మా పిల్లలు ప్రైవేటు స్కూల్‌కి రారు!
ABN , Publish Date - Jun 20 , 2025 | 05:08 AM
ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా విద్య అందిస్తుంటే.. ప్రైవేటు పాఠశాలలు రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ సామాన్యులను ఇబ్బందికి గురి చేస్తున్నాయంటూ కొందరు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
స్కూలు బస్సులను అడ్డుకున్న సూర్యాపేట జిల్లా ఏపూరు గ్రామస్థులు
తమ ఊళ్లోకి మళ్లీ రావొద్దని హెచ్చరించి వెనక్కి పంపిన వైనం
ఆత్మకూరు(ఎస్), జూన్ 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా విద్య అందిస్తుంటే.. ప్రైవేటు పాఠశాలలు రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ సామాన్యులను ఇబ్బందికి గురి చేస్తున్నాయంటూ కొందరు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాలకు పిల్లలను తీసుకెళ్లేందుకు తమ ఊళ్లోకి వచ్చిన ప్రైవేటు పాఠశాలల బస్సులను అడ్డగించారు. పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపమని, గ్రామంలో మళ్లీ కనపడకూడదని హెచ్చరించి మరీ ఆ బస్సులను వెనక్కి పంపారు. ఆపై, మా పిల్లలకు మీరే చదువు చెప్పాలంటూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను కోరారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూరులో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. 3,500 మంది జనాభా ఉన్న ఏపూరులో ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి. ఈ రెండు పాఠశాలల్లో 200 మంది దాకా విద్యార్థులు ఉన్నారు. గ్రామానికి చెందిన మరో 200 మంది సూర్యాపేటలోని పలుప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నారు. వీరిని తీసుకెళ్లేందుకు ఆయా పాఠశాలలకు చెందిన ఆరు స్కూల్ బస్సులు నిత్యం గ్రామానికి వచ్చి వెళుతుంటాయి. అయితే, గురువారం ఉదయం 7.30 గంటలకు వచ్చిన రెండు స్కూల్ బస్సులను విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు కొందరు అడ్డగించారు. తమ గ్రామం నుంచి విద్యార్థులను తీసుకెళ్లవద్దని వారిస్తుండగానే ఆ రెండు బస్సులు వారిని దాటుకుని వెళ్లిపోయాయి.
కాసేపటికి మరో నాలుగు బస్సులు రాగా గ్రామ ప్రజలు వాటిని అడ్డగించి అక్కడే నిలిపేశారు. ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సులు ఇకపై తమ గ్రామానికి రావొద్దని హెచ్చరించారు. దీంతో బస్సుల్లోని విద్యార్థుల్లో కొందరు ఇంటికి వెళ్లిపోగా, మరికొందరు తల్లిదండ్రుల సాయంతో ప్రైవేటు పాఠశాలకు వెళ్లిపోయా రు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడు తూ ప్రభుత్వ బడు ల్లో ఉచితంగా విద్యనందిస్తున్నా మాయమాటలు చెప్పి ప్రైవేటు పాఠశాలలు వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓ పక్క ఈ ఆందోళన కొనసాగుతుండగా.. గ్రామానికి చేరుకున్న ప్రభు త్వ ఉపాధ్యాయులను స్థానికులు ఘటనాస్థలికి పిలిపించారు. తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువు చెప్పాలని ఆ ఉపాధ్యాయులను కోరారు. ఈ క్రమంలో ఏపూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాసిత్, ఇతర ఉపాధ్యాయులు.. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఇళ్లకు స్వయంగా వెళ్లారు. పిల్లలని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఇటీవల పదో తరగతి ఫలితాల్లో తమ పాఠశాల శతశాతం ఉత్తీర్ణత సాధించిందని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పారు. ఆయా విద్యార్థుల్లో ఎంతమంది ప్రైవేటును మాని ప్రభుత్వ బడి బాట పడతారో చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ
యోగాలో ప్రపంచ రికార్డు సృష్టిస్తాం..: మంత్రి సవిత
ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
For More AP News and Telugu News