Mancherial: తనఖా బంగారంతో చెక్కేశాడు
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:45 AM
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంక్-2లో ఓ క్యాషియర్ చేతివాటం ప్రదర్శించాడనే వార్తలు దుమారం రేపుతున్నా యి. ఆన్‌లైన్ బెట్టింగ్ ఆడే అలవాటున్న సదరు క్యాషియర్.
చెన్నూరు ఎస్‌బీఐలో క్యాషియర్ చేతివాటం!
నాలుగు కిలోల బంగారం, కోటి నగదు మాయం
క్యాషియర్ రవీందర్‌పై ఆరోపణలు, కొనసాగుతున్న దర్యాప్తు
చెన్నూరు, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంక్-2లో ఓ క్యాషియర్ చేతివాటం ప్రదర్శించాడనే వార్తలు దుమారం రేపుతున్నా యి. ఆన్‌లైన్ బెట్టింగ్ ఆడే అలవాటున్న సదరు క్యాషియర్.. ఖాతాదారులకు చెందిన 4 కిలోల బంగారం, రూ.కోటి వరకు నగదు మాయం చేసి పరారయ్యాడని ప్రచారం జరుగుతోంది. బ్యాంకు లావాదేవీలపై ఆడిటింగ్ నిర్వహిస్తున్న బ్యాంకు ఉన్నతాధికారులు.. ఈ ఘటనపై పోలీసులకూ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో రవీందర్ అనే క్యాషియర్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గోల్డ్ లోన్ బంగారంతోపాటు నగదు నిల్వల్లో తేడాలను గమనించిన సదరు బ్యాంకు శాఖ మేనేజర్ మనోహర్‌రెడ్డి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో శుక్రవారం ఎస్‌బీఐ బ్యాంక్-2కు చేరుకున్న బ్యాంకు ఉన్నతాధికారులు ఆడిటింగ్ ప్రారంభించారు.
సుమారు 330 మంది గోల్డ్‌లోన్ ఖాతాదారులకు చెందిన దాదాపు 4 కిలోల బంగారం, డిపాజిట్లకు సంబంధించిన రూ.కోటి వరకు నగదు తేడా ఉన్నట్టు ప్రాథమికంగా తేలడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు బ్యాంకుకు చేరుకుని విచారణ ప్రారంభించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యాషియర్ రవీందర్ స్వస్థలం జైపూర్ మండలంలోని శెట్‌పల్లి కాగా రెండ్రోజులుగా అతను విధులకు హాజరు కావడం లేదు. అతని సెల్‌ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తుండడంతో రవీందర్‌పై అనుమానాలు అధికమవుతున్నాయి. రవీందర్ ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లకు పాల్పడతాడని ప్రాథమిక విచారణలో తేలింది. కాగా, బ్యాంకులో జరుగుతున్న ఆడిటింగ్ శుక్రవారానికి పూర్తవుతుందని, ఆ తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీపీ అంబర్ కిశోర్ ఝా విలేకరులకు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్
టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం
Read Latest AP News and National News