Share News

Regional Ring Railway Project: ఆర్‌ఆర్‌ రైలుకు 6 వేల ఎకరాలు

ABN , Publish Date - Sep 12 , 2025 | 04:50 AM

తెలంగాణకు కేంద్రం మంజూరు చేసిన రీజినల్‌ రింగు రైలు అలైన్‌మెంట్‌ మారింది. రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు 10 కిలోమీటర్ల దూరంలో నిర్మించాలని తొలుత అనుకున్నప్పటికీ..

Regional Ring Railway Project: ఆర్‌ఆర్‌ రైలుకు 6 వేల ఎకరాలు

  • రీజినల్‌ రింగు రోడ్డు పక్కనే రీజినల్‌ రింగు రైలు

  • 45 మీటర్ల వెడల్పుతో రైలు మార్గం.. రూ.25 వేల కోట్ల వ్యయం

  • రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు తెలిపిన రైల్వే అధికారులు

  • తొలుత ఆర్‌ఆర్‌ఆర్‌కు 10 కి.మీ. దూరంలో నిర్మాణానికి యోచన

  • తాజాగా ట్రిపుల్‌ ఆర్‌ పక్కనే నిర్మించాలని కేంద్రం, రాష్ట్రం నిర్ణయం

  • రింగు రైలుఅలైన్‌మెంట్‌ మారిందని ముందేచెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

  • 350 కి.మీ వేగంతో హైదరాబాద్‌ నుంచి చెన్నై, బెంగళూరుకు రైళ్లు

  • భారీ వ్యయంతో రెండు కారిడార్లను నిర్మించనున్న కేంద్రం

హైదరాబాద్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు కేంద్రం మంజూరు చేసిన రీజినల్‌ రింగు రైలు అలైన్‌మెంట్‌ మారింది. రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు 10 కిలోమీటర్ల దూరంలో నిర్మించాలని తొలుత అనుకున్నప్పటికీ.. ఈ రైలు మార్గాన్ని రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు పక్కనే నిర్మించాలనే నిర్ణయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చాయి. ఈమేరకు.. మార్చిన రైలు మార్గం అలైన్‌మెంట్‌పై గురువారం సీఎం రేవంత్‌ కేంద్ర రైల్వే శాఖ ఉన్నతాఽధికారులతో కలిసి సమీక్షించారు. రాష్ట్రానికి రింగు రైలు మంజూరైనప్పుడు అనుకున్న అలైన్‌మెంట్‌.. ఇప్పుడు రింగు రోడ్డు పక్కనే రైలును నిర్మించేందుకు రూపొందించిన ప్రాథమిక అలైన్‌మెంట్ల వివరాలను రైల్వే అధికారులు సీఎంకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపంలో తెలియజేశారు. తాజాగా రూపొందించిన అలైన్‌మెంట్‌ ప్రకారం రీజినల్‌ రింగు రోడ్డు పక్కనే రైలు మార్గాన్ని నిర్మించేందు కు 45 మీటర్ల వెడల్పుతో భూమి కావాలని తెలిపారు. అలాగే 362 కిలోమీటర్ల మేర రైలుమార్గం ఉంటుందని, ఈ మధ్యలో దాదాపు 19 స్టేషన్లు వస్తాయని వివరించారు. రైలు మార్గం, స్టేషన్ల నిర్మాణం, భూసేకరణ పరిహారం.. వీటన్నింటికీ కలిపి దాదాపు రూ.25,550 కోట్ల వరకూ ఖర్చవుతుందని వెల్లడించారు. ప్రస్తుత ం తెలంగాణ, హైదరాబాద్‌ మీదుగా వెళ్తున్న రైలు మార్గాల్లో సుమారు 6 మార్గాలకు సంబంధించిన స్టేషన్లు కూడా దీంతో అనుసంధానమవుతాయని పేర్కొన్నారు. రింగు రైలు మార్గం కోసం 4030 ఎకరాలు, రైల్వే స్టేషన్ల నిర్మాణం కోసం 1090 ఎకరాలు, ఇతర రైలు మార్గాల కనెక్టివిటీల కోసం 937 ఎకరాలు.. ఇలా మొత్తం 6 వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని తెలిపారు. కాగా రీజినల్‌ రింగు రైలు అలైన్‌మెంటు మారుతోందని, రీజినల్‌ రింగు రోడ్డుకు పక్కనే రాబోతుందని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది. ‘ఆర్‌ ఆర్‌ఆర్‌ పక్కనే రైలు’ శీర్షికన జూలై 21న ఒక కథనాన్ని ప్రచురించింది.


ఆ 45 మీటర్ల భూమి సర్దుబాటు ఎలా?

రింగు రోడ్డు పక్కనే రైలు నిర్మాణానికి అవసరమైన 45 మీటర్ల భూమి విషయమే సందిగ్ధంగా మారింది. రింగు రోడ్డు ఉత్తరభాగం నిర్మాణానికి అవసరమై భూమిలో దాదాపు భూ సేకరణ చివరిదశకు చేరింది. దక్షిణభాగంలో ఇంకా భూ సేకరణ ప్రారంభంకాలేదు. కాబట్టి ఈ భాగంలో రో డ్డు, రైలు మార్గాలకు అవసరమైన మేరకు భూమిని సేకరించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఉత్తరభాగం వైపు రైలు మార్గానికి అవసరమైన భూ మిని ఎలా సర్దుబాటు చేయాలనేదానిపైనే ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ మార్గంలో రోడ్డు కోసం ఇప్పటికే 100 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరించారు, మళ్లీ ఇప్పుడు దీనికి అదనంగా 45మీటర్లను సేకరించేందుకు ఉన్న అవకాశాలు, ఏర్పాట్లపై సమాలోచనలు చేస్తోంది.

హైస్పీడ్‌ రైళ్లు..

హైదరాబాద్‌ మీదుగా చెన్నై, బెంగళూరు వరకు వేర్వేరుగా రెండు హై స్పీడ్‌ రైల్‌ కారిడార్లను నిర్మించాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో.. ఆ వివరాలను కూడా అధికారులు గురువారం సీఎం రేవంత్‌కు తెలిపారు. ఆ రైళ్లు గంటకు 350 కి.మీ వేగంతో నడిచేలా ట్రాక్‌ నిర్మిస్తామని.. 320 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడుస్తాయని తెలిపారు. హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌ మొత్తం పొడవు 576 కిలోమీటర్లు కాగా.. అందలో 218 కిలోమీటర్లు తెలంగాణ పరిధిలో ఉంటాయని, మొత్తం మూడు స్టేషన్లు వస్తాయని, దాదాపు 705 హెక్టార్ల భూమి అవసరమని, ఈ కారిడార్‌ నిర్మాణానికి రూ.1.75 లక్షల కోట్లను వెచ్చించనున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు. అలాగే హైదరాబాద్‌-చెన్నై మార్గం మొత్తం పొడవు 744 కిలోమీటర్లు కాగా తెలంగాణ పరిధిలో 236 కిలోమీటర్లు ఉంటాయని.. మొత్తం 5 స్టేషన్లు వస్తాయని, దీనికోసం 790 హెక్టార్ల భూమి అవసరమని, ఈ కారిడార్‌ నిర్మాణానికి సుమారు రూ.2.24లక్షల కోట్ల వరకు ఖర్చవుతుందని తెలిపారు. ఈ రెండు కారిడార్లనూ కేంద్రమే నిర్మించనుంది. అయితే ఈ రెండింటి అలైన్‌మెంట్ల విషయంలో సీఎం రేవంత్‌ కీలక సూచనలు చేసినట్టు సమాచారం. హైదరాబాద్‌-బెంగళూరు మార్గాన్ని శంషాబాద్‌, మహబూబ్‌నగర్‌, శ్రీశైలం మీదుగా తీసుకెళ్తే శ్రీశైలానికి రైల్వే మార్గం ఏర్పడుతుందని.. తద్వారా తెలంగాణ నుంచి అక్కడికి వెళ్లే భక్తులకు ఉపయుక్తంగా ఉంటుందని సూచించినట్టు తెలిసింది. అలాగే హైదరాబాద్‌-చెన్నై కారిడార్‌ అలైన్‌మెంట్‌ను శంషాబాద్‌-బాటసింగారం-నార్కట్‌పల్లి-సూర్యాపేట-ఖమ్మం-అమరావతి-గుంటూరు మీదుగా కేంద్ర రైల్వే అధికారులు రూపొందించారు. అయితే ఇప్పటికే నార్కట్‌పల్లి, ఖమ్మం, విజయవాడ వైపు రైలు మార్గాలు ఉన్నందున హైదరాబాద్‌-అమరావతి మధ్యన ప్రతిపాదిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రోడ్డుకు సమాంతరంగా నిర్మిస్తే చాలావరకూ కొత్త ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ ఏర్పడుతుందని, తద్వారా కొత్తగా వ్యాపార లావాదేవీలకు అవకాశం ఉంటుందని సీఎం అభిప్రాయపడినట్టు సమాచారం. పైగా ఈ మార్గాన్ని బందరు పోర్టు వరకు నిర్మించడం వలన తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డ్రై పోర్టుకు రైలు కనెక్టివిటీ ఏర్పడుతుందని వెల్లడించినట్టు తెలిసింది. సీఎం సూచనలను పరిశీలిస్తామని రైల్వే అఽధికారులు చెప్పినట్టు సమాచారం.


రాష్ట్రంలో మరికొన్ని ప్రాజెక్టుల వివరాలు..

కేంద్రం నుంచి తెలంగాణకు మంజూరైన కొన్ని రైల్వే లైన్ల వివరాలను కూడా అధికారులు సమీక్షలో సీఎంకు తెలిపారు. అవేంటంటే..

  • వికారాబాద్‌-కృష్ణా మార్గం.. 130 కిలోమీటర్లు.. నిర్మాణ ఖర్చు రూ.2,784.11 కోట్లు. ఈ రూట్‌లో పరిగి, కొడంగల్‌, టేకల్‌కోడే, మాటూర్‌, బాలంపేట, అన్నాసాగర్‌, నారాయణపేట, మక్తల్‌లో స్టేషన్లు రానున్నాయి.

  • డోర్నకల్‌- గద్వాల మార్గం.. 296 కిలోమీటర్లు. నిర్మాణ ఖర్చు రూ.5,920 కోట్లు.

  • డోర్నకల్‌-మిర్యాలగూడ రూట్‌ 97.45 కిలోమీటర్లు కాగా.. నిర్మాణ వ్యయం రూ.2,184 కోట్లు.

  • కల్వకుర్తి- మాచర్ల రూట్‌.. 126 కిలోమీటర్లు. నిర్మాణ వ్యయం రూ.2,520 కోట్లు. అలాగే అమృత్‌ భారత్‌ పథకం కింద దేశవ్యాప్తంగా చేపట్టిన రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో రూ.2,760 కోట్లతో 40 స్టేషన్లను అభివృద్ధి చేయనున్నామని, ఇప్పటికే బేగంపేట, కరీంనగర్‌, వరంగల్‌ స్టేషన్ల పనులు పూర్తయ్యాయని రైల్వే శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ స్టేషన్ల కోసమే దాదాపు రూ.1,042 కోట్లను, లింగంపల్లి, కాచిగూడ స్టేషన్ల కోసం 802.88 కోట్లను, మిగిలిన 36 స్టేషన్ల కోసం 915.27 కోట్లను వెచ్చించనున్నట్టు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో బయటపడ్డ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్.. రూ.1000 కోట్ల దోపిడీ

కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గొంతుకోసింది.. కేటీఆర్ ఫైర్

For More TG News And Telugu News

Updated Date - Sep 12 , 2025 | 08:35 AM