Religious Conversion: లాంగ్‌టర్మ్ వీసాలతో హైదరాబాద్‌లోనే మకాం
ABN , Publish Date - Aug 17 , 2025 | 03:58 AM
ప్రేమపేరుతో వంచించి, మతం మార్పిడి చేయించి పెళ్లి చేసుకొని మోసం చేసిన పాకిస్థాన్ యువకుడిపై కేసులో లంగర్‌హౌజ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తల్లికి ఇంకా పాకిస్థాన్ పౌరసత్వమే
కొన్నేళ్లుగా తల్లి, సోదరులు, సోదరితో కలిసి ఉంటున్న వైనం
పాక్ యువకుడి కేసు దర్యాప్తులో కీలక అంశాల గుర్తింపు
హైదరాబాద్ సిటీ/కార్వాన్, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ప్రేమపేరుతో వంచించి, మతం మార్పిడి చేయించి పెళ్లి చేసుకొని మోసం చేసిన పాకిస్థాన్ యువకుడిపై కేసులో లంగర్‌హౌజ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా పలు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫహాద్ అఖిల్ అనే యువకుడు తొమ్మిదేళ్ల క్రితం ఓ మహిళను ప్రేమించి, మతం మార్పిడి చేయించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెను వదిలేసి మరో యువతితో సహజీవనం చేస్తుండటంతో శుక్రవారం అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన లంగర్‌హౌజ్ పోలీసులు అఖిల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో భాగంగా ఇతను కొన్నేళ్లుగా తల్లి, సోదరులు, సోదరితో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నట్లు గుర్తించారు. లంగర్‌హౌ్‌సకు చెందిన నిందితుడి తల్లి 1990లో సౌదీకి వెళ్లి అక్కడ పనిచేస్తున్న క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తర్వాత భర్తతో కలిసి పాక్‌లోనే కాపురం పెట్టింది.
ఆమెకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. కొన్నాళ్లకు భర్త చనిపోవడంతో పిల్లలను తీసుకొని 1998లో ఆమె తిరిగివచ్చి లంగర్‌హౌ్‌సలో ఉంటోంది. పెద్ద కొడుకు ఫహాద్ అఖిల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా బాధితురాలతో పరిచయం ఏర్పడింది. ఆమెను మతం మార్పించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకు ఆమెను వదిలేసి మరో యువతితో సహజీవనం చేస్తుండటంతో అఖిల్ బాగోతం బయటపడింది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు అతని తల్లి, సోదరులు, సోదరిని విచారించారు. తల్లికి ఇప్పటికీ పాకిస్తాన్ పౌరసత్వం, పాక్ పాస్‌పోర్టు ఉన్నట్లు గుర్తించారు. పిల్లలు మాత్రం లాంగ్ టర్మ్ వీసాలతో ఇక్కడే ఉంటున్నారు. వాటిని ఏడాదికోసారి పొడిగించుకుంటూ కొన్నేళ్లుగా ఇక్కడే ఉంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వారిని తిరిగి పాకిస్తాన్ పంపాలా? మరేదైనా నిర్ణయం తీసుకోవాలా? అనే కోణంలో పోలీసులు సమాలోచనలు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తృటిలో తప్పిన ప్రమాదం.. విమాన ప్రయాణికులు సురక్షితం
రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
మరిన్ని తెలంగాణ వార్తలు, తెలుగు వార్తలు చదవండి..