ఆది నుంచీ ఆటంకాలే!
ABN , Publish Date - Feb 23 , 2025 | 03:55 AM
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ ప్రాజెక్టు పనులు కుదుపునకు గురయ్యాయి. శనివారం ఇన్‌లెట్ (శ్రీశైలం) నుంచి సీపేజీ పనులు జరుగుతుండగా... ఒక్కసారిగా పైకప్పు కుప్పకూలటం, 8 మంది చిక్కుకుపోవటం కలకలం రేపింది.

ఎస్‌ఎల్‌బీసీ ముందుకు సాగకుండా తరచూ అవరోధాలు .. సొరంగమార్గంలో ఊటనీరు, కూలిపడే రాళ్లు, మట్టి
ఇటీవలే పనులు పునఃప్రారంభం..
హైదరాబాద్, నల్లగొండ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ ప్రాజెక్టు పనులు కుదుపునకు గురయ్యాయి. శనివారం ఇన్‌లెట్ (శ్రీశైలం) నుంచి సీపేజీ పనులు జరుగుతుండగా... ఒక్కసారిగా పైకప్పు కుప్పకూలటం, 8 మంది చిక్కుకుపోవటం కలకలం రేపింది. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లోని సుమారు 4లక్షల ఎకరాలకు సాగునీరు, వేయికి పైగా గ్రామాలకు తాగునీరందించే లక్ష్యంతో చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ పనులకు తొలి నుంచీ ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉండటం గమనార్హం. అందువల్లే 2005లో మొదలైన ఈ సొరంగమార్గం పనులు నేటికీ పూర్తికాలేదు. ఎస్‌ఎల్‌బీసీ పథకంలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ సమీపంలోని నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట నుంచి నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని నక్కలగండి వరకు 43.93 కిలోమీటర్ల సొరంగం (టన్నెల్) తవ్వాల్సి ఉంది. దీనిని రెండువైపుల నుంచి (ఇన్‌లెట్, ఔట్‌లెట్) తవ్వాలని నిర్ణయించారు. దీంట్లోభాగంగా శ్రీశైలం రిజర్వాయర్‌లోని నీటిని తీసుకునే ప్రాంతం నుంచి చేపట్టిన ఇన్‌లెట్ టన్నెల్‌ను 19.500 కి.మీ.లు తవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు 13.935 కి.మీ.లు పూర్తవగా, ఇంకా 6.015 కి.మీ.ల సొరంగం తవ్వాల్సి ఉంది. అయితే, 2019 నుంచి ఊటనీరు వచ్చి చేరటమేగాక మట్టి, రాళ్లు కూలుతుండటంతో పనులు ముందుకు సాగలేదు. ఊటనీటిని తోడేస్తూ, మట్టిని తొలగించడంతో పాటు, ఊటనీరు మళ్లీ రాకుండా, మట్టి, రాళ్లు పడకుండా సిమెంట్, పాలియేరిథిన్ గ్రౌటింగ్ చేయించారు. ఇటీవలే ఈ పనులను పునరుద్ధరించగా, శనివారం పనులు జరుగుతున్న టన్నెల్ వద్ద సుమారు వంద మీటర్లకు పైగా కూలిపోవడంతో పెనుప్రమాదం చోటుచేసుకుంది. ఈ టన్నెల్ పెండింగ్ పనులకు సంబంధించి 14వ కి.మీ. నుంచి 19.500 కి.మీ. వరకు ఉన్న ప్రాంతంలో ఊటనీరు వస్తోందని, శ్రీశైలం రిజర్వాయర్‌లో నీరు టన్నెల్ కాంటూరు లెవల్స్ కంటే ఎగువన ఉన్నాయని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతూ వస్తున్నారు. అంతేగాక ఈ ప్రాంతంలో గ్రానైట్, రాతిశిలల కంటే మట్టి, సన్నరాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల సొరంగం తవ్వగానే పెలుసుబారి కూలిపోతోందని పేర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు గ్రౌంటింగ్ చేస్తున్నా అది కప్పును బలంగా ఉంచలేకపోయిందని, అందువల్లే శనివారం దుర్ఘటన జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇన్‌లెట్ పరిస్థితి ఇలా ఉంటే, నీరు విడుదలయ్యే వైపున్న మన్నేవారిపల్లి నుంచి చేపట్టిన ఔట్‌లెట్ టన్నెల్ మొత్తం పొడవు 23.980 కి.మీ.లు. ఇప్పటివరకు 20.435 కి.మీ.లు పూర్తవగా, ఇంకా 3.545 కి.మీ.లు తవ్వాల్సి ఉంది. పూర్తి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో, టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) ద్వారా ఈ పనులు చేపట్టారు. అయితే, టీబీఎంలో మరమ్మతులు వస్తే పరికరాలు, బేరింగుల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తుండటంతో పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ బేరింగ్‌ను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చెన్నై షిప్‌యార్డుకు చేరిన ఈ బేరింగ్‌ను మరోనెలలో ఎస్‌ఎల్‌బీసీ పనులు జరిగే మన్నెవారిపల్లి వద్దకు చేర్చేందుకు ఇరిగేషన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో శీతకన్ను
బీఆర్‌ఎస్ హయాంలో పదేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. పలు సందర్భాల్లో అప్పటి సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టు మీద విమర్శలు చేశారు. బేరింగ్ దెబ్బ తింటే కొత్త బేరింగ్ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. 2019 నుంచి ఈ సొరంగమార్గం వద్ద ఎలాంటి పనులు చేపట్టలేదు. కృష్ణా జలాల్లో 45 టీఎంసీల నీటిని ఎస్‌ఎల్‌బీసీ కింద వినియోగించుకోవడానికి అనుమతినివ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)ని బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆ తర్వాత ఆ నీటిని అనూహ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మళ్లించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనంతరం, ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ నిధులను గ్రీన్‌ఛానల్‌లో పెట్టి ఎప్పటికప్పుడు పెండింగ్ బిల్లులు లేకుండా చర్యలు చేపట్టిన నేపథ్యంలోనే ఇన్‌లెట్ వైపు నుంచి వారం కిందటే కాంట్రాక్టు ఏజెన్సీ జేపీ అసోసియేట్స్ పనులు మొదలుపెట్టింది. ఇంతలోనే ఈ దుర్ఘటన జరగడంతో పనులపై మళ్లీ నీలినీడలు కమ్ముకున్నాయి.
ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్!
2005 నుంచి ఎడమ గట్టు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీని తర్వాత, ఏపీలోని ప్రకాశం జిల్లాలో చేపట్టిన పూలసుబ్బయ్య వెలిగొండ టన్నెల్ పనులు పూర్తయ్యాయి. 2005లో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కోసం రూ.2259 కోట్లతో ఈపీసీ విధానంలో టెండర్లు పిలవగా.. జేపీ అసోసియేట్ 9 ు తక్కువకే పని దక్కించుకుంది. 1925 కోట్లతో 2005 ఆగస్టు 25వ తేదీన ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన టన్నెల్ ప్రాజెక్టుగా నిలవనుంది.