Sigachi Explosion: పాత డ్రయర్.. నిర్వహణా లేదు!
ABN , Publish Date - Aug 13 , 2025 | 05:10 AM
పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత కంపెనీ యాజమాన్యానిదేనా? ప్రమాదకరమైన పరిశ్రమ అని తెలిసినా..
తుప్పు పట్టినా సిగాచీ యాజమాన్యం పట్టించుకోలేదు.. 12 ఏళ్ల నాటి స్ర్పే డ్రయర్ పేలడంతోనే ప్రమాదం
అగ్నిమాపక శాఖ ఎన్వోసీ తీసుకోలేదు
ప్రమాదకర పరిశ్రమలో తీవ్రమైన లోపాలు
యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం
విచారణ కమిటీ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత కంపెనీ యాజమాన్యానిదేనా? ప్రమాదకరమైన పరిశ్రమ అని తెలిసినా.. నిర్లక్ష్యంగా వ్యవహరించారా? అంటే విచారణ కమిటీ నివేదిక అవుననే అంటోంది. జూన్ 30న సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. 41 మంది ఘటనా స్థలంలోనే మృతిచెందారు. 35 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు ఈ ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశారు. జూలై 5న కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అది మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసు, పరిశ్రమలు, అగ్నిమాపక శాఖ, వైద్యఆరోగ్యం, టీజీఐఐసీ, కాలుష్య నియంత్రణ మండలి, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలు జరిపిన విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలను ఈ నివేదికలో వెల్లడించారు. ఔషధ తయారీల్లో ఉపయోగించే మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ (ఎంసీసీ)ను ఈ కంపెనీ తయారుచేస్తోంది. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం ఇది రెడ్ క్యాటగిరీ పరిశ్రమ. తీవ్రమైన కాలుష్యంతోపాటు ప్రమాదాలు జరిగే అవకాశమూ ఎక్కువే. అయినప్పటికీ భద్రతా చర్యలు తీసుకోవడంలో కంపెనీ యాజమాన్యం విఫలమైందని నివేదికలో పేర్కొన్నారు.
నిర్వహణను విస్మరించిన యాజమాన్యం..
ఎంసీసీ తయారీ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చెక్క గుజ్జును 120 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద రియాక్టర్‌లో వేడి చేశాక ఫిల్టర్ చేస్తారు. తర్వాత 80ు నీటితో స్లర్రీగా మారుస్తారు. దీన్ని అటామైజర్ ద్వారా స్ర్పే డ్రయర్‌కు పంపుతారు. హాట్ ఎయిర్ జనరేటర్‌తో ఉత్పత్తి చేసిన వేడి గాలిని డ్రయర్‌లోకి పంపుతారు. ఇక్కడ ఉష్ణోగ్రత 205 డిగ్రీలుంటుంది. ఎంసీసీ తయారీ ప్రక్రియలో డ్రయర్ పాత్ర అత్యంత కీలకం. ఇలాంటి యంత్రాల వద్ద ప్రమాద అవకాశాలూ ఎక్కువే కాబట్టి నిపుణులు, సుశిక్షితులైన వారికే ఇక్కడ బాధ్యతలు అప్పగించాలి. యాజమాన్యం ఈ విషయాలను పట్టించుకోలేదు. 12 ఏళ్ల క్రితం గుజరాత్ నుంచి తెప్పించిన డ్రయర్‌నే ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. డ్రయర్ నిర్వహణా సరిగా లేదు. ఇది పేలడం వల్లే ప్రమాదం జరిగింది. మండే స్వభావమున్న ముడిసరుకు భారీగా ఉండడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది. పేలుడును నిరోధించే వెంట్‌లు, భద్రతా వాల్వ్‌లు లేవు. పాత డ్రయర్, కొన్ని చోట్ల తుప్పు పట్టినా యాజమాన్యం గుర్తించలేదు. రెడ్ క్యాటగిరీ పరిశ్రమ అయినప్పటికీ సిగాచీ సంస్థ.. అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ) పొందలేదు. కనీస భద్రతా ప్రమాణాలూ పాటించలేదు. 1991లో పాశమైలారం పంచాయతీ నుంచి భవన ప్రణాళిక ఆమోదం పొందిన కంపెనీ.. తర్వాత ఎన్నడూ సవరించిన భవన ప్రణాళిక ఆమోదం తీసుకోలేదని నివేదికలో వెల్లడించింది.
కనీస శిక్షణ లేని కార్మికులు..
కంపెనీలో పనిచేస్తున్న వారిలో నిపుణులైన సిబ్బంది లేరు. ఇలాంటి పరిశ్రమలో పనిచేసే కార్మికులకు భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. అయితే ఇక్కడి కార్మికులకు కనీస శిక్షణ కూడా లేదు. ప్రమాద సమయంలో ఉన్న 125 మందిలో 30 మంది రోజువారీ పనులు చేసే తాత్కాలిక కార్మికులున్నారు. వారిలో ఈఎ్‌సఐ ప్రయోజనం తక్కువ మందికి లభిస్తుంది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో 10 మందికి కంపెనీ ఎలాంటి బీమా ప్రయోజనం ఇవ్వలేదని నివేదిక తేల్చింది. ప్రమాదకరమైన కంపెనీ అయినప్పటికీ సొంత అంబులెన్స్ లేదని, అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి అవగాహనా కల్పించలేదని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News