డబ్బా రేకుల్లా ఫర్నిచర్!
ABN , Publish Date - Jun 15 , 2025 | 04:27 AM
ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల కోసం కొనుగోలు చేసిన ఫర్నిచర్ కొన్నాళ్లకే మూలన పడుతోంది. ఏమాత్రం నాణ్యత లేకపోవడంతో ఎక్కడికక్కడ విరిగిపోయి పనికిరాకుండా పోతోంది.
వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో నాసిరకం సరుకు
నాణ్యతలేని కుర్చీలు, టేబుళ్లు, అల్మారాలు
కొన్నాళ్లకే విరిగిపోయి మూలన
25 కాలేజీల కోసం కొనుగోలు
ఒక్కో కాలేజీకి రూ.10కోట్లు.. నాణ్యత పరిశీలించకుండానే ఓకే చేసిన వైనం
హైదరాబాద్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల కోసం కొనుగోలు చేసిన ఫర్నిచర్ కొన్నాళ్లకే మూలన పడుతోంది. ఏమాత్రం నాణ్యత లేకపోవడంతో ఎక్కడికక్కడ విరిగిపోయి పనికిరాకుండా పోతోంది. గత నాలుగేళ్లలో కొత్తగా ఏర్పాటు చేసిన 25 మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆస్పత్రుల కోసం వైద్య పరికరాలు సహా ఫర్నిచర్‌ను తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీజీఎంఎ్‌సఐడీసీ) ద్వారా కొనుగోలు చేశారు. ఒక్కో కళాశాల, అనుబంధ ఆస్పత్రికి ఫర్నిచర్ కోసం రూ.10 కోట్లు వెచ్చించారు. ఫర్నిచర్ అంతా ఐరన్‌తో చేసిందే. ఇందులో ప్రధానంగా విద్యార్థులు, ప్రొఫెసర్ల కోసం కుర్చీలు, బెంచ్‌లు, అల్మరాలు, లాకర్లు, ర్యాక్స్, ఆఫీసు టేబుల్స్ ఉన్నాయి. కొత్త కాలేజీల్లో రెండో ఏడాది తరగతులు ప్రారంభమయ్యాక ఫర్నిచర్ కొన్నారు. తొలుత జైళ్లశాఖ తయారు చేసిన ఫర్నిచర్‌ను కార్పొరేషన్ కొనాలనుకుంది. అవి నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేవని అప్పటి వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు ఫిర్యాదులు రావడంతో కొనుగోలును కార్పొరేషన్ నిలిపివేసింది. ఆ తర్వాత ఫర్నిచర్ కొనుగోలు కోసం కార్పొరేషన్ గత ఏడాది చివర్లో టెండర్లు పిలిచింది. ఆ టెండరు నిబంధనల్లో విచిత్రమైన నిబంధనలు పెట్టింది. కుర్చీలు సరఫరా చేయాలంటే సంబంధిత సంస్థ ఆ ఒక్క విభాగంలోనే రూ.కోట్ల టర్నోవర్ ఉండాలని పేర్కొంది. అలా అన్ని రకాల ఫర్నిచర్ సరఫరా చేయాలంటే వందల కోట్ల టర్నోవర్ ఉండటాన్ని తప్పనిసరి చేసింది. ఫలితంగా రాష్ట్రం నుంచి ఒక్క కంపెనీకి కూడా టెండరులో పాల్గొనే అర్హత లేకుండా పోయింది. ఉత్తరాదికి చెందిన ఓ కంపెనీ టెండరు దక్కించుకుంది. ఆ కంపెనీకే టెండరు దక్కేలా నిబంధనలు పెట్టారన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్న ఫర్నిచర్‌నే సరఫరా చేసినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. అయితే అవి ఏమాత్రం నాణ్యతగా లేవనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఫర్నిచర్ అంతా కిరోసిన్ డబ్బా రేకుల్లా ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. కనీసం ఆ ఫర్నిచర్ నాణ్యతను తనిఖీలు చేసే వారు కూడా ఉండటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం ఫర్నిచర్ మెటిరీయల్‌ను కాలేజీల్లో దింపేసి కార్పొరేషన్ అధికారులు చేతులు దులుపుకున్నారని వైద్యవర్గాలు వెల్లడించాయి.
90 కేజీలు ఉండాల్సిన అల్మారా 50 కేజీలే
నిబంధనల ప్రకారం 8 లాకర్లతో కూడిన అల్మారా 90 కిలోల బరువుండాలి. కానీ కార్పొరేషన్ కొనుగోలు చేసి పంపిన అల్మారాలు 50కిలోలే ఉంటున్నట్లు సిబ్బంది వెల్లడించారు. ఆఫీసు టేబుల్స్‌లో ఒక్క డ్రాను లాగితే డ్రా మొత్తం ఊడివస్తోందని చెబుతున్నారు. ఇక లెక్చర్ హాల్‌లో టేబుల్స్, కుర్చీ లు సౌకర్యవంతంగా లేవని, కాళ్లకు తగిలి.. గాట్లతో గాయాలయ్యే పరిస్థితి ఉందని మెడికోలు చెబుతున్నారు. ఈ ఫర్నిచర్ పరికరాల నాణ్యతను కార్పొరేషన్ అధికారులు తనిఖీలు చేయడం లేదు. టెండరుకు ముందే ఫర్నిచర్ డెమో చూసి.. ఇండియన్ స్టాం డర్ట్స్ స్పెసిఫికేషన్స్ మేరకు ఫర్నిచర్ ఉందా.. లేదా? అన్నది నిర్ధారించుకోవాలి. పరికరాల కొలతలు, మందం, బరువు, ధృఢత్వాలనను కార్పొరేషన్ సాంకేతిక బృందం తనిఖీ చేయాలి. ఆ నివేదికను కార్పొరేషన్ ఉన్నతాధికారులకు పంపాలి. అప్పుడే సరఫరాదారులకు బిల్లులు చెల్లించాలి. కానీ ఇక్కడ తనిఖీలు లేకపోవడంతో సరఫరాదారులు నాసిరకం ఫర్నిచర్ పంపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్పొరేషన్‌లోనూ కొందరు అధికారులు, సిబ్బంది ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. దీని వెనుక పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
For National News And Telugu News