Share News

Ponguleti: సాదాబైనామా సమస్యలకు పరిష్కారం

ABN , Publish Date - May 17 , 2025 | 03:29 AM

పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా సమస్యలకు భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి హామీ ఇచ్చారు.

Ponguleti: సాదాబైనామా సమస్యలకు పరిష్కారం

భూ భారతి ట్రైబ్యునల్‌ ఏర్పాటు.. తహసీల్దార్‌ నుంచి సీసీఎల్‌ఏ వరకు ఐదంచెల వ్యవస్థ

  • పట్టాదారు పాసు పుస్తకంలో భూ కమతాల మ్యాపులు

  • మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి

  • నిర్మల్‌, ఆసిఫాబాద్‌, రుద్రంగిలో రెవెన్యూ సదస్సులు

  • పాల్గొన్న మంత్రులు సీతక్క, పొన్నం

హైదరాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, సిరిసిల్ల, మే 16 (ఆంధ్రజ్యోతి) : పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా సమస్యలకు భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి హామీ ఇచ్చారు. నిర్మల్‌, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో మంత్రి మాట్లాడుతూ.. భూ భారతి చట్టం అమలులో భాగంగా ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తహసీల్దార్‌, ఆర్డీవో, అదనపు కలెక్టర్‌, కలెక్టర్‌, సీసీఎల్‌ఏ, ఆపై ట్రైబ్యునల్‌ స్థాయులలో అప్పీల్‌ వ్యవస్థను భూ భారతి చట్టంలో రూపొందించినట్లు వెల్లడించారు. ఈ చట్టం వల్ల భూ సమస్యల పరిష్కారం వేగంగా జరగడమే కాక, రైతులకు నమ్మకమైన భూ సమాచారం అందుతుందని మంత్రి పేర్కొన్నారు. భూ యజమానుల భూ కమతాలకు మ్యాపులను పట్టాదారు పాసు పుస్తకంలో ముద్రించి ఇస్తామని తెలిపారు. మండలాల్లో ఆరు వేల మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను అధికారికంగా నియమిస్తున్నామని ప్రకటించారు. దీంతో భూముల హద్దుల గుర్తింపు సులభతరం అవుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరో వెయ్యిమంది సర్వేయర్లను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.


త్వరలోనే గ్రామ రెవెన్యూ అధికారులను కూడా నియమిస్తామన్నారు. అర్హులైన పోడు భూముల రైతులకు పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. భూభారతి నాలుగు పైలెట్‌ మండలాల్లో 13 వేల దరఖాస్తులు వచ్చాయని, ఈ నెల 30వ తేదీలోగా పరిష్కరించదగిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివా్‌సలతో కలిసి నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పొంగులేటి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పెద్దలు స్వార్థపూరితంగా నాలుగు గోడల మధ్య ఎవరి అభిప్రాయాలు తెలుసుకోకుండా ధరణి చట్టం తయారుచేశారన్నారు. ప్రజా ప్రభుత్వంగా దేశంలోనే 18 రాష్ట్రాల్లో 20 చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని భూ భారతి చట్టం తయారుచేశామని అన్నారు. భూ సరిహద్దులతోపాటు భూమి కొలతలు పూర్తిగా ఉండే విధంగా రిజిస్ట్రేషన్‌ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం భూ భారతి చట్టం ప్రవేశ పెట్టిందన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళా సంఘాలను ప్రోత్సహిస్తూ వివిధ రకాల వ్యాపార యూనిట్లకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 03:29 AM