Share News

Ex JKP DGP Rajendra Kumar: పాక్‌కు గుణపాఠం ఖాయం

ABN , Publish Date - Apr 26 , 2025 | 04:29 AM

పాక్‌కు గుణపాఠం ఖాయమని మాజీ డీజీపీ రాజేంద్రకుమార్‌ తెలిపారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం పాక్‌కు భవిష్యత్తులో భారీ నష్టాలను తెస్తుందనీ, ఉగ్రవాద మద్దతుతో బ్లాక్‌లిస్ట్‌ చేయాలని సూచించారు

 Ex JKP DGP Rajendra Kumar: పాక్‌కు గుణపాఠం ఖాయం

  • స్థలం, సమయం ఖరారు చేయడమే మిగిలింది..

  • సింధు జలాల ఒప్పందం రద్దుతో పాక్‌ పంజాబ్‌లో నీరుండదు

  • 3 యుద్ధాలు జరిగినా తీసుకోని కీలక నిర్ణయమిది

  • ఎఫ్‌ఏటీఎస్‌ నిఘాతో పాక్‌ను మళ్లీ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి

  • ‘ఆంధ్రజ్యోతి’తో జమ్మూకశ్మీర్‌ మాజీ డీజీపీ రాజేంద్రకుమార్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25, (ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పడం ఖాయమని జమ్మూకశ్మీరు మాజీ డీజీపీ రాజేంద్రకుమార్‌ అన్నారు. అయితే స్థలం, సమయం ఎప్పుడన్నదే తేలాల్సి ఉందని చెప్పారు. ‘‘పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయం. దీనిపై భద్రతా వ్యవహారాలపై ఏర్పడిన క్యాబినెట్‌ కమిటీ(సీసీఎస్‌) సమావేశంలో నిర్ణయం జరిగే ఉంటుంది. ఆ సమావేశంలో అన్ని ప్రతిపాదనలూ ఉంటాయి. మనం దాడిచేస్తే పాక్‌ ఎలా స్పందించవచ్చు? ఎప్పుడు, ఎక్కడ దాడి చేయాలి? ఇవన్నీ చర్చించే ఉంటారు’’ అని రాజేంద్రకుమార్‌ చెప్పారు. మనకు అనుకూలమైన సమయం, స్థలం చూసి, దాడి చేస్తారని.. ఇది జరగడం వంద శాతం ఖాయమని తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఆయన జమ్మూకశ్మీర్‌లో వివిధ హోదాల్లో పనిచేసి డీజీపీగా పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సీఈవోగా ఉన్న రాజేంద్రకుమార్‌తో శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేకంగా మాట్లాడింది. సింధు జలాల ఒప్పందం రద్దు, భవిష్యత్‌ పరిణామాలు, ఉగ్రవాదానికి పాక్‌ మద్దతిస్తున్న తీరు.. తదితర అంశాలపై మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..


మన బ్యారేజీల ఎత్తు పెంచుకోవచ్చు..

సింధు నది జలాల ఒప్పందం తర్వాత పాకిస్థాన్‌తో మనకు మూడు యుద్ధాలు జరిగాయి. కానీ, ఎన్నడూ ఆ ఒప్పందాన్ని రద్దు చేయలేదు. ఈసారి మాత్రమే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఒప్పం దం రద్దుతో నీళ్లు వెళ్లకుంటే పాక్‌లోని పశ్చిమ పంజాబ్‌లో 80ు వ్యవసాయం పడావు పడుతుంది. ఈ ఏడాదా? వచ్చే ఏడాదా? అన్నదే ప్రశ్న. అదే జరిగితే పాక్‌ జీడీపీలో 22 శాతం నేరుగా కోత పడుతుంది. మరోవైపు ఇప్పుడు మనం కావాలనుకుంటే మన బ్యారేజీల ఎత్తు పెంచుకోవచ్చు. విద్యుత్తు ప్రాజెక్టులకు ఎక్కువ నీటిని వినియోగించుకోవచ్చు.

జీ-7 దేశాల ఎఫ్‌ఎస్‌టీఏతో మళ్లీ బ్లాక్‌లిస్ట్‌ చేయించాలి

ఉగ్రవాద ప్రోత్సాహం అనేది పాకిస్థాన్‌ సిద్ధాంతం. హఫీజ్‌ సయీద్‌తో పాటు ప్రపంచం ఉగ్రవాదులుగా గుర్తించిన 90ు మందికి పాకిస్థానే ఆశ్రయం కల్పిస్తోంది. ఇలా ఉగ్రవాదానికి సాయం చేసే దేశాలకు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ లాంటి సంస్థల నుంచి నిధులు, విదేశీ సాయం అందకుండా చూసేందుకు జీ-7 దేశాలు ‘ఫైనాన్షియల్‌ అసిస్టెన్స్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌)’ సంస్థను ఏర్పాటు చేశాయి. మనీలాండరింగ్‌, ఉగ్రవాదానికి సాయం చేసే దేశాలను ఇది గుర్తించి.. ఆయా దేశాలను బ్లాక్‌లిస్ట్‌లో పెడుతుంది. ఒకప్పుడు పాక్‌కు విదేశీ ఆర్థిక సాయం నిలిపివేయాలని ఇది సిఫారసు చేసింది. దాంతో నిలిపివేశారు. ఆ తర్వాత తాను ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం లేదని పాక్‌ చెప్పుకోవడంతో నిషేధాన్ని తొలగించారు. ఇప్పుడు మళ్లీ పాక్‌ ఉగ్రవాదానికి మద్దతిస్తున్న అంశాన్ని లేవనెత్తి బ్లాక్‌లిస్ట్‌లో పెట్టించాలి.


వాణిజ్య మార్గాలు బంద్‌

జమ్మూకు రెండు, కశ్మీర్‌కు రెండు వ్యాపార మార్గాలు ఉండేవి. గత ప్రభుత్వాలు మన కశ్మీర్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ మధ్య అంతర్గత వాణిజ్యానికి, సరుకుల రవాణాకు అనుమతించాయి. దీంతో అక్కడి కూరగాయలు, వస్తువులు ఇక్కడకు, ఇక్కడి వస్తువులు అక్కడకు సరఫరా చేసేవారు. ఈ వస్తువుల మాటున పాక్‌ మాదకద్రవ్యాలను సరఫరా చేసేది. ఆర్టికల్‌ 370 రద్దుతో ఇవన్నీ ఆగిపోయాయి. అంతేకాదు, అక్కడ పర్యాటకం వృద్ధి చెంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా బాగా పెరిగాయి.

పాక్‌ రెండు జాతుల సిద్ధాంతం విఫలం

ముస్లింల సంఖ్య పాక్‌ కంటే మనదేశంలోనే ఎక్కు వ. జిన్నా నుంచి మొన్న పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసిఫ్‌ మునీ ర్‌ వరకు చెప్పిన రెండు జాతుల సిద్ధాంతం తప్పని నిరూపితమైంది. పాకిస్థాన్‌లో ప్రస్తుతం తోలుబొమ్మ ప్రభుత్వం ఉంది. మరోవైపు మిలటరీ కూడా బలూచిస్థాన్‌లో దెబ్బలు తింది. వారిపైనా ప్రజల్లో వ్యతిరేకత. అందుకే ప్రజల దృష్టి మరల్చేందుకే పహల్గాం దాడి. అనంతనాగ్‌లో గతంలో ఇలాంటి దాడే జరిగింది.


Bihar: మా నాన్నే మళ్లీ సీఎం, నో డౌట్

Rekha Gupta: ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Tahawwur Rana: ప్రతీ రోజు 8 నుంచి 10 గంటల పాటు విచారణ..

BJP: హిమాలయాలకు అన్నామలై.. బాబా గుహలో ధ్యానం

Updated Date - Apr 26 , 2025 | 04:29 AM