Share News

విద్య, వైద్య రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించాలి

ABN , Publish Date - Apr 13 , 2025 | 03:51 AM

రాష్ట్రాభివృద్ధి విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఒక కనీస ఉమ్మడి కార్యక్రమానికి (కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌) కట్టుబడి ఉండాలి. రాష్ట్ర బడ్జెట్‌లలో విద్య, వైద్య రంగాలకు అధిక నిధులు కేటాయించాలి.

విద్య, వైద్య రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించాలి

  • అప్పులను మూలధన వ్యయం కింద వినియోగించాలి

  • ‘తెలంగాణ ప్రగతి-బడ్జెట్‌25-26’ సమావేశంలో వక్తలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రాభివృద్ధి విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఒక కనీస ఉమ్మడి కార్యక్రమానికి (కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌) కట్టుబడి ఉండాలి. రాష్ట్ర బడ్జెట్‌లలో విద్య, వైద్య రంగాలకు అధిక నిధులు కేటాయించాలి. తెచ్చిన అప్పులను మూలధన వ్యయాల కింద మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాలి’ అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ‘తెలంగాణ ఆర్థిక ప్రగతి- బడ్జెట్‌ 2025-26’ అనే అంశంపై శనివారం తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. సమితి కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీఆర్‌ఎస్‌ నేత బోయినపల్లి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ... బీఆర్‌ఎస్‌ పదేళ్లకాలంలో రూ.3-4 లక్షల కోట్ల అప్పులు తెచ్చినా రూ.30 లక్షల కోట్ల ఆస్తులు సృష్టించిందని, ఈ అప్పులను మూలధన వ్యయం కింద ఖర్చు చేశామన్నారు. రాష్ట్ర వృద్ధి రేటులో స్తబ్ధత నెలకొందని, రియల్‌ ఎస్టేట్‌ రంగం పడిపోవడం, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ఆదాయంలో తగ్గుదల వంటివి ఇందుకు కారణాలన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ... రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ప్రాధమ్యాల ఆధారంగా ప్రభుత్వం నిధులు కేటాయించి, ఖర్చుచేస్తోందన్నారు. రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరంలో రూ.48 వేల కోట్లు రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేశామని.. 58,868 పోస్టులను భర్తీ చేశామని, మరో 30 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసినట్టు తెలిపారు.


తమ ప్రభుత్వం ప్రతి బడ్జెట్‌లో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తోందన్నారు. సీపీఎం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించాలన్నారు. బడ్జెట్‌లో మూలధన వ్యయం 30-40 శాతం మేర ఉండాలని, కానీ 10-12శాతానికి మించడం లేదని బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ నేత దేవిప్రసాద్‌ మాట్లాడుతూ... 2024లో 9 వేల మంది ఉద్యోగులు రిటైర్‌ కాగా 2025లో మరో 9 వేల మంది రిటైర్‌ కాబోతున్నారని, వీరందరికీ రూ.20 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగులకు ఐదు డీఏలు రావాల్సి ఉందని, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ డీఏలు పెండింగ్‌లో లేవని చెప్పారు. రాజకీయ, సామాజిక విశ్లేషకులు డి.పాపారావు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి విషయంలో అన్ని రాజకీయ పార్టీలకు ఒక కనీస ఉమ్మడి కార్యక్రమం ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సరిగా లేకుంటే పౌర సమాజం ప్రశ్నించాలని అంబేడ్కర్‌ యూనివర్సిటీ మాజీ వీసీ సీతారామారావు అన్నారు. ప్రొఫెసర్‌ రమణమూర్తి మాట్లాడుతూ... 15వ ఆర్థిక సంఘం సిఫారసులతో దక్షిణాది రాష్ట్రాలకు పన్నుల వాటా తగ్గిందని చెప్పారు. ప్రొఫెసర్‌ కృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్రం నుంచి .25 వేల కోట్ల గ్రాంట్లు వస్తాయని బడ్జెట్‌లో చెబితే. 5 వేల కోట్లు కూడా రావడం లేదన్నారు.


ఇవి కూడా చదవండి...

Harassment Of Women: కోరిక తీర్చాలంటూ మహిళను ఎంతలా వేధించారంటే

Case On KTR: కేటీఆర్‌ ట్వీట్‌పై పోలీసుల రియాక్షన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 13 , 2025 | 03:51 AM