Engineering Seats: సీఎస్‌ఈలో సీటొచ్చినా చేరలే!
ABN , Publish Date - Jul 24 , 2025 | 02:07 AM
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎ్‌సఈ), దాని అనుబంధ బ్రాంచిల్లో మొదటి విడతలోనే సీటు వచ్చినా 12,244 మంది విద్యార్థులు చేరలేదు.
ఇలా చేరని విద్యార్థులు 12,244 మంది
అనుబంధ బ్రాంచిల్లో ఐదో వంతు సీట్లు ఖాళీ
ఇది తొలి విడత కౌన్సెలింగ్ తర్వాత లెక్క
హైదరాబాద్, జూలై 23(ఆంధ్రజ్యోతి): కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎ్‌సఈ), దాని అనుబంధ బ్రాంచిల్లో మొదటి విడతలోనే సీటు వచ్చినా 12,244 మంది విద్యార్థులు చేరలేదు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), డేటా సైన్స్ (డీఎస్) తదితర సీఎ్‌సఈ అనుబంధ కోర్సుల్లో మొదటి విడతలో 57,042 మందికి సీట్లు కేటాయించారు. సీటు పొందినవారు ఈ నెల 22లోపు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంది. లేనిపక్షంలో సీటు రద్దవుతుంది. అయితే గడువు ముగిసేనాటికి 57,042 మందిలో 44,798 (78.53 శాతం) మంది మాత్రమే చేరారు. అలాగే ఎలకా్ట్రనిక్స్, ఎలక్ట్రికల్ అనుబంధ బ్రాంచిల్లో మొత్తం 14,054 మందికి సీట్లు ఖరారు కాగా 10,594 మంది (75.38 శాతం), సివిల్, మెకానికల్ అనుబంధ బ్రాంచిల్లో 5,632 మందికి 3,943 (70.01 శాతం) మంది మాత్రమే చేరారు. మొత్తం 47 బ్రాంచిలు కలిపి... సీటొచ్చినా చేరని విద్యార్థుల సంఖ్య 17,581గా ఉంది.
ఈ సీట్లను రెండో విడతలో భర్తీ చేయనున్నారు. సాంకేతిక కారణాలతో కొన్ని కాలేజీలను మొదటి విడత కౌన్సెలింగ్‌లో చేర్చలేదు. వాటిని కలుపుకుంటే రెండో విడతలో దాదాపు 25 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉంటాయి. అదనపు సీట్ల విషయం ప్రభుత్వం వద్ద పెండింగులో ఉంది. అవి ఖరారైతే సీట్ల సంఖ్య మరింత పెరుగుతుంది. రెండో విడత ముగిసి.. ‘ఇంటర్నల్ స్లైడింగ్’ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. ఖాళీగా ఉన్న సీట్లను స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యా శాఖ బుధవారం విడుదల చేసింది. 26న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 26, 27న ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 30న రెండో విడత జాబితా ప్రకటిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
Read latest Telangana News And Telugu News