్‌టా్‌పల వైపు మొగ్గు చూపుతున్నారు. సౌర ఫలకాలతో సొంత అవసరాలకు విద్యుత్తును వాడుకోవడమే కాకుండా.. డిస్కమ్‌లకు కూడా విక్రయించే అవకాశాలుంటాయి.
భారీగా తగ్గుతున్న బిల్లులు
సోలార్ ప్లాంట్లతో విద్యుత్తు బిల్లులు భారీగా తగ్గుతున్నాయి. ఎంతలా అంటే..? సోలార్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోకముందు 500 యూనిట్ల వినియోగానికి రూ.4 వేల వరకు బిల్లు వచ్చేది. 5 కిలోవాట్ల యూనిట్‌ను ఏర్పా టు చేసుకున్నాక.. రూ.290తో సరిపోతోంది. తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలు గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు పొందుతుండగా.. మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు బ్యాంకు లోన్‌తోనైనా రూఫ్‌టాప్ సోలార్ అమర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. నెలకు 300 యూనిట్ల బిల్లు వచ్చే కుటుంబం 3 కిలోవాట్ల సోలార్ యూనిట్‌ను అమర్చుకుంటే.. నెలవారీ కరెంటు బిల్లు రూ.175కు పరిమితమవుతోంది. అదే నెలకు 200 యూనిట్లతో రూ.822 బిల్లు వచ్చేవారికి సోలార్ యూనిట్ ఏర్పాటు తర్వాత రూ.75 మాత్రమే వస్తోంది.
బిజిలీ ముఫ్త్ యోజనతో..
దేశవ్యాప్తంగా కోటి మందికి ‘ప్రధానమంత్రి-సూర్యఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన’ పథకాన్ని వర్తింపజేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. రాష్ట్రంలో ఈ పథకం కింద 57,281 దరఖాస్తులు రాగా.. 16,382 కనెక్షన్లు ఇచ్చారు. వీరికి సబ్సిడీ కింద రూ.115.37 కోట్ల ను కేంద్రం విడుదల చేసింది. గతంలో అమలు చేసిన రూఫ్‌టాప్ సోలార్(ఆర్‌టీఎస్) కింద 567 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లు పెట్టుకోగా.. తాజాగా కేంద్రం ప్రకటించిన పీఎం సూర్యఘర్ కింద రాష్ట్రంలో 65.48 మెగావాట్ల ప్లాంట్లు పెట్టుకున్నారు. 3 కిలోవాట్ల దాకా సబ్సిడీ కింద రూ.78 వేలు అందితే.. సబ్సిడీ పోనూ యూనిట్ ఏర్పా టు ఖర్చు రూ.1.20 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకు అవుతోంది. ప్రతీనెల 150 యూనిట్ల దాకా విద్యుత్తును వినియోగించేవారికి 1-2 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనికి అయ్యే వాస్తవిక వ్యయం రూ.1.10 లక్షలు కాగా.. కేంద్ర సబ్సిడీ రూ.60వేలుగా ఉంది. అంటే.. వినియోగదారులు రూ.50 వేలను భర్తిస్తే సరిపోతుంది. దానికి కూడా బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలిస్తున్నాయి. ఇలా 1-2 కిలోవాట్ల సోలార్ బిగించుకునేవారికి నెలకు కనీస బిల్లు రూ.75 మాత్ర మే వస్తోంది. నిజానికి 150 యూనిట్లకు రూ.700 బిల్లు అవుతుంది. 1-2 కిలోవాట్ల సౌరవిద్యుత్తుతో రూ.625 ఆదా అవుతోంది.
వినియోగం ఇలా..
సౌర విద్యుత్తు వినియోగదారులు వేసవిలో ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకు తమ రూఫ్‌టా్‌పపై ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నేరుగా వాడుకుంటారు. అదనపు విద్యుత్తు(నెట్ మీటర్ ఉంటే) డిస్కమ్‌లు కొనుగోలు చే స్తాయి. సూర్యాస్తమయం నుంచి తిరిగి సూర్యోదయం దాకా డిస్కమ్‌ల విద్యుత్తును వాడుకోవడమో.. లేదా సౌరవిద్యుత్తును బ్యాటరీలో నిల్వ చేసి వినియోగించుకోవడమో చేయవచ్చు.
3 కిలోవాట్లకే సబ్సిడీ సీలింగ్
సోలార్ రూఫ్‌టాప్ పథకం ప్రారంభించిన కొత్తలో ఒక్క కిలోవాట్‌కు 40ు సబ్సిడీ అందేది. క్రమంగా దాన్ని తగ్గిస్తూ వచ్చారు. ప్రతి కిలోవాట్‌కు రూ.18 వేల మేర సబ్సిడీ పడిపోయింది. అంటే.. 3 కిలోవాట్ల దాకా రూ.54 వేల సబ్సిడీ అందేది. 3-10 కిలోవాట్ల యూనిట్లకు ప్రతి కిలోవాట్‌కు రూ.9 వేల చొప్పున సబ్సిడీ ఇచ్చేవారు. పీఎం సూర్యఘర్ బిజిలీ ముఫ్తి యోజన తర్వాత సబ్సిడీ కొంత మేర పెరిగింది. అయితే.. 3 కిలోవాట్ల వరకే సబ్సిడీకి అవకాశం ఉంటుంది. గరిష్ఠంగా 3 కిలోవాట్లకు రూ.78వేల సబ్సిడీ వస్తుంది. 1 కిలోవాట్‌కు రూ.30 వేలు, రెండు కిలోవాట్లకు రూ.60 వేల చొప్పున సబ్సిడీ లు అందుతాయి. సూర్యఘర్ కింద దరఖాస్తు చేసుకున్న వారికి వారంపది రోజుల్లో ప్యానెళ్ల బిగింపు పూర్తవుతుంది. ఆ తర్వాత నెట్‌మీటర్(డిస్కమ్‌లకు విద్యుత్తు అమ్మేందుకు)ను బిగిస్తా రు. ఈ ప్రక్రియలు పూర్తయ్యాక.. రూఫ్‌టాప్ సోలార్ యూనిట్‌కు సంబంధించిన రిపోర్టులు కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖకు అందగానే.. 15 రోజుల్లో సబ్సిడీ అందుతుందని సన్‌టెక్ సోలార్ ప్రతినిధి సురేశ్ తెలిపారు.
గ్రామాల్లోనూ సోలార్ ప్లాంట్లు
గ్రామాల్లోనూ సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్లు పెట్టుకునేవారి సంఖ్య పెరిగింది. 3 కిలోవాట్ల దాకా ప్లాంట్లు పెట్టుకుంటున్నారు. సబ్సిడీ ఉన్నంత సామర్థ్యంలోనే ప్లాంట్లు పెరుగుతున్నాయి. దాంతో 3 కిలోవాట్లలోపు ప్లాంట్లు పెట్టుకునేవారి సంఖ్య పెరిగింది.
- గంగాధర్, స్రవంతి సోలార్, నిజామాబాద్
5 కిలోవాట్లతో జీరో బిల్లు
ప్రతినెల రూ.4 వేల దాకా వచ్చే బిల్లు 5 కిలోవాట్ల సోలార్ రూఫ్‌టా్‌పను బిగించాక.. రూ.290కు తగ్గిపోయింది. 5 కిలోవాట్ల యూనిట్ ఏర్పాటుకు రూ.3.50 లక్షలు ఖర్చయింది. నిర్వహణ ఖర్చు కూడా నామమాత్రంగా ఉంటుంది. పిడుగులు పడ్డప్పుడు మాత్రం సోలార్ పవర్ స్విచ్ పడిపోయి, ట్రిప్ అవుతుంది. తిరిగి ఆన్‌చేసుకుంటే సరిపోతుంది.
- కొప్పరపు శ్రీనివా్‌సరెడ్డి, నారపల్లి
ఒకప్పుడు 2,500 బిల్లు
రూ.2.50 లక్షలతో 5కిలోవాట్ల సోలార్ రూఫ్‌టాప్ పెట్టుకున్నాం. 3 కిలోవాట్ల యూనిట్లనే వాడుతున్నాం. ప్లాంట్ పెట్టకముందు నెలకు రూ.2500ల దాకా బిల్లు వ చ్చేది. రూఫ్‌టాప్ అమర్చాక జీరో బిల్లు వస్తోంది. సోలార్ ప్యానెళ్లపై దుమ్ము.. ధూళి పడకుండా నిరంతరం శుభ్రపర్చడం మంచిది.
- ముఖ్రం, కాచిగూడ
ఈ వార్తలు కూడా చదవండి..
ఏయూ మాజీ రిజిస్ట్రార్ల అరెస్ట్‌కు వారెంట్ జారీ
బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ