Hyderabad: చరిత్ర మరవని రోజు.. సెప్టెంబర్ 17
ABN , Publish Date - Sep 17 , 2025 | 09:30 AM
తెలంగాణ చరిత్రలోనే మరచిపోలేనిది 1948 సెప్టెంబరు 17 ఘట్టం. ఈ ఘట్టంలో ప్రతినాయకుడు ఖాసీం రజ్వీ. ‘మజ్లిస్ ఎ ఇత్తేహాద్ ఉల్ ముస్లిమీన్’ సంస్థకు నాయకుడు. ఆయన స్వస్థలం మరఠ్వాడాలోని ఉస్మానాబాద్ జిల్లా లాతూర్. అలీగఢ్‌లో న్యాయశాస్త్రం అభ్యసించిన అనంతరం హైదరాబాద్‌లో కొంతకాలం వకీలు మహమ్మద్ అలీ ఫాజిల్ దగ్గర సహాయకుడిగా పనిచేశాడు.
హైదరాబాద్ సిటీ: తెలంగాణ చరిత్ర మరువని రోజు 1948 సెప్టెంబరు 17. అది నిజాం నిరంకుశత్వం తలవంచిన రోజు. రజాకార్ల ఆగడాలు అంతమైన రోజు. నాటి రెండు కోట్ల మంది తెలంగాణ ప్రజల హృదయాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడిన పర్వదినం. ఈ నేలపై త్రివర్ణపతాకం ఎగిరిన రోజు. నిజాం రాచరిక పాలన ముగిసి, హైదరాబాద్ రాజ్యం భారత ప్రభుత్వంలో కలిసిన ఆ రోజు వెనుక అనేక ఘటనలు ఉన్నాయి. అందులోని కొన్ని అంశాలు, ప్రముఖుల అభిప్రాయాలతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..
తెలంగాణ చరిత్రలోనే మరచిపోలేనిది 1948 సెప్టెంబరు 17 ఘట్టం. ఈ ఘట్టంలో ప్రతినాయకుడు ఖాసీం రజ్వీ. ‘మజ్లిస్ ఎ ఇత్తేహాద్ ఉల్ ముస్లిమీన్’ సంస్థకు నాయకుడు. ఆయన స్వస్థలం మరఠ్వాడాలోని ఉస్మానాబాద్ జిల్లా లాతూర్. అలీగఢ్‌లో న్యాయశాస్త్రం అభ్యసించిన అనంతరం హైదరాబాద్‌లో కొంతకాలం వకీలు మహమ్మద్ అలీ ఫాజిల్ దగ్గర సహాయకుడిగా పనిచేశాడు.
తర్వాత సొంతూరుకు వెళ్లిన అతను మజ్లిస్ స్థానిక నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందాడు. యావదాస్తిని ఆ సంస్థకు రాసిచ్చి నాయకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించాడు. కొద్దిరోజులకే సంస్థ పగ్గాలు చేపట్టాడు. సమయస్ఫూర్తి, వాగ్ధాటితో సామాన్యులను ఆకట్టుకున్న రజ్వీ నిజాం ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు. రజాకార్ ఉద్యమానికి నాయకత్వం వహించి, పలు హింసాత్మక ఘటనలకు కారకుడయ్యాడు. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం (పోలీసు చర్య) అనంతరం రజ్వీని భారత సైన్యం అరెస్టుచేసి తిరుమలగిరి సైనిక కారాగారంలో నిర్బంధించింది. 1957 సెప్టెంబరు 11న విడుదలైన రజ్వీ అదే నెల 18న నగరం నుంచి ముంబైకు, అక్కడి నుంచి పాకిస్థాన్‌కు వెళ్లిపోయాడు. కరాచీలో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టాడు. ఒకనాడు ఈ నేలను శాసించాలనుకున్న రజ్వీ 1970 జనవరి 15న ఓ సాధారణ వ్యక్తిగా కన్నుమూశాడు.

భయంతో ఆస్తులమ్మారు
ముస్లింలంతా రజాకార్లు కాదు. ఆ సమయంలో రజాకార్ల దాడి నుంచి ఎంతో మంది హిందువులను ముస్లింలు కాపాడారు. అయితే.. పోలీసు చర్యకు వారం ముందు ‘బక్రీదుకు గొర్రెలను కాదు, హిందువుల తలలు నరుకుతాం. వాళ్ల రక్తంతో హోలీ ఆడతాం’ అని రజాకార్ నాయకుడు ఖాసీం రజ్వీ ప్రకటించినట్లుగా నగర మంతా వదంతులు వ్యాపించాయి. దాంతో హిందువులంతా భయంతో ఆస్తిపాస్తులు అమ్ముకొని బతికినన్నాళ్లు ఆనందంగా జీవించాలని విందులు చేసుకున్నారు. అదే సమయంలో భారత సైన్యం ప్రవేశించడంతో నిజాం లొంగిపోయాడని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. యుద్ధ ట్యాంకులు, వాహనాలకు పూలమాలలు వేసి, భారత జవానులకు లడ్డూలు తినిపిస్తూ సంబురాలు చేసుకున్నారు. ఈ విషయాలన్నీ ప్రత్యక్ష సాక్షి మా అక్కచెప్పగా నాకు తెలిశాయి.
- పరవస్తు లోకేశ్వర్, నగర చరిత్ర పరిశోధకుడు
నిజాం ప్రధానిమీదా రజాకార్ల దాడి
హైదరాబాద్ సిటీ: నిజాం నిరంకుశ పాలనలో సామాన్యుల మానప్రాణాలను హరించిన రజాకార్లు నిజాం ప్రధాని మీదా దాడి చేయడం కొంత మందికే తెలుసు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని ఓ ఆస్పత్రి ఆవరణలో తలెత్తిన ఘర్షణలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలన్న కాంక్షతో కొంతమంది రజాకార్లు ఆనాటి ప్రధాని అధికారిక నివాసం షా మంజిల్(ప్రస్తుతం రాజ్‌భవన్)ను ముట్టడించారు. లోపల గృహోపకరణాలకు నిప్పుపెట్టారు. అంతటితో ఆగక ప్రధానమంత్రిపై సైతం దాడికి పాల్పడ్డారని మందుముల నర్సింహారావు జ్ఞాపకాల్లో ప్రస్తావించారు.
దక్కన్ రేడియోలో స్వాతంత్య్ర ప్రకటన
భారత ఆర్మీ 1948, సెప్టెంబరు18న నగరానికి చేరింది. అంతకు ఒకరోజు ముందు సెప్టెంబరు 17న ఖాసీం రజ్వీ హైదరాబాద్‌లో నరమేధానికి వ్యూహం పన్నాడు. ఈ విషయం తెలిసి ఉస్మానాబాద్ కలెక్టర్ మహమ్మద్ హైదర్ ఆనాటి నిజాం పోలీసు ఉన్నతాధికారి నవాజ్ దీన్‌యార్‌జంగ్ దగ్గరకు పరుగుతీశాడు. ఇరువురు ఫోన్‌ద్వారా రజ్వీకి నచ్చజెప్పి కల్లోలాన్ని ఆపించారు. ఈ విషయాన్ని మహమ్మద్ హైదర్ జ్ఞాపకాల్లో రాశారు. అంతకు ముందురోజే సైన్యాధ్యక్షుడు ఎల్.ఇద్రూస్ నిజాంను కలిసి సైన్యాన్ని ప్రతిఘటించడం వల్ల మరింత ప్రాణ నష్టం మినహా మరేమీ లేదని విన్నవించాడు. దీంతో సెప్టెంబరు 17న మొదట ఖాసీం రజ్వీ ఖైరతాబాద్‌లోని దక్కన్ రేడియో ద్వారా తన ఓటమిని అంగీకరించాడు. ఆ తర్వాత కేఎం మున్షీతో కలిసి దక్కన్ రేడియోకు చేరుకున్న నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్.. భారత సైన్యాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొన్ని వందల ఏళ్ల రాచరిక పాలన నుంచి ఈ నేలకు స్వాతంత్య్రం సిద్ధించింది. ప్రజలంతా ఆనందోత్సాహాలతో సంబురాలు చేసుకున్నారు. నగర వీధుల్లో జాతీయ జెండా ఎగరేశారు.
పోరాట చరిత్రను వక్రీకరించొద్దు
నిజాం వ్యతిరేక, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రతో సంబంధం లేని వాళ్లు విమోచనం అంటూ రాద్ధాంతం చేయడం సరికాదు. ఆ మహత్తర పోరాటంలో ప్రాణాలకు తెగించి మరీ పోరాడిన మేమంతా బతికుండగానే ఈ నేల చరిత్రను వక్రీకరిస్తున్నారు. త్యాగాలను అవమానిస్తున్నారు. కొత్త రాజకీయ ఎత్తుగడలో భాగంగానే వాళ్లు నాలుగేళ్లుగా విమోచనం పాటెత్తుకున్నారు. ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుల సాయుధ పోరాటం వల్లే హైదరాబాద్ సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనమైందనేది వాస్తవం.
- కందిమళ్ల ప్రతాపరెడ్డి, కార్యదర్శి, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్
కమ్యూనిస్టులకు ఆయుధాలు అందించా
నాది భూస్వామ్య కుటుంబమే అయినా, నిజాం వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్నాను. అప్పట్లో హెచ్‌ఎ్‌ససీ ప్రీ ఫైనల్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులనే వార్షిక పరీక్షలకు పంపేవారు. దీనికి వ్యతిరేకంగా ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ పెద్ద ఉద్యమమే లేవనెత్తింది. అందులో నేనూ పాల్గొన్నాను. అలా మగ్ధూం, జావెద్ రజ్వీ, సీహెచ్ రాజేశ్వరరావు, రాజ్‌బహదూర్ గౌర్ లాంటి కమ్యూనిస్టు నాయకులతో పరిచయం ఏర్పడింది. నిజాం వ్యతిరేక పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులకు ఎన్నోసార్లు మందుగుండు సామగ్రి, తుపాకులు లాంటి ఆయుధాలు రహస్యంగా అందించాను. కొన్నాళ్లు రహస్య జీవితం గడిపాను. కమ్యూనిస్టు పార్టీ చైతన్యంతో వారసత్వంగా వచ్చిన వందల ఎకరాల భూమిని పంచాను.
- మహ్మద్ ఖాజా మొయినుద్దీన్, నిజాం వ్యతిరేక పోరాటయోధుడు, 99ఏళ్లు
ఈ వార్తలు కూడా చదవండి..
అది నేలకొండపల్లి ఎందుకు కాకూడదు!?
సిందూర్ తో మసూద్ కుటుంబం చిన్నాభిన్నం
Read Latest Telangana News and National News