Share News

Caste Census: దేశవ్యాప్తంగా కులగణన చేయాలి

ABN , Publish Date - Feb 04 , 2025 | 03:42 AM

దేశవ్యాప్తంగా కులగణన సర్వే చేపట్టాలని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం కులగణన పూర్తి చేసిందని తెలిపారు.

Caste Census: దేశవ్యాప్తంగా కులగణన చేయాలి

  • తెలంగాణలో పూర్తి.. 90ు బీసీ, ఎస్సీ, ఆదివాసీ, మైనారిటీలే: లోక్‌సభలో రాహుల్‌

  • బీసీలకు న్యాయం జరిగే సమయం వచ్చింది.. ఎవరు అడ్డుకున్నా సహించం

  • వెనుకబడిన వర్గాల వారంతా నేడు సంబరాలు జరపాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌

  • కులగణన సర్వేతో ముస్లిం రిజర్వేషన్‌ పరిరక్షణకు బలమైన ఆధారం: షబ్బీర్‌ అలీ

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా కులగణన సర్వే చేపట్టాలని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం కులగణన పూర్తి చేసిందని తెలిపారు. జనాభాలో 90ు ఓబీసీ, దళిత, ఆదివాసీ, మైనారిటీలు వర్గాలకు చెందిన వారే ఉన్నారని పేర్కొన్నారు. దేశంలోనూ ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందన్నారు. సోమవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో తెలంగాణలో చేపట్టిన కులగణన అంశాన్ని రాహుల్‌ ప్రస్తావించారు. దేశంలో ఓబీసీ జనాభా 50 నుంచి 55 శాతం వరకు ఉండొచ్చని, దళితులు 16ు, ఆదివాసీలు 9ు, మైనారిటీలు 15ు ఉండొచ్చని అంచనా వేశారు. వీరందరికీ రాజ్యాంగ బద్దంగా దక్కాల్సిన హక్కులు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కులగణన సర్వే నివేదికపై అసెంబ్లీలో చర్చ జరగనున్న నేపథ్యంలో కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలని తాము కోరుకుంటున్నామని మంత్రి పొన్నం అన్నారు. బీసీలకు న్యాయం జరగాలని కేసీఆర్‌ కోరుకుంటే అసెంబ్లీకి రావాలన్నారు. సోమవారం గాంధీభవన్‌లో మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కులగణన సర్వేలో ప్రధాన రాజకీయ పార్టీ పెద్దలు వివరాలు ఇవ్వలేదన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో కేసీఆర్‌ కూతురు కవిత తప్ప ఎవరూ వివరాలు ఇవ్వలేదని తెలిపారు. వారు ఎందుకు ఇవ్వలేదో కవిత ప్రశ్నించాలన్నారు.


అన్ని పార్టీలు తమ విధానమేంటో చెప్పాలి..

కులగణన సర్వేకు వివరాలు చెప్పేందుకు కొంతమంది నిరాకరించారని మంత్రి పొన్నం తెలిపారు. సర్వే కోసం వెళ్లిన వారిపై కుక్కలను వదిలిన వారూ ఉన్నారని చెప్పారు. కులగణనపై తమ విధానమేంటో అన్ని రాజకీయ పార్టీలూ అసెంబ్లీలో చెప్పాలని, బలహీన వర్గాల కోసం తమ వాదన వినిపించాలని కోరారు. బీసీలకు న్యాయం జరిగే సమయం వచ్చిందని, దీనిని ఎవరు అడ్డుకోవాలని చూసినా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కులగణనలో వివరాలు ఇవ్వనివారు మండల స్థాయి అధికారులకు ఇప్పటికైనా ఇవ్వవచ్చునని మంత్రి సూచించారు. కులగణన ఒక చరిత్రాత్మక కార్యక్రమమని, నిర్ణయం నుంచి నివేదిక వరకు ప్రక్రియలో తాను భాగమైందుకు గర్విస్తున్నానని తెలిపారు. కులగణన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని బీసీ సోదరులు మంగళవారం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు చేయాలని పిలుపునిచ్చారు. గతంలో మాదిరిగా సర్వే నివేదికను ఫ్రిజ్‌లోనో, అల్మరాలోనో పెట్టే ప్రభుత్వం తమది కాదని, రహస్య ఎజెండా కోసం ఉపయోగించుకునే పార్టీ కూడా కాదని అన్నారు. కాగా, కులగణన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో సోమవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతలు సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్‌ బీసీ సెల్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు.


ముస్లింల రిజర్వేషన్‌కు బలం..

కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే.. రాష్ట్రంలో ముస్లింలకు అమలవుతున్న 4శాతం రిజర్వేషన్‌ పరిరక్షణకు బలమైన ఆధారాలను అందించిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముస్లింలలో బీసీ కేటగిరీ కిందికి వచ్చే ముస్లింలను వర్గీకరించిన సర్వే.. వీరు 10.08 శాతంగా ఉన్నట్లు తేల్చిందన్నారు. ఏపీ, తెలంగాణల్లో బీసీ ముస్లింలకు ఇస్తున్న 4శాతం రిజర్వేషన్‌ను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మతపరమైన రిజర్వేషన్‌గా చిత్రిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. హిందువుల్లో వెనుకబడిన వర్గాలకు ఇచ్చినట్లే.. ముస్లింలలోనూ వెనుకబడిన వర్గాలకే బీసీ రిజర్వేషన్‌ కల్పిస్తున్నారని తెలిపారు. బీసీ ఉపకులాల వివరాలు సహా అన్నింటినీ ప్రభుత్వం త్వరలో వెబ్‌సైట్‌లో పెడుతుందని, కుల సంఘాలకు ఏమైనా అనుమానాలుంటే చూసుకోవచ్చునని అన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన 10 శాతం ఈడబూఎస్‌ రిజర్వేషన్‌ కోటాతో 50 శాతం సీలింగ్‌ దాటి పోయిందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


ఇవి కూడా చదవండి..

KTR: రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. వేటు తప్పదా..


Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు

Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 04 , 2025 | 03:42 AM