Gali Janardhan Reddy: ఓఎంసీ దోషులకు దక్కని ఊరట
ABN , Publish Date - May 29 , 2025 | 04:53 AM
ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో సీబీఐ కోర్టులో దోషులుగా తేలి ఏడేళ్ల జైలుశిక్ష పడిన మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి సహా ఇతరులకు బుధవారం హైకోర్టులో ఎలాంటి ఊరటా లభించలేదు.
గాలి జనార్దన్ రెడ్డి తదితరుల బెయిల్ పిటిషన్లు
వినేందుకు ముగ్గురు న్యాయమూర్తుల తిరస్కరణ
హైదరాబాద్, మే 28 (ఆంధ్రజ్యోతి): ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో సీబీఐ కోర్టులో దోషులుగా తేలి ఏడేళ్ల జైలుశిక్ష పడిన మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి సహా ఇతరులకు బుధవారం హైకోర్టులో ఎలాంటి ఊరటా లభించలేదు. ఈ కేసులో సీబీఐ కోర్టు తీర్పును సస్పెండ్ చేసి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివా్‌సరెడ్డి, వీడీ రాజగోపాల్, అలీఖాన్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లు గత వారం వెకేషన్ కోర్టు ఎదుట విచారణకు రాగా అత్యవసరం ఏమీలేదంటూ.. జస్టిస్ నందికొండ నర్సింగరావు విచారణను వాయిదా వేశారు. బుధవారం ఈ పిటిషన్లు జస్టిస్ కె.శరత్ విచారణ జాబితాలో తొలుత లిస్ట్ అయ్యాయి. అయితే, వ్యక్తిగత కారణాలతో ఈ పిటిషన్లను తాను వినలేనని (నాట్ బిఫోర్ మీ) అని ఆయన చెప్పారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వెకేషన్ కోర్టు సీనియర్ జడ్జి అయిన జస్టిస్ నగేశ్ భీమపాక దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో ఆయన ఈ పిటిషన్లను జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణకు బదిలీ చేశారు.
అప్పటికే సాయంత్రం 6.30 గంటలు అవుతుండటంతో ఆయన సైతం ‘నాట్ బిఫోర్ మీ’ అని ప్రకటించారు. జస్టిస్ నగేశ్ భీమపాక వద్ద ఈ విషయం గురించి ప్రస్తావించగా.. చూస్తానని ఆయన చెప్పారు. రాత్రి దాదాపు 8 గంటల ప్రాంతంలో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఓఎంసీ కేసుల గురించి మరోసారి గుర్తుచేయడంతో.. ‘‘ఈ పిటిషన్లను ఇప్పుడు విచారించి, సింగిల్ లైన్ ఆర్డర్‌లో తేల్చే అంశాలు కావ’’ని జస్టిస్ నగేశ్ భీమపాక పేర్కొన్నారు. ముగ్గురు జడ్జిలు ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవాలన్నారు. తాను ఇప్పుడు ఏ వ్యాఖ్య చేసినా ఎక్కడికో వెళ్తుందని పేర్కొన్నారు. కాగా.. ఈ కేసులు రెగ్యులర్ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు వినిపించాల్సిన కేసులని, వీటిపై వెకేషన్ తర్వాత విచారణ జరపాలని సీబీఐ తరఫు న్యాయవాది కపాటి శ్రీనివాస్ కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ పిటిషన్లను చీఫ్ జస్టిస్ ఎదుట ఉంచాలని.. ఆయన ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీచేసింది.
Also Read:
తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఎవరంటే
For More Telangana News and Telugu News..