Share News

Srishti Fertility Center: ‘సృష్టి’ కేసులు సిట్‌కు బదిలీ

ABN , Publish Date - Aug 13 , 2025 | 03:50 AM

సృష్టి ఫర్టిలిటీ కేంద్రం మోసాలపై నమోదైన తొమ్మిది కేసులను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)కు బదిలీ చేసినట్లు ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్‌ వెల్లడించారు.

Srishti Fertility Center: ‘సృష్టి’ కేసులు సిట్‌కు బదిలీ

  • మొత్తం 9 కేసులు.. 25 అరెస్టులు

  • నిందితులపై గతంలోనే 15 కేసులు

  • ఏజెంట్లకు భారీగానే కమిషన్‌

  • వెల్లడించిన డీసీపీ రష్మీ పెరుమాళ్‌

  • నమ్రతగా పేరు మార్చుకున్న నీరజ

హైదరాబాద్‌ సిటీ/అడ్డగుట్ట, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): సృష్టి ఫర్టిలిటీ కేంద్రం మోసాలపై నమోదైన తొమ్మిది కేసులను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)కు బదిలీ చేసినట్లు ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్‌ వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు మరింత లోతుగా జరగాల్సి ఉండడం.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు.. పకడ్బందీగా సాంకేతిక ఆధారాల సేకరణ వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సి ఉన్నందున పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాలతో ఈ కేసులను సిట్‌కు బదిలీ చేశామన్నారు. ఇప్పటి వరకు నమోదు చేసిన 9 కేసుల్లో 25 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆమె పలు వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితురాలు డాక్టర్‌ నమ్రతపై 2010-20 మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో 15 కేసులు నమోదైనట్లు తెలిపారు. జూలైలో బాధితుల ఫిర్యాదుతో సరగసీ చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. ‘‘డాక్టర్‌ సూరి శ్రీమతి అనే 90 ఏళ్ల వయసున్న గైనకాలజిస్టు లైసెన్సుతో నమ్రత క్లినిక్‌ను ప్రారంభించారు. డాక్టర్‌ సూరి శ్రీమతి పేరుతోనే లెటర్‌హెడ్‌లు, ప్రిస్ర్కిప్షన్‌ ప్యాడ్లను వినియోగించారు. ఈ విషయం సూరి శ్రీమతికి తెలియదు. దాంతో.. ఆమె కూడా మాకు ఫిర్యాదు చేశారు. కొందరు బాధితులను నమ్రత కుమారుడు జయంత్‌ బెదిరించేవాడు.’’ అని డీసీపీ వివరించారు.


సికింద్రాబాద్‌, కొండాపూర్‌, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, భువనేశ్వర్‌, కోల్‌కతాలో నమ్రత ‘సృష్టి’ క్లినిక్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తన వద్దకు వచ్చేవారిని సరగసీకి ఒప్పించేవారన్నారు. దంపతుల అండాలు, వీర్యకణాల తీరును పరిశీలించకుండానే.. సరగసీ పేరుతో పిల్లల అక్రమ రవాణా ముఠా నుంచి కొనుగోలు చేసే శిశువులను వారికి అంటగట్టేవారని చెప్పారు. ‘‘కొన్ని కేసుల్లో.. ఇతర రాష్ట్రాల్లోని పేద గర్భిణులకు వలవేసేవారు. వారిని వైజాగ్‌కు పిలిపించి, డెలివరీ చేసేవారు. వారి శిశువులను రూ.80 వేల నుంచి రూ.90 వేలకు కొనుగోలు చేసేవారు. నకిలీ డీఎన్‌ఏ సర్టిఫికెట్లతో ఆ శిశువులను సరగసీ పేరుతో పిల్లల్లేని దంపతులకు అంటగట్టేవారు. ఇందుకోసం ఆ దంపతుల నుంచి రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసేవారు. ఏజెంట్ల సాయంతో చిన్నారుల అక్రమ రవాణా ముఠాల ద్వారా కూడా శిశువులను కొనుగోలు చేసేవారు. ఆడశివువుకు రూ.3.5 లక్షలు, మగశిశువుకు రూ.4.5 లక్షల చొప్పున చెల్లించేవారు’’ అని డీసీపీ వెల్లడించారు.


నమ్రతగా మారిన నీరజ

డాక్టర్‌ నమ్రత అసలు పేరు నీరజ. ఆమె మూడున్నర దశాబ్దాల క్రితం వైజాగ్‌లోని ఆంధ్రామెడికల్‌ కాలేజీలో మెడిసిన్‌ చదివినట్లు సమాచారం. అయితే.. మోసాలతో దందా చేస్తున్నందుకు పోలీసులకు పట్టుబడే అవకాశాలుండడంతో ఆమె డాక్టర్‌ నమ్రత పేరుతో చలామణి అవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పోలీసు కేసులు నమోదైతే.. అసలు పేరుతో విదేశాలకు పారిపోవచ్చని ఆమె స్కెచ్‌ వేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 13 , 2025 | 03:50 AM