Vinayaka Immersion: నిమజ్జనంలోపు నామినేటెడ్ పదవుల భర్తీ
ABN , Publish Date - Aug 24 , 2025 | 02:40 AM
రాష్ట్రంలో అతి త్వరలో నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నారు. వినాయక చవితి పండగ నేపథ్యంలో..
టీపీసీసీ కోర్ కమిటీ నిర్ణయం
హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అతి త్వరలో నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నారు. వినాయక చవితి పండగ నేపథ్యంలో.. నిమజ్జన కార్యక్రమంలోపే ఈ పదవులను భర్తీ చేయాలని టీపీసీసీ కోర్ కమిటీ సమావేశం నిర్ణయించింది. గాంధీభవన్‌లో శనివారం టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశం ప్రారంభానికి ముందు.. సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో కోర్ కమిటీ భేటీ అయింది. ఇందులో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్థానిక ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై చర్చించారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంపై పీఏసీలో చర్చించాల్సి ఉండడంతో దానికి సంబంధించిన అజెండాను ఖరారు చేశారు. ఈ అంశంలో ప్రభుత్వం ముందున్న ప్రతిపాదనలను సిద్ధం చేశారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. ఇన్‌చార్జి బాధ్యతల్లో ఉన్నవారి పనితీరును సమీక్షించారు. నామినేటెడ్ పదవులను వినాయక నిమజ్జన కార్యక్రమంలోపే భర్తీ చేయాలన్న నిర్ణయం జరిగింది. ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇవ్వడంపై మంత్రి శ్రీధర్‌బాబు, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌తో సీఎం రేవంత్ సమావేశమై సమీక్షించారు. ఆ ఎమ్మెల్యేలకు ఎలా సహాయం చేయగలమనే అంశంపై న్యాయనిపుణులతో చర్చించాల్సిందిగా శ్రీధర్‌బాబుకు సీఎం సూచించినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News