Retirement Crisis: విశ్రాంత జీవితం.. వేదనాభరితం
ABN , Publish Date - Aug 15 , 2025 | 03:39 AM
వీరు ఇద్దరే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ విరమణ చేసిన దాదాపు ఎనిమిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల మనో వేదన ఇది. మూడు, మూడున్నర దశాబ్దాలపాటు ప్రభుత్వానికి సేవ చేశారు.
8000 మంది విశ్రాంత ఉద్యోగుల విరమణ కష్టాలు
పిల్లలకు పెళ్లిళ్లు చేయలేక.. పెద్ద చదువులు చదివించలేక..
అనారోగ్యానికి చికిత్స చేయించుకోలేక ఇబ్బందులు
కూతురిని కోల్పోయి గుండెపోటుతో మరణించిన విశ్రాంత ఇన్‌స్పెక్టర్
రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంచనా వేసుకుని కట్నం ఇచ్చేందుకు హామీ
సకాలంలో ఇవ్వకపోవడంతో అల్లుడి వేధింపులు.. కూతురి ఆత్మహత్య
సర్కారు నుంచి 75 లక్షలు రావాల్సి ఉన్నా క్యాన్సర్ చికిత్సకు ఇబ్బందులు
పీఎఫ్ కూడా ఇవ్వడం లేదని విశ్రాంత ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ ఆవేదన
ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ.. లక్షలు రావాల్సి ఉన్నా తప్పని ఇబ్బందులు
రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ.5000 కోట్లు పెండింగ్
హామీ ఇచ్చినా.. కమిటీ వేసినా పరిష్కారం కాని సమస్య
బాలకృష్ణ.. పోలీస్ శాఖలో 32 ఏళ్లు సర్వీసు చేసి 2024 మేలో ఇన్‌స్పెక్టర్ హోదాలో ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు దాదాపు రూ.65 లక్షలకుపైగా పదవీ విరమణ ప్రయోజనాలు రావాల్సి ఉంది. వాటిని అంచనా వేసుకుని.. కూతురి పెళ్లి సమయంలో కొంత కట్నం ఇస్తానని అల్లుడికి చెప్పారు. సమయానికి డబ్బులు అందలేదు. కట్నం ఇవ్వాలంటూ అల్లుడి వేధింపులు మొదలయ్యాయి. వాటిని తట్టుకోలేక కూతురు ఆత్మహత్య చేసుకుంది. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ రాలేదన్న మనోవేదనకు తోడు కూతురి దుర్మరణంతో చివరకు ఆయన కూడా ఈ ఏడాది జూలై 26న గుండె పోటుతో మరణించారు. ఇప్పటికీ ఆయనకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం గమనార్హం.
రోడ్లు, భవనాల శాఖలో 33 ఏళ్లపాటు పని చేసిన ఎన్. వెంకటేశ్ ఎస్‌ఈ (ఎఫ్‌ఏసీ) హోదాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం అబ్డామిన్ క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే సుమారు రూ.30 లక్షలకుపైగా ఖర్చు చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఆయనకు ప్రభుత్వం నుంచి దాదాపు రూ.75 లక్షలు రావాల్సి ఉంది. అవి రాకపోవడం, క్యాన్సర్ చికిత్సకు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తుండడంతో ఆర్థికంగా ఆయన తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం జీతంతో తాను దాచుకున్న పీఎ్‌ఫను కూడా ఇప్పటి వరకూ ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవీ విరమణ ప్రయోజనాలను అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
... వీరు ఇద్దరే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ విరమణ చేసిన దాదాపు ఎనిమిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల మనో వేదన ఇది. మూడు, మూడున్నర దశాబ్దాలపాటు ప్రభుత్వానికి సేవ చేశారు. అందుకు బహుమతిగా పదవీ విరమణ చేసేనాటికే కొందరు అనారోగ్యాల పాలయ్యారు. మరి కొందరికి పిల్లలు పెద్ద చదువులకు, పెళ్లిళ్లకు వచ్చారు. ఇంకొందరికి పదవీ కాలంలో చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఉద్యోగంలో ఉన్నప్పుడు తాము దాచుకున్న డబ్బు.. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన సొమ్ములు మలి వయసులో తమకు ఆసరా అవుతాయని అంతా భావించారు. కానీ, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో కానీ వారికి అందాల్సిన ఉద్యోగ విరమణ ప్రయోజనాలు మాత్రం వారికి అందలేదు. వెరసి, సర్కారు నుంచి తమకు లక్షలు వచ్చే పరిస్థితి ఉన్నా చేతిలో చిల్లిగవ్వ లేక వేలాదిమంది విశ్రాంత ఉద్యోగులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వాటి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటున్నామని, అప్పులు చేయాల్సి వస్తోందని, ప్రభుత్వం నుంచి తమకు హక్కుగా దక్కాల్సిన ఉద్యోగ విరమణ ప్రయోజనాలను అందించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.
ఒక్కొక్కరికి రూ.35 లక్షలకుపైగా..
ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పెద్దఎత్తున రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2021లో వారి పదవీ విరమణ వయసును 59 నుంచి 61కి పెంచింది. రెండేళ్లపాటు నిలిచిపోయిన పదవీ విరమణలు 2023 నుంచి డబుల్ స్పీడ్‌లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఈ ఏడాది జూలై చివరి వరకూ ఎనిమిది వేల మందికిపైగా ఉద్యోగులు పదవీ విరమణ చేసి ఉంటారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. రిటైరైన వారికి గ్రాట్యుటీ (ఉద్యోగి సర్వీ్‌సను బట్టి, హోదాను బట్టి ప్రభుత్వం అందించే నగదు), జీపీఎఫ్, కమ్యుటేషన్, టీజీఎల్, జీఐఎస్, సరెండర్ లీవ్స్ కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఒక్కో ఉద్యోగికి వారి హోదాలను బట్టి దాదాపు రూ.35 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు అందుతుంది. ఈ లెక్కన విశ్రాంత ఉద్యోగులకు దాదాపు రూ.5 వేల కోట్ల వరకూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సి ఉంది. నిజానికి, రిటైరయ్యే ఉద్యోగులకు సంబంధించి 3-4 నెలల ముందుగానే వారికి అందాల్సిన బెనిఫిట్స్‌ను లెక్కగట్టి, పదవీ విరమణ పొందే సమయానికి అందించేలా చర్యలు తీసుకోవాలి. కానీ, రిటైరైన తర్వాత ఏళ్లు గడిచినా ప్రభుత్వాలు వాటిని అందించడం లేదు. ఇక, ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగుతున్న వారి పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. వారికి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల వరకూ బకాయిలు ఉన్నట్లు సమాచారం. వారికి దాదాపు 32 రకాల ప్రయోజనాల కింద చెల్లింపులు చేయాల్సి ఉన్నా.. చేయడం లేదు. జీపీఎఫ్ కోసం దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడుస్తోందని, అయినా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. హెల్త్ కార్డు సమస్య కూడా కొలిక్కి రాలేదు. తమకు హక్కుగా అందాల్సిన బెనిఫిట్స్‌ను ప్రభుత్వం సమయానికి అందించడం లేదంటూ కొంత మంది కోర్టులను కూడా ఆశ్రయించారు. కోర్టులు కూడా పలు సూచనలు చేశాయి. అయినా ప్రయోజనం లేదు. ఈ సమస్యల పరిష్కారానికి నెలకు రూ.850 కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకూ బడ్జెట్ కేటాయిస్తామని ప్రభుత్వం పలు మార్లు హామీ ఇచ్చింది. కానీ, అమల్లో మాత్రం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
కమిటీ వేసినా పరిష్కారం కాని సమస్యలు
రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముగ్గురు అధికారులతో కమిటీని నియమించింది. మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయినా ఇంతవరకూ సమస్యలు పరిష్కారం కాలేదు. వారి 63 డిమాండ్లలో ఆర్థికేతర అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారుల కమిటీ గతంలో చెప్పింది. కానీ, వాటిలో మొదట ఏ అంశాన్ని పరిష్కరించేదీ స్పష్టత ఇవ్వలేదు. కొద్ది కాలం కిందట ఉద్యోగులు ఆందోళనకు పిలుపు ఇచ్చినప్పుడు ఒక డీఏ చెల్లించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, ఇప్పటి వరకూ వాటిపై అడుగు ముందుకు పడలేదు. కాగా రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగులు, ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలపై తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు గురువారం ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రితో భేటీ అయ్యారు. సమస్యలను ఆయనకు వివరించారు. త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామని ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు.
- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్
కోర్టులు చెబితేనే..
ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అందకపోవడం, అనారోగ్య సమస్యల కారణంగా సుమారు 14-15 మంది వరకు మరణించారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఇక, 2024 మార్చి నుంచి 2025 జూలై వరకు పోలీసు శాఖలో ఇన్‌స్పెక్టర్ల హోదాలో దాదాపు 1000 మంది వరకు రిటైర్ అయ్యారు. తమకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడం లేదంటూ వీరిలో 432 మంది కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు వీరిలో ఇప్పటి వరకు 232 మందికి బెనిఫిట్స్ అందాయి. దాంతో, కోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయలేదని తెలుపుతూ మరో 14 మంది బుధవారం మళ్లీ కోర్టును ఆశ్రయించారని రిటైరయిన ఓ ఇన్‌స్పెక్టర్ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసుల విద్యార్హతపై.. డీజీపీ కీలక వ్యాఖ్యలు
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ