Crime News: హెక్సా బ్లేడ్‌తో తల వేరు చేసి.. మొండాన్ని మూడు ముక్కలుగా కోసి..
ABN , Publish Date - Jan 26 , 2025 | 05:43 AM
సంచలనం సృష్టించిన మీర్‌పేట మహిళ హత్య కేసు మిస్టరీని ఛేదించిన రాచకొండ పోలీసులకు విచారణలో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు తెలిసినట్లు సమాచారం.
ఎముకలను స్టవ్ మీద కాల్చిన కిరాతకుడు
మీర్‌పేట హత్య కేసులో దిగ్ర్భాంతికర విషయాలు
హైదరాబాద్ సిటీ, జనవరి 25(ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన మీర్‌పేట మహిళ హత్య కేసు మిస్టరీని ఛేదించిన రాచకొండ పోలీసులకు విచారణలో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు తెలిసినట్లు సమాచారం. నిందితుడు గురుమూర్తే తన భార్య వెంకట మాధవిని హత్య చేసి, శవాన్ని మాయం చేసేందుకు హెక్సా బ్లేడ్‌తో తల నుంచి మొండెం వేరు చేసి, మొండెం నుంచి కాళ్ల వరకు శరీరాన్ని మూడు ముక్కలుగా కోశాడని విచారణలో తేలినట్లు విశ్వసనీయంగా తెలిసింది. శరీర భాగాల మాంసాన్ని ఒలిచి బకెట్‌లో వేసి నీళ్లు పోసి పలు విడతలుగా హీటర్‌తో వేడి చేసి ముద్దగా మార్చినట్లు, చర్మం ఒలిచిన తర్వాత ఎముకలు, కాళ్లను స్టౌవ్‌పై కాల్చి గునపం లాంటి దానితో ఎముకలను చిన్న చిన్న ముక్కలుగా విరగ్గొట్టినట్లు విచారణలో గురుమూర్తి ఒప్పుకున్నట్లు తెలిసింది.
మాంసం ముద్దలను, ఎముకలను బకెట్‌లో వేసుకొని మీర్‌పేట పెద్ద చెరువులో పారేసినట్లు వెల్లడించినట్లు సమాచారం. ఆధారాలు దొరకకూడదని నిందితుడు ప్రయత్నించడంతో రాచకొండ పోలీసులు లోతుగా విచారణ జరిపారు. ‘బ్లూరేస్ టెక్నాలజీ’తో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షించి.. గురుమూర్తే హంతకుడిగా నిర్థారించారు.