Share News

Regional Ring Road: ఆర్‌ ఆర్‌ ఆర్‌ పక్కనే రైలు!

ABN , Publish Date - Jul 21 , 2025 | 04:10 AM

రాష్ట్రంలో రీజినల్‌ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు సమాంతరంగా ప్రతిపాదించిన రైలు మార్గంలో మార్పు జరగనుంది. రీజినల్‌ రింగు రైలుగా పిలుస్తున్న ఈ మార్గాన్ని.. రీజినల్‌ రింగు రోడ్డుకు సమాంతరంగా నాలుగైదు కిలోమీటర్ల దూరంలో నిర్మించాలని గతంలో నిర్ణయించారు.

Regional Ring Road: ఆర్‌ ఆర్‌ ఆర్‌  పక్కనే రైలు!

  • ఇప్పటివరకు రింగు రోడ్డుకు 4-5 కిలోమీటర్ల దూరంలో రైల్వే మార్గం నిర్మాణానికి సర్వే

  • రెండూ పక్కపక్కనే నిర్మిస్తే మేలనే నిర్ణయానికి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

  • భూసేకరణ ఇబ్బంది తప్పడంతోపాటు రవాణా, ప్రయాణాలకు అనుకూలం.. మళ్లీ కొత్తగా సర్వే!

  • ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతికి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రోడ్డు.. ఆ రోడ్డు పక్కనే హైస్పీడ్‌ రైలు

  • రోడ్డు, రైలు మార్గాలకు కలిపే భూసేకరణ.. ఢిల్లీలో కీలక చర్చ.. కేంద్రం పచ్చజెండా!

హైదరాబాద్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రీజినల్‌ రింగురోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు సమాంతరంగా ప్రతిపాదించిన రైలు మార్గంలో మార్పు జరగనుంది. రీజినల్‌ రింగు రైలుగా పిలుస్తున్న ఈ మార్గాన్ని.. రీజినల్‌ రింగు రోడ్డుకు సమాంతరంగా నాలుగైదు కిలోమీటర్ల దూరంలో నిర్మించాలని గతంలో నిర్ణయించారు. కానీ రోడ్డు పక్కనే రైల్వే మార్గం నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమికంగా నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల సీఎం ఢిల్లీ పర్యటనలో దీనిపై చర్చ జరిగిందని, కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చిందని తెలిసింది. ఇప్పటికే జరుగుతున్న సర్వే ప్రకారం.. రీజినల్‌ రింగు రోడ్డుకు, రైలు మార్గానికి మధ్య సుమారు 4-5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రోడ్డు, రైలు మార్గాలు రెండూ ఒకే జిల్లాలు, ప్రాంతాల మీదుగా వెళతాయి. ఈ క్రమంలో రెండింటి కోసం వేర్వేరు చోట్ల భూసేకరణ చేయడం ఇబ్బందికరంగా మారుతుందని, ప్రజలకూ సమస్యేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. వాటిని పక్కపక్కనే నిర్మిస్తే భూసేకరణ ఇబ్బంది తగ్గుతుందని, సరుకు రవాణాకు, ప్రజల ప్రయాణాలకు సులువుగా ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే రెండింటినీ పక్కపక్కనే నిర్మించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.


అమరావతికి హైస్పీడ్‌ రైలు, గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు..

ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో హైదరాబాద్‌-విజయవాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రోడ్డు (పాత రహదారులను వాడకుండా పూర్తిగా కొత్త అలైన్‌మెంట్‌తో నిర్మించే రోడ్డు) నిర్మాణానికి హామీ ఉంది. ఈ క్రమంలో ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి వరకు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను, ఇదే ప్రాంతంలో నిర్మించాలని భావిస్తున్న డ్రైపోర్టు నుంచి మచిలీపట్నం పోర్టు వరకు కొత్త రైలు మార్గాన్ని మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఇక్కడ కూడా గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేకు పక్కనే కొత్త రైలు మార్గాన్ని నిర్మిస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇక్కడి రైలు మార్గాన్ని ‘హైస్పీడ్‌’ కారిడార్‌గా నిర్మించాలని.. అది రెండు రాష్ట్రాలకే కాకుండా ఇరుగుపొరుగు రాష్ట్రాలకు కూడా ఉపయుక్తమని భావిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయిన సందర్భంగా ఈ అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. సీఎం ఆలోచన బాగుందని ప్రశంసించిన కేంద్రమంత్రి.. అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని సూచించినట్టు తెలిసింది. మరోవైపు ప్యూచర్‌సిటీ నుంచి అమరావతికి నిర్మించే రోడ్డు ఏయే ప్రాంతాల మీదుగా చేపట్టాలనే అంశాన్ని పరిశీలించే బాధ్యతను ఒక సంస్థకు అప్పగించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈరోడ్డు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు, నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడకు దక్షిణం వైపుగా ఉండనుంది.


రూ.15,750 కోట్లతో రైల్వే ప్రాజెక్టు..

దేశవ్యాప్తంగా రైలు మార్గాల విస్తరణలో భాగంగా కేంద్రం 2023లో తెలంగాణకు రీజినల్‌ రింగు రైలు ప్రాజెక్టును మంజూరు చేసింది. వికారాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, మహూబూబ్‌నగర్‌ జిల్లాల మీదుగా ఈ రైలు మార్గాన్ని ప్రతిపాదించారు. నిర్మాణానికి దాదాపు రూ.15,750 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. వివిధ రకాల సర్వేలు నిర్వహించిన అధికారులు.. తాజాగా ఫైనల్‌ లొకేషన్‌ సర్వే (ఎఫ్‌ఎ్‌సఎల్‌) పూర్తిచేశారు. భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ ఏదీ ప్రారంభం కాలేదు. ఈ క్రమంలోనే తొలి ప్రతిపాదనను ఉపసంహరించుకుని.. రీజినల్‌ రింగు రోడ్డు పక్కనే రైలు మార్గాన్ని నిర్మించాలనే అంశం తెరపైకి వచ్చింది. దీనితో రీజినల్‌ రోడ్డు కోసం సేకరించే భూమికి పక్కనే.. రైలు మార్గానికి అవసరమైన భూమిని సేకరించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక, టీవీ చానల్‌

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 05:55 AM