Road Accident: కుంభమేళాకు వెళ్లి వస్తూ.. ఏడుగురి దుర్మరణం
ABN , Publish Date - Feb 12 , 2025 | 04:40 AM
మహా కుంభమేళాలో పుణ్యస్నానాలకు వెళ్లిన ఏడుగురు నగరవాసులు రోడ్డు ప్రమాదం జరిగి విగతజీవులుగా తిరిగొచ్చిన ఉదంతమిది..! మృతుల్లో టెంపో ట్రావెలర్ డ్రైవర్ సహా.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, మరో ముగ్గురు స్నేహితులు ఉన్నారు.

మృతులంతా హైదరాబాద్ వాసులు.. వారు ప్రయాణిస్తున్న టెంపోను రాంగ్‌రూట్‌లో ఢీకొన్న లారీ
మధ్యప్రదేశ్‌లో జబల్‌పూర్ వద్ద దుర్ఘటన
మృతుల్లో ముగ్గురు బంధువులు, ముగ్గురు స్నేహితులు
ఒకరు డ్రైవర్.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
భార్య సంవత్సరీకానికి రెండ్రోజుల ముందే భర్త మృతి
అనాథలైన ఇద్దరు పిల్లలు
హైదరాబాద్ సిటీ/ఉప్పల్/నాచారం/తార్నాక/మల్కాజిగిరి, శంకర్‌పల్లి, రఘునాథపల్లి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): మహా కుంభమేళాలో పుణ్యస్నానాలకు వెళ్లిన ఏడుగురు నగరవాసులు రోడ్డు ప్రమాదం జరిగి విగతజీవులుగా తిరిగొచ్చిన ఉదంతమిది..! మృతుల్లో టెంపో ట్రావెలర్ డ్రైవర్ సహా.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, మరో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఇంకో ఇద్దరు మిత్రులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో 30వ నంబరు హైవేపై మంగళవారం ఉదయం జరిగింది. జబల్‌పూర్ పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని నాచారం, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది.. నాచారం కార్తికేయనగర్‌కు చెందిన స్వర్ణకారుడు సంతో్‌షకుమార్(48), నాచారం రాఘవేంద్రనగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శశికాంత్(38), దిల్‌సుఖ్‌నగర్ ముసారాంబాగ్‌కు చెందిన గోల్కొండ ఆనంద్‌కుమార్(47), సంతోష్ స్నేహితులు, నాచారం కార్తికేయనగర్‌కు చెందిన పాల వ్యాపారి మల్లారెడ్డి(60), శ్రీరాం బాలకిషన్, మెడికల్ దుకాణం నిర్వాహకుడు రోంపల్లి రవికుమార్(55), బ్యాంక్ ఆఫ్ బరోడా హిమాయత్‌నగర్ బ్రాంచిలో లాజిస్టిట్ మేనేజర్‌గా పనిచేసే తార్నాక గోఖలేనగర్‌కు చెందిన టి.వెంకట ప్రసాద్(49), కొత్తపేట్ న్యూమారుతీనగర్‌కు చెందిన సుంకోజు నవీనాచారి కలిసి.. నాచారం ఎర్రకుంటలో ఉంటున్న జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం రామరాయిని బంగ్లా గ్రామస్థుడు కల్కూరి బాలరాజు(30)కి చెందిన టెంపో ట్రావెలర్(ఏపీ29 డబ్ల్యూ1525)లో ఈ నెల 8న ప్రయాగ్‌రాజ్ వెళ్లారు.
ఆ రోజు ఆదివారం కావడం.. రద్దీ ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. సోమవారం పుణ్యస్నానాలు ఆచరించాక.. హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో టెంపోట్రావెలర్ రెండు సార్లు పంక్చర్ అయినట్లు సమాచారం. దీంతో.. కొందరు విమానంలో హైదరాబాద్ రావాలని నిర్ణయించుకుని, చార్జీలు ఎక్కువగా ఉండడంతో.. చివరి క్షణంలో విరమించుకున్నారు. మంగళవారం ఉదయం వీరి వాహనం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ సమీపంలోని షిగోరా పట్టణానికి చేరుకుంది. అప్పటికే అంతా బాగా అలసిపోవడంతో.. వాహనాన్ని ఎక్కడైనా నిలిపి, విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు. అయితే, ఉదయం 8.30 సమయంలో.. ఎదురుగా రాంగ్‌రూట్‌లో వచ్చిన సిమెంట్ లారీ వీరి వాహనాన్ని ఢీకొంది. దీంతో డ్రైవర్ బాలరాజు, సంతోష్, శశికాంత్, ఆనంద్‌కుమార్, మల్లారెడ్డి, రవి, వెంకటప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందారు. నవీనాచారి కాలు ఫ్రాక్చర్ అవ్వగా, బాలకిషన్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వీరికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. వీరిద్దరి పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి అధికారులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. రాత్రి 10.30 సమయంలో మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియను పూర్తిచేశామని, రెండు అంబులెన్సుల్లో హైదరాబాద్‌కు తరలిస్తున్నామని చెప్పారు. తెలంగాణ, ఏపీతోపాటు.. కేంద్ర మంత్రులు ఫోన్లు చేశారని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని జబల్‌పూర్ కలెక్టర్ వివరించారు.
టెంపోను ఢీకొన్న కారు
ఈ ప్రమాదంలో.. టెంపోట్రావెలర్‌ను వెనక నుంచి తెలంగాణకు చెందిన ఓ కారు ఢీకొంది. అయితే.. ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో.. కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
అనాథలైన ఇద్దరు పిల్లలు
సంతో్‌షకుమార్ భార్య గత ఏడాది మృతిచెందారు. రెండ్రోజుల్లో ఆమె సంవత్సరీకం ఉండగా.. కుంభమేళా వెళ్లొచ్చాక కార్యక్రమాన్ని నిర్వహించాలని సంతోష్ భావించారు. అంతలోనే రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో.. ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. పిల్లలిద్దరూ హాస్టల్‌లో ఉంటూ.. చదువుకుంటున్నారు. వారికి సంతోష్ మరణవార్త తెలియదని, విషయం ఎలా చెప్పాలోనంటూ సంతోష్ తల్లి విలపిస్తున్నారు.
స్వస్థలాల్లో విషాదాలు
మృతుల్లో సింహభాగం నాచారం ప్రాంతానికి చెందినవారు కాగా.. వారి స్వస్థలాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. సురకంటి మల్లారెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని ప్రొద్దుటూరు గ్రామం. కొన్నేళ్ల క్రితం మల్లారెడ్డి కుటుంబం నాచారానికి వలసవెళ్లి, పాల వ్యాపారం చేస్తూ స్థిరపడిందని గ్రామస్థులు తెలిపారు. డ్రైవర్ కల్కూరి బాలరాజు స్వస్థలమైన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం రామరాయిని బంగ్లా గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలరాజు భార్య మహేశ్వరి, పిల్లలు చంద్రనీల, యశ్వంత్ విలపిస్తున్నారు.
సీఎం, కేంద్ర మంత్రుల దిగ్ర్భాంతి
జబల్‌పూర్ రోడ్డు ప్రమాదం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. మృతదేహాలను హైదరాబాద్‌కు తరలించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీ ఈటల రాజేందర్ కూడా ఈ ఘటన దురదృష్టకరమైనదని వ్యాఖ్యానించారు.
అస్వస్థతకు గురై.. ఎల్లారెడ్డి వాసి మృతి
ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లిన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన మంగలి శంకర్(43) అస్వస్థతకు గురై మృతిచెందారు. వారం క్రితం ఆయన గ్రామస్థులతో కలిసి, కుంభమేళాకు వెళ్లారు. పుణ్యస్నానాలు ఆచరించాక.. ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో తోటి భక్తులు ఆయనను చికిత్స నిమిత్తం అలహాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం శంకర్ మృతిచెందారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం
ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News