Share News

Ponguleti; ధరణి పేరుతో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల కబ్జా

ABN , Publish Date - May 18 , 2025 | 04:32 AM

ధరణి పేరుతో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను కబ్జా చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు.

Ponguleti; ధరణి పేరుతో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల కబ్జా

  • సొంత లాభాల కోసం రియల్‌ వ్యాపారాలు సాగించారు

  • పేదల భూములు గుంజుకున్నది బీఆర్‌ఎస్సే

  • సంగారెడ్డి పరిధిలోని కొండాపూర్‌ భూభారతి సదస్సులో మంత్రి పొంగులేటి

సంగారెడ్డి ప్రతినిధి, మే17(ఆంధ్రజ్యోతి): ధరణి పేరుతో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను కబ్జా చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండల కేంద్రంలో భూభారతి పైలెట్‌ ప్రాజెక్టుపై జరిగిన రెవెన్యూ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివా్‌సరెడ్డికి సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం సదస్సులో పొంగులేటి ప్రసంగించారు. ధరణి వల్ల న్యాయం జరగకపోవడంతో రైతులు నిద్రలేని రాత్రులు గడిపారని అన్నారు. అందుకే రైతులు నచ్చినట్లుగా, మెచ్చినట్లుగా భూభారతి రెవెన్యూ చట్టాన్ని రూపొందించామని వివరించారు. 18 రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే భూభారతిని అమల్లోకి తెచ్చామని తెలిపారు. ఈ చట్టం ఆచరణలో ఎవరైనా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


అధికారులు రైతుల విషయంలో మానవతా దృక్పథాన్ని ప్రదర్శించాలని సూచించారు. ఆగస్టు 15 నాటికి భూసమస్యలన్నింటికీ పరిష్కారం చూపించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున 256 మంది సర్వేయర్లు ఉన్నారని, మరో వెయ్యి మంది సర్వేయర్లను నియమించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా జూన్‌ 2వ తేదీన 10,956 మంది గ్రామ రెవెన్యూ అధికారుల నియామకం ఉంటుందని ప్రకటించారు. గత ప్రభుత్వం పేదల భూములతో రియల్‌ వ్యాపారాలు సాగించిందని, పేదల భూములను గుంజుకున్న చరిత్ర బీఆర్‌ఎ్‌సది అని, కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం పేదల భూములకు రక్షణగా నిలుస్తున్నదని ఆయన అన్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. భూభారతి చట్టంతో పేదలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ సదస్సులో టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలాజగ్గారెడ్డి, ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, కలెక్టర్‌ క్రాంతి వల్లూరు తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 18 , 2025 | 04:32 AM