Share News

Panchayat Elections: సర్పంచ్‌గిరి.. వేలం వెర్రి..!

ABN , Publish Date - Nov 29 , 2025 | 04:24 AM

ఏకగ్రీవాలు ఆగడం లేదు. సరికదా.. జోరందుకుంటున్నాయి నామినేషన్ల హడావుడి, గ్రూపు రాజకీయాలు, విజయం కోసం ఎత్తులు పైఎత్తులతో కూడిన రాజకీయాలతో వేడెక్కే గ్రామాలు కూడా చిత్రంగా ఐక్యతా రాగం వినిపిస్తున్నాయ్‌. వీరో.. వారో ఎవరైతే నేమీ.. వేలంపాటలో పోటీపడండి.

Panchayat Elections: సర్పంచ్‌గిరి.. వేలం వెర్రి..!
Panchayat Elections

  • ఏకగ్రీవాల మాటున రూ.లక్షల్లో వేలం పాటలు

  • గద్వాల జిల్లాలో రెండోరోజు 12 గ్రామాల్లో ఏకగ్రీవం

  • మిట్టదొడ్డిలో 90 లక్షలు.. వీరాపురంలో 50 లక్షలు

  • సద్దలోనిపల్లిలో స్మశానవాటికకు రెండెకరాలిచ్చిన వ్యక్తికి దక్కిన పదవి

  • నేటితో తొలివిడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పూర్తి

  • 4,236 సర్పంచ్‌ పదవులకు 8,198 నామినేషన్లు

  • బలవంతపు ఏకగ్రీవాలను హైకోర్టులో సవాలు చేస్తాం

  • నిఘా వేదిక, స్థానిక ప్రభుత్వాల సాధికారిక వేదిక

  • గిరిజన ఓటరు ఒక్కరూ లేరు.. ఐనా ఎస్టీలకు రిజర్వ్‌!

  • అమ్రాబాద్‌ మండలంలోని 5 గ్రామాల పరిస్థితి

  • (ఆంధ్రజ్యోతి న్కూస్‌నెట్‌వర్క్‌)

ఏకగ్రీవాలు ఆగడం లేదు. సరికదా.. జోరందుకుంటున్నాయి! నామినేషన్ల హడావుడి, గ్రూపు రాజకీయాలు, విజయం కోసం ఎత్తులు పైఎత్తులతో కూడిన రాజకీయాలతో వేడెక్కే గ్రామాలు కూడా చిత్రంగా ఐక్యతా రాగం వినిపిస్తున్నాయ్‌. ‘వీరో.. వారో ఎవరైతే నేమీ.. వేలంపాటలో పోటీపడండి.. సర్పంచ్‌ అవ్వండి’ అంటున్నాయి. సర్పంచ్‌ పదవులకు వేలం నిర్వహించడంపై ఈసీ హెచ్చరించినా లెక్క చేయడం లేదు.. పోటీలో ఉండి పోటాపోటీగా ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేయడం కంటే గ్రామాభివృద్ధి కోసం వేలం పాట నిర్వహించి పదవిని ఏకగ్రీవం చేసుకుంటే తప్పేంటి? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. గద్వాల జిల్లాలో మొదటిరోజు నాలుగు పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. రెండోరోజు 12 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. గట్టు మండలం మిట్టదొడ్డిలో ఒక వ్యక్తి రూ.90 లక్షలకు పదవిని పాడుకొని సర్పంచ్‌ సాబ్‌ అయ్యాడు. పెంచికలపాడులో సర్పంచ్‌ ఉపసర్పంచ్‌ పదవులకు కలిపి రూ.40.5 లక్షలొచ్చాయి. ఆరగిద్దలో రూ.31 లక్షలు, తుమ్మలపల్లిలో రూ.30 లక్షలు, ముచ్చోనిపల్లిలో రూ.16 లక్షలు, తారాపురంలో రూ. 16 లక్షలకు ఆశావహులు పదవులు కొట్టేశారు. గద్వాల మండలం వీరాపురం గ్రామ సర్పంచ్‌ పదవి రూ.50 లక్షలు పలికింది. ఇదే మండలంలోని కుర్వపల్లిలో 45 లక్షలు, ఈడిగోనిపల్లిలో 10 లక్షలు, పుటాన్‌పల్లిలో 15 లక్షలకు సర్పంచు పదవులను ఏకగ్రీవం చేశారు.

కేటీదొడ్డి మండలం సుల్తానాపురంలో రూ.8లక్షలు, ధరూర్‌ మండలంలోని కొత్తపాలెంలో 26.50 లక్షలకు పదవులను అభ్యర్థులు దక్కించుకున్నారు. రెండోవిడత నోటిఫికేషన్‌ రాకముందే అయిజ మండలం ఈడిగోనిపల్లి సర్పంచ్‌ పదవిని రూ.7.50 లక్షలకు ఒకరు దక్కించుకోగా కిష్షాపురం గ్రామ సర్పంచ్‌ పదవి రూ.10.5 లక్షలు పలికింది. మల్దకల్‌ మండలం సద్దలోనిపల్లి గ్రామ స్మశాన వాటిక కోసం రెండు ఎకరాల స్థలం ఇచ్చినందుకు ఓ వ్యక్తికి సర్పంచ్‌ పదవిని కట్టబెట్టారు. మరోవైపు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేయాలని నిఘా వేదిక, స్థానిక ప్రభుత్వాల సాధికారిక వేదిక డిమాండ్‌ చేశాయి. బలవంతపు ఏకగ్రీవాలను హైకోర్టులో సవాలు చేస్తామని స్పష్టం చేశాయి. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఎస్‌ యాదయ్య గౌడ్‌తో కలిసి సంఘాల రాష్ట్ర కన్వీనర్లు వీవీ రావు, బండారు రామ్మోహన్‌ మాట్లాడారు. తాజా మాజీ సర్పంచ్‌లు ఎన్నో అప్పులు చేసి ఊర్లలో అభివృద్ధి పనులు చేశారని.. వారికి రావాల్సిన బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.


ఆలయాల నిర్మాణానికి ఓకే అని..

సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు మెంబర్లుగా ఏకగీవ్రంగా ఎన్నికయ్యే బృందం ఊర్లో రామమందిరం కట్టించాలి! ఇదీ నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని దాసరిగూడెం ప్రజలు పెట్టిన షరతు. శుక్రవారం గ్రామ ప్రజలంతా సమావేశమై ఈ మేరకు తీర్మానం చేశారు. ఊర్లో 836 మంది ఓటర్లున్నారు. 8 వార్డులున్నాయి. ఆలయ నిర్మాణం హామీతో పాటు గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు చేస్తామనే హామీ ఇవ్వడంతో సర్పంచ్‌గా ఉప్పుల వెంకట్‌రెడ్డి, ఉపసర్పంచ్‌గా పోలగోని జ్యోతిశ్రీను బాబును, వార్డుసభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ తీర్మానం చేశారు.

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జోగ్గూడెం గ్రామస్థులూ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. సర్పంచ్‌ పదవికి వేలం పాట నిర్వహించి.. వచ్చిన డబ్బుతో ఊర్లో ఆంజనేయ స్వామి ఆలయం కట్టుకుందామని నిర్ణయించారు. పార్టీలకతీతంగా నేతలు, ప్రజలు సమావేశమై వేలం పాట నిర్వహించారు. భూక్యా సైదమ్మ రూ.20 లక్షలకు పాడుకొని సర్పంచ్‌ పదవిని గెలుచుకుంది. ఈ డబ్బంతా నామినేషన్‌ వేసే సమయంలోనే గ్రామపెద్దలకు అప్పజెప్పాలనే అంగీకారం కుదిరింది.


రూపాయి సిక్కలతో నామినేషన్‌

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి సర్పంచ్‌ అభ్యర్థిగా జంగిలి మహేందర్‌ నామినేషన్‌ కింద కట్టిన 1000 రూపాయలను లెక్కించేందుకు సిబ్బంది కొంత శ్రమ పడ్డారు. ఎందుకో తెలుసా? ఆ రూ.వెయ్యిని అతడు పూర్తిగా రూపాయి సిక్కలతో చెల్లించారు. గత ఎన్నికల్లో మహేందర్‌ వార్డు మెంబరుగా పోటీ చేసి ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు.

బరిలో మాజీ మహిళా మావోయిస్టు

సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగాలపల్లి గ్రామ సర్పంచ్‌గా ఓ మాజీ మహిళా మావోయిస్టు నామినేషన్‌ వేశారు. ఆమే నేరళ్ల జ్యోతి అలియాస్‌ జ్యోతక్క! దాదాపు రెండు దశాబ్దాలు ఆమె మావోయిస్టు పార్టీలో జ్యోతి కొనసాగారు. దండకారణ్య ప్రాంతంలో దళ నాయకురాలిగా పని చేసిన ఆమె 2023లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనజీవన స్రవంతిలో కలిశారు. కొన్నాళ్లకు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

జోరుగా నామినేషన్లు

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలివిడత ఎన్నికలు జరిగే 189 మండలాల్లోని 4,236 సర్పంచ్‌ స్థానాలకుగాను రెండురోజుల్లో 8198 నామినే షన్లు దాఖలయ్యాయి. తొలిరోజు 3297రాగా.. శుక్రవారం 4901 నామినేషన్లు దాఖలయ్యాయి. వచ్చే నెల 11న జరిగే తొలి విడత ఎన్నికల కోసం నామినేషన్ల స్వీకరణకు శనివారం చివరిరోజు. కాగా తొలివిడత ఎన్నికలు జరిగే 37,440 వార్డు సభ్యుల స్థానాలకుగాను శుక్రవారం వరకు 11,502 మంది నామినేషన్లు దాఖలయినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Panchayat Elections: సర్పంచ్‌గిరి.. వేలం వెర్రి!

Hyderabad: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 10 గంటల నుంచి విద్యుత్ సరఫరా బంద్

Updated Date - Nov 29 , 2025 | 07:05 AM