Share News

Dr. Namratha Scam: పథకం ప్రకారమే.. మోసాల ‘సృష్టి’!

ABN , Publish Date - Aug 04 , 2025 | 04:48 AM

పథకం ప్రకారమే డాక్టర్‌ నమ్రత మోసాల ‘సృష్టి’కి తెరతీశారని గోపాలపురం పోలీసులు గుర్తించారు. ఐదు రోజుల పాటు ఆమెను కస్టడీకి తీసుకున్న పోలీసులు.

Dr. Namratha Scam: పథకం ప్రకారమే.. మోసాల ‘సృష్టి’!

  • నమ్రత ముఠాలోని ఏజెంట్‌ కృష్ణ అరెస్టు

  • మూడోరోజూ నమ్రత విచారణ

  • ఏజెంట్లతో ఆర్థిక లావాదేవీలపై నజర్‌

  • చైల్డ్‌ ట్రాఫికింగ్‌ ముఠాతో లింకులపై దృష్టి

హైదరాబాద్‌ సిటీ/అడ్డగుట్ట, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): పథకం ప్రకారమే డాక్టర్‌ నమ్రత మోసాల ‘సృష్టి’కి తెరతీశారని గోపాలపురం పోలీసులు గుర్తించారు. ఐదు రోజుల పాటు ఆమెను కస్టడీకి తీసుకున్న పోలీసులు.. మూడోరోజు విచారణలో విస్తుబోయే అంశాలను గుర్తించినట్లు తెలిసింది. తొలిరోజు కస్టడీ సందర్భంగా.. ‘‘నాకేం తెలియదు’’.. ‘‘నేనెవరినీ మోసం చేయలేదు’’.. ‘‘నెనెలాంటి అక్రమాలకు పాల్పడలేదు’’.. అంటూ నమ్రత సమాధానాలివ్వగా.. పోలీసులు సాంకేతిక ఆధారాలు, కాల్‌డాటాను ఆమె ముందు పెట్టడంతో ఆదివారం పలు విషయాలను వెల్లడించినట్లు సమాచారం. సంతాన సాఫల్య దందాతో రూ.కోట్లలో కూడబెట్టిన నమ్రత.. తెలుగు రాష్ట్రాల్లోని ఖరీదైన ప్రాంతాల్లో ప్లాట్లు, స్థలాలు, ఫామ్‌హౌ్‌సలను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఆమె నెట్‌వర్క్‌లోని మధ్యవర్తులపై దృష్టి సారించారు. ఇప్పటికే కల్యాణి, సంతోషి అనే దళారులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తుండగా.. తాజాగా విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న కృష్ణ అనే ఏజెంట్‌ను అరెస్టు చేశారు. మోసాల ‘సృష్టి’లో కృష్ణ కీలక పాత్రపోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విజయవాడలో టెస్ట్‌ట్యూబ్‌, సరోగసి వ్యవహారాల్లో కృష్ణ కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. అతణ్ని విచారించేందుకు గోపాలపురం పోలీసులు సిద్ధమవుతున్నారు. కర్ణాటక, ఒడిసా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లోనూ నమ్రత ఏజెంట్లున్నారని, వారిని గుర్తించి, అదుపులోకి తీసుకోవాల్సి ఉందని పోలీసులు వివరించారు.


బలహీనతే బలంగా మోసాలు

పిల్లలు లేని దంపతుల బలహీనతను నమ్రత తనకు బలంగా మలచుకుని మోసాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్రమార్జనతో బాగా సంపాదించాలనే ఉద్దేశంతో పిల్లలు లేని దంపతులకు సరోగసి కోసం ఒప్పించేవారని తెలుస్తోంది. సరోగసి తల్లి లేకుండానే.. ట్రాఫికింగ్‌ ద్వారా కొనుగోలు చేసిన చిన్నారులను దంపతులకు అప్పగించినట్లు సమాచారం. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, దళారులు అరెస్టయితే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.


మా పిల్లలు సక్రమమేనా..?

సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌ అక్రమాలు వెలుగులోకి రావడంతో.. డాక్టర్‌ నమ్రత సూచనలతో సరోగసి ద్వారా సంతానాన్ని పొందేందుకు సిద్ధమైన దంపతుల్లో ఇప్పుడు ఆందోళన నెలకొంది. అలాంటి వారు పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. త్వరలో తమ ఒడిలోకి చేరనున్న చిన్నారులు తమ సంతానమేనా? లేక అక్రమాల ‘సృష్టి’కి నిదర్శనమా? అనే సందేహాలను వారు వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్..

కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలక భేటీ.. ఎందుకంటే..

ధర్మస్థలలో మరో షాకింగ్ ఘటన.. దేశవ్యాప్తంగా ఆందోళన

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 04 , 2025 | 04:48 AM