Share News

NMC: సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ యంత్రాలేవి?

ABN , Publish Date - May 15 , 2025 | 04:30 AM

దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. కళాశాలల్లో మౌలిక సదుపాయాల లేమి, అధ్యాపకుల కొరతతో పాటు వివిధ అంశాలపై వారంలో వివరణ ఇవ్వాలంటూ తాజాగా ఈమెయిల్స్‌ పంపింది.

NMC: సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ యంత్రాలేవి?

  • ఓపీ, ఐపీ, ఫ్యాకల్టీ, శస్త్రచికిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షల లెక్కల్లో తేడాలెందుకు?

  • 20కిపైగా సర్కారు వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ షోకాజ్‌ నోటీసులు

  • ప్రైవేటులోనూ మెజార్టీ కాలేజీలకు..

హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. కళాశాలల్లో మౌలిక సదుపాయాల లేమి, అధ్యాపకుల కొరతతో పాటు వివిధ అంశాలపై వారంలో వివరణ ఇవ్వాలంటూ తాజాగా ఈమెయిల్స్‌ పంపింది. రాష్ట్రంలో 20కిపైగా ప్రభుత్వ వైద్య కళాశాలకు నోటీసులు అందాయి. ఆయా కళాశాలల్లో 90 శాతం కొత్తవే ఉన్నాయి. ముఖ్యంగా అనుబంధ ఆస్పత్రుల్లో సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ యంత్రాలు లేకపోవడం, అధ్యాపకుల కొరత, శస్త్రచికిత్సలు, ఓపీ, ఐపీలు తక్కువగా ఉండటం, ఆయా లెక్కల్లో తేడాలుండటంతో షోకాజ్‌ నోటీసులిచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో మొత్తం ప్రైవేటు కాలేజీలు 28 ఉండగా.. అందులో మెజార్టీ కళాశాలలకు కూడా నోటీసులందినట్లు తెలుస్తోంది.


రోజు వారీ నివేదికలను ఏడీఆర్‌తో పోల్చి

వైద్య కళాశాలలు, అనుబంధ ఆస్పత్రులు ప్రతీ యేటా విధిగా వార్షిక బహిర్గత నివేదిక (ఏడీఆర్‌)ను ఎన్‌ఎంసీ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అంటే ఆ ఏడాది తమ ఆస్పత్రిలో నమోదైన అవుట్‌ పేషెంట్‌, ఇన్‌పేషెంట్‌ వివరాలు, చేసిన శస్త్రచికిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, పడకల సంఖ్య, అధ్యాపకుల వివరాలు, సీట్ల సంఖ్యతో సహా అన్ని వివరాలను తెలపాల్సి ఉంటుంది. అలాగే ప్రతి బోధనాస్పత్రి కూడా రోజువారీ ఆయా వివరాలను కేంద్రం నిర్వహించే హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం (హెచ్‌ఎంఐ్‌స) పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఇలా రోజువారీగా అప్‌లోడ్‌ చేసే వివరాలతో, ఏడీఆర్‌ నివేదికలోని గణాంకాలు సరిపోలాలి. అలా కుదరని పక్షంలో ఆ వ్యత్యాసాలపై వివరణ ఇవ్వాలంటూ ఎన్‌ఎంసీ నోటీసులు జారీ చేస్తుంది. తాజాగా అలాగే దేశవ్యాప్తంగా కాలేజీలకు నోటీసులు పంపింది. ఇప్పుడు ఆయా కాలేజీలు పంపే వివరణకు ఎన్‌ఎంసీ సంతృప్తి చెందితే సరి.. లేదంటే వైద్య విద్య నిబంధనల ప్రమాణాల నిర్వహణ చట్టం-2023 నిబంధనల మేరకు రూ.కోటి వరకు జరిమానా విధిస్తామని ఆ షోకాజ్‌ నోటీసుల్లో పేర్కొంది. అయితే సర్కారు వైద్య కళాశాలల తరఫున ప్రభుత్వమే అఫిడవిట్‌ ఇస్తుందని.. లోపాలను సరిదిద్దుకునేందుకు మరో అవకాశమివ్వాలని కోరితే.. ఎన్‌ఎంసీ జరిమానాతో సరిపెడుతుందని సీనియర్‌ అధ్యాపకులు చెబుతున్నారు.


తమిళనాడులో 36లో 34 కాలేజీలకు..

దక్షిణ భారతదేశంలో వైద్యం, వైద్య విద్యలో ముందున్న తమిళనాడుకు కూడా ఎన్‌ఎంసీ షాక్‌ ఇచ్చింది. ఆ రాష్ట్రంలో మొత్తం 36 ప్రభుత్వ వైద్య కళాశాలలుంటే, అందులో ఏకంగా 34 కాలేజీలకు నోటీసులు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 15 , 2025 | 04:30 AM