CM Revanth Reddy: ఆ పార్టీ బీఆరెస్సెస్
ABN , Publish Date - Jan 16 , 2025 | 03:23 AM
బీఆర్‌ఎస్ పార్టీ ‘బీఆరెస్సె్‌స’గా మారిందని, ఆరెస్సెస్ భావజాలంతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా బీజేపీ ఏ ఆరోపణలు చేస్తోందో..

ఆరెస్సెస్ భావజాలంతో ప్రజల్లోకి వెళ్లడానికి బీఆర్‌ఎస్ యత్నం
కాంగ్రె్‌సపై బీజేపీ చేసే ఆరోపణలే ఆ పార్టీ తెలంగాణలో చేస్తోంది
ఆరెస్సె్‌సతో కాంగ్రె్‌సది సిద్ధాంతపరమైన వైరుధ్యం
సంఘ్‌కు, స్వాతంత్య్ర పోరాటానికి అసలు సంబంధమే లేదు
స్వాతంత్య్ర పోరాటాన్ని వక్రీకరించిన భాగవత్‌పై చర్యలుండాలి
మోదీ.. భాగవత్ వైపా? స్వాతంత్య్ర సమరయోధుల వైపా?
కాంగ్రెస్ కొత్త కార్యాలయం దేశ ప్రయోజనాలకు వేదిక కానుంది
బీఆర్‌ఎస్ నుంచి మేం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు: రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం
హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, దామోదర
న్యూఢిల్లీ, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పార్టీ ‘బీఆరెస్సె్‌స’గా మారిందని, ఆరెస్సెస్ భావజాలంతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా బీజేపీ ఏ ఆరోపణలు చేస్తోందో.. తెలంగాణలో బీఆర్‌ఎస్ కూడా అవే ఆరోపణలు చేస్తోందన్నారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినట్లు ఆరెస్సెస్‌తో కాంగ్రె్‌సది సిద్ధాంతపరమైన వైరుధ్యమని చెప్పారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆరెస్సెస్ ఏనాడూ, ఎలాంటి పోరాటం చేయలేదని, ఆ సంస్థలోని వ్యక్తులు ఎలాంటి త్యాగాలు చేయలేదని విమర్శించారు. స్వాతంత్య్ర పోరాటాన్ని ప్రశంసించేందుకు, ప్రజలకు చెప్పేందుకు ఆరెస్సెస్ సిద్ధంగా లేదని, స్వాతంత్య్ర పోరాటాన్ని వక్రీకరించడమే వాళ్ల వాస్తవ సిద్ధాంతమని విమర్శించారు. ఆర్‌ఎ్‌సఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలు కూడా అందుకు నిదర్శనమని, స్వాతంత్య్ర పోరాటంతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. మోహన్ భాగవత్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపనతోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందన్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర పోరాటాన్ని ఎవరైనా వక్రీకరిస్తే వారిపై చట్టపరమైన విచారణ చేయాలని, ఆ క్రమంలోనే మోహన్ భగవత్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీని తను డిమాండ్ చేసినట్లు తెలిపారు. ప్రధాని మోదీ భాగవత్‌తో ఉన్నారా లేక దేశ స్వాతంత్య్ర సమరయోధుల వెంట ఉండి భాగవత్‌పై చర్యలు తీసుకుంటారా.. అనేది స్పష్టం చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు కాంగ్రె్‌సపై తప్పుడు ఆరోపణలు చేస్తూ భాగవత్ వ్యాఖ్యలను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ వాళ్లు తప్పుడు ఆరోపణలు చేయడంలో ఉద్ధండులని, అందుకే ఆ పార్టీని తాము భారతీయ ఝూటా పార్టీ అంటున్నామని రేవంత్ ఎద్దేవా చేశారు.
140 ఏళ్ల తర్వాత సొంత కార్యాలయం.. నిస్వార్ధ సేవకు నిదర్శనం
భారత్‌ను బలమైన, శక్తివంతమైన దేశంగా మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయం వేదికగా ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ కార్యాలయం దేశ ప్రయోజనాలకు వేదిక కాబోతుందన్నారు. దేశంలోని దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనార్టీలు, బలహీనవర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం 140 ఏళ్లుగా కృషి చేస్తోన్న కాంగ్రెస్.. ఇన్నేళ్లకు సొంత కార్యాలయాన్ని నిర్మించుకుందన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసిందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. 40 ఏళ్ల కింద ఆవిర్భవించిన బీజేపీ, 140 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఆర్థిక స్థితిగతులను పరిశీలించినా ఇది అర్థం అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం దేశ ప్రజలకు పండుగ రోజని రేవంత్ అభిప్రాయపడ్డారు. కొత్త భవనంలోకి కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం మారడాన్ని చరిత్రాత్మక ఘట్టంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభివర్ణించారు. కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన కూడా పాల్గొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం, రాహుల్ గాంధీ ప్రధాని అవడం ఖాయమన్నారు. కాగా, పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ మహే్‌షగౌడ్, ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, ఏఐసీసీ కోఆర్డినేటర్ కొప్పుల రాజు, ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కార్, రఘువీర్‌రెడ్డి, పార్టీ నేతలు గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్ పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో కాంగ్రెస్ ఆఫీసులపై దాడులు
తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బీఆర్‌ఎస్ వాళ్లు పోలీసులతో కలిసి కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు చేశారని రేవంత్ అన్నారు. తాము ఆలా చేయడం లేదని చెప్పారు. బీఆర్‌ఎస్ నుంచి తాము నేర్చుకోవాల్సింది ఏమీ లేదన్నారు. ఎక్కడైనా, ఎవరిపైన అయినా దాడులు జరిగితే పోలీసులు చర్యలు చేపడతారని, శాంతి భద్రతల సమస్య తలెత్తితే పోలీసులు జోక్యం చేసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో చట్టం ప్రకారం పాలనను కొనసాగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు. ఎక్కడైనా తప్పు జరిగితే దానిని సరిదిద్దుకొంటున్నామని చెప్పారు.
నేడు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ భేటీ
న్యూఢిల్లీ, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి గురువారం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌తోపాటు ఇతర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది.