Pending Applications: సాదాబైనామాపై ఏం చేద్దాం?
ABN , Publish Date - May 06 , 2025 | 04:51 AM
సాదాబైనామాల సమస్య పరిష్కారంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9.26 లక్షల మేర సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. పరిష్కారం విషయంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి.
అధికారుల మల్లగుల్లాలు 9.26 లక్షల దరఖాస్తులు పెండింగ్
గతంలో హైకోర్టులో పిల్ కౌంటర్ దాఖలు చేయని సీసీఎల్‌ఏ
తుది తీర్పు వచ్చే వరకు చట్టబద్ధత కల్పించొద్దన్న హైకోర్టు
రెండో దశ భూభారతి అమలులో సాదాబైనామా కేటగిరీ తొలగింపు
తొలి దశ నాలుగు మండలాల్లో ఈ కేటగిరీలోనే ఎక్కువ దరఖాస్తులు
భూభారతితోనే సాదాబైనామా సమస్యకు పరిష్కారాలు
హైదరాబాద్, మే 5 (ఆంధ్రజ్యోతి): సాదాబైనామాల సమస్య పరిష్కారంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9.26 లక్షల మేర సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. పరిష్కారం విషయంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. దాంతో అధికారులు భూభారతి చట్టాన్ని రెండో దశలో భాగంగా అమలు చేయనున్న 28 మండలాల్లో ‘సాదాబైనామా’ కేటగిరీని తాత్కాలికంగా తొలగించారు. తొలి దశలో నాలుగు పైలట్ మండలాల్లో మొత్తం 11,630 దరఖాస్తులు రాగా.. వీటిల్లో సాదాబైనామాలకు సంబంధించినవే 2,796 వరకు ఉన్నాయి. రెండో దశలోనూ ఈ తరహా దరఖాస్తులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశాలుండడం.. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండడంతో ఈ కేటగిరీని తాత్కాలికంగా తొలగించినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) ఇంకా కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. శక్తిమంతమైన కౌంటర్ వేసి, కేసును కొట్టివేయించాక.. సాదాబైనామాల సమస్య పరిష్కారంపై సర్కారు పూర్తిస్థాయిలో దృష్టి సారించే అవకాశాలున్నాయి.
దరఖాస్తుల పెండింగ్‌కు కారణాలివే..
ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 9.26 లక్షల మేర సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిల్లో ధరణికి ముందు వరకు ఉన్న దరఖాస్తులు 2.26 లక్షలు. ఇవన్నీ జూన్ 2, 2014కు ముందు జరిగిన సాదాబైనామా లావాదేవీలే. పాత ఆర్వోఆర్ చట్టం రద్దయి.. ధరణి అమల్లోకి వచ్చిన (అక్టోబరు 28, 2020) తర్వాత మరో 7 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నీ 2020 అక్టోబరు 28వ తేదీ కటా్‌ఫ(జీవో 122 ప్రకారం)గా వచ్చినవే. అయితే.. సాదాబైనామాల విషయంలో సర్కారు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. నిర్మల్‌కు చెందిన ఓ రైతు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని(పిల్) దాఖలు చేశారు. రద్దు చేసిన చట్టం ఆధారంగా దరఖాస్తులను ఎలా స్వీకరిస్తారని తన పిటిషన్‌లో ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. 2020 నవంబరు 11న తీర్పునిచ్చింది. 2020 అక్టోబరు 29 తరువాత వచ్చిన సాదాబైనామా దరఖాస్తుల పరిశీలనను నిలిపివేయాలని ఆదేశించింది. ఆ ఏడాది అక్టోబరు 12 నుంచి 28 మధ్య వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలనలోకి తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే తుది తీర్పు వరకు వాటికి కల్పించే చట్టబద్ధత నిలిపివేయాలని ఆదేశించింది. న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు ప్రభుత్వం అడ్వొకేట్ జనరల్(ఏజీ) ద్వారా కౌంటర్ దాఖలు చేసి.. సాదాబైనామాపై ఉన్న పెండింగ్ కేసును కొట్టివేయించాల్సి ఉంది. కోర్టు 2020లో ఇచ్చిన మధ్యంతర ఆదేశాల సమయానికి ధరణిలో సాదాబైనామాల దరఖాస్తుల పరిష్కారానికి చట్టబద్ధత లేదు. కానీ, భూభారతి చట్టంలో ప్రభుత్వం సాదాబైనామా సమస్యలకు పరిష్కారాలను సూచించింది. భూభారతిలో ఈ సమస్య చట్టబద్ధమైనదే కావడంతో.. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ఆస్కారముంది. అయితే.. అధికారులు మాత్రం కేసు తేలే వరకు కటా్‌ఫ(అక్టోబరు 28, 2020)కి ముందు వరకు వచ్చి 2.26 లక్షల దరఖాస్తులకు పరిష్కారం చూపాలని భావిస్తున్నారు. నిర్మల్ రైతు వేసిన పిల్‌ను కోర్టు కొట్టివేసిన తర్వాత.. మిగతా 7 లక్షల దరఖాస్తులకు పరిష్కారం చూపవచ్చని నిర్ణయించినట్లు తెలిసింది.
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..?
సాదాబైనామా చట్టబద్ధతకు కొన్ని ముఖ్యమైన అర్హతలను ప్రభుత్వం భూభారతి చట్టంలో పేర్కొంది. అవి..
సాదాబైనామా ఒప్పందం 2014 జూన్ 2కు ముందు జరిగి ఉండాలి
ఒప్పందం చేసుకున్న వ్యక్తి చిన్న/సన్నకారు రైతు అయ్యి ఉండాలి
భూపరిమితి విధించింది. అంటే.. 2.5 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట భూమి దాటని సాదాబైనామాలను పరిష్కరించాలని నిర్ణయించింది
కొనుగోలు చేసిన భూమి గ్రామీణ ప్రాంతంలోనే ఉండాలి. నగర ప్రాంతాలకు ఈ నిబంధన వర్తించదు
సాదాబైనామా ఒప్పందం ద్వారా కొనుగోలు చేసిన భూమి అనుభవంలో ఉండాలి
భూభారతితో పరిష్కారం
గతంలో ధరణి చట్టానికి చట్టబద్ధత లేనందున సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి అవకాశం లేదు. అందుకే కోర్టు 2020 అక్టోబరు 29 తరువాత వచ్చిన సాదాబైనామా దరఖాస్తులను నిలిపివేయాలని ఆదేశించింది. భూభారతి చట్టంలో ఈ సమస్యకు చట్టబద్ధత కల్పించినందున పరిష్కరించేందుకు వీలుంది. అయితే పాత కేసులో తుది తీర్పు వచ్చే వరకు పాత దరఖాస్తుల చట్టబద్ధతను నిలిపివేయాలని కోర్టు ఆదేశించినందున.. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసి.. కేసు కొట్టివేయించవచ్చు. ఆ తర్వాత సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవచ్చు.
- భూమి సునీల్, భూ చట్టాల నిపుణుడు
ఈ వార్తలు కూడా చదవండి..
Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..
WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
TGSRTC: బస్ భవన్‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం
For Telangna News And Telugu News