Share News

Medak: భూభారతితో భూసమస్యలకు పరిష్కారం

ABN , Publish Date - May 18 , 2025 | 05:12 AM

భూభారతి చట్టంతో భూసమస్యలకు సత్వర, శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

Medak: భూభారతితో భూసమస్యలకు పరిష్కారం

  • రెవెన్యూ చట్టాల అధ్యయనం చేశాకే భూభారతి తెచ్చాం

  • రాష్ట్ర వ్యాప్తంగా 6వేల మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు

  • భూభారతి అవగాహన సదస్సుల్లో మంత్రి పొంగులేటి

  • భూధార్‌ కార్డు శుభపరిణామం : ఎంపీ రఘునందన్‌

మెదక్‌, బుగ్గారం, మే 17 (ఆంధ్రజ్యోతి): భూభారతి చట్టంతో భూసమస్యలకు సత్వర, శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో అమలులో ఉన్న రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేసిన తర్వాతే రాష్ట్రంలో భూభారతిని అమలు చేస్తున్నామని చెప్పారు. మెదక్‌ జిల్లా చిలబ్‌చేడ్‌ మండలం పరిధి శీలంపల్లిలో, జగిత్యాల జిల్లా బుగ్గారంలో శనివారం నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుల్లో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనలతో లక్షలాది మంది ప్రజలు, మేధావుల అభిప్రాయాలు సేకరించి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని అందులో భాగంగానే శనివారం సాయంత్రం లోగా రాష్ట్రంలో 6,000 మంది లైసెన్స్‌డ్‌ సర్యేయర్లను నియమిస్తున్నామని, జూన్‌ 2 నుంచి 10,956 రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులను కేటాయిస్తామని చెప్పారు. గతంలో కేసీఆర్‌ నాలుగు గోడల మధ్య కూర్చొని ధరణి అనే చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలను తిప్పలు పెట్టారని విమర్శించారు. ప్రతీ వ్యక్తికి ఆధార్‌ ఎలా ఉంటుందో, అలానే భూధార్‌ను చట్టంలో ప్రవేశపెట్టామన్నారు.


భూ భారతి చట్టం ప్రకారం సర్వే చేసి సంబంధిత మ్యాపులను పాస్‌పుస్తకంపై ముద్రిస్తే భూసమస్యలకు చరమగీతం పాడవచ్చునని వివరించారు. రానున్న రోజుల్లో రిజిస్ట్రేషన్‌ సమయాల్లోనే సర్వేమ్యాప్‌ రిజిస్ట్రేషన్‌తోపాటు దస్తావేజును కంప్యూటర్లలో నిక్షిప్తం చేసే అంశాన్ని చట్టంలో పొందుపరుస్తున్నామని వివరించారు. ధరణిలో ఏ సమస్య వచ్చినా న్యాయస్ధానాన్ని ఆశ్రయించాల్సి వచ్చేదని, భూ భారతి చట్టం ప్రకారం ఎమ్మార్వో, ఆర్డీవో, అదనపు కలెక్టర్‌, సీసీఎల్‌ఏ స్థాయిలో సమస్యలపై అప్పీలుకు వెళ్లే అవకాశం ఉందని వివరించారు. రాష్ట్రంలోని 32 మండలాలలో భూ భారతి చట్టం తీసుకొచ్చామని, జూన్‌2 నాటికి వాటి ఫలితాలు వస్తాయని తెలిపారు. ఆగస్టు 15 నాటికి భూభారతి చట్టం ద్వారా భూసమస్యలన్నింటికీ పరిష్కారాలు లభించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలోని నిరుపేదలకు మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వనున్నామని తెలిపారు. శీలంపల్లిలో జరిగిన సదస్సులో పాల్గొన్న బీజేపీ నేత, మెదక్‌ ఎంపీ రఘనందన్‌రావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ధరణి తెచ్చి రైతుల్ని అరిగోస పెట్టిందని, ప్రస్తుత ప్రభుత్వం అలా చేయదని ఆశిస్తున్నామని అన్నారు. రైతులకు భూధార్‌ కార్డు ఇవ్వడం శుభపరిణామం అన్నారు. ఇదే సదస్సులో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ నేత, నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా రెడ్డి మాట్లాడుతూ పాసు పుస్తకాలు లేని గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కోరారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 18 , 2025 | 05:12 AM