New Ration Cards: నేటి నుంచే కొత్త రేషన్‌కార్డులు
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:51 AM
రాష్ట్రంలో సోమవారం నుంచే కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో పంపిణీ చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగం
హైదరాబాద్, సూర్యాపేట, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సోమవారం నుంచే కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం అక్కడే నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఈ మేరకు సీఎం పర్యటన, సభ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రేషన్‌కార్డుల పంపిణీ, బహిరంగ సభ నేపథ్యంలో ఆదివారం సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ భేటీ అయి చర్చించారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో తిరుమలగిరిలోని సభా ప్రాంగణానికి చేరుకుంటారు. తొలుత కొత్త రేషన్‌కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు.
అనంతరం సభలో ప్రసంగిస్తారు. తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. 11 చోట్ల పార్కింగ్‌ను సిద్ధం చేశారు. ఈ సభ కోసం కాంగ్రెస్ నేతలు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలుతోపాటు మం త్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి కార్యకర్తలు, అభిమానులను తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. రేవంత్ సీఎం హోదాలో తొలిసారి సూర్యాపేట జిల్లాకు, తుంగతుర్తి నియోజకవర్గానికి వస్తుండటంతో ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా నిధులు, వరాలు ఏమైనా ఇస్తారని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తుంగతుర్తిలో జూనియర్ కళాశాలకు భవన నిర్మాణం, వెలుగుపల్లి రుద్రమ్మ చెరువు రిజర్వాయర్‌గా మార్పు, కాల్వలు నిర్మించి దేవాదుల నీటి సరఫరా, డిగ్రీ కళాశాల, ఫైర్‌స్టేషన్, బస్‌డిపో, 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
వికసిత్ తెలంగాణ బీజేపీకే సాధ్యం
Read Latest Telangana News And Telugu News