MLC Elections: టీచర్ ఎమ్మెల్సీ.. ఉత్కంఠ పోరు!
ABN , Publish Date - Feb 25 , 2025 | 04:12 AM
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పీఆర్‌టీయూ నేపథ్యం ఉన్న అభ్యర్థులు-బీసీ వాదానికి మధ్య పోరుగా మారాయి. వరంగల్, ఖమ్మం, నల్లగొండ, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది ఉన్నా ప్రధాన పోటీ ఐదారుగురి మధ్యే ఉంది.
బరిలో 19మంది అభ్యర్థులు.. ఐదారుగురి మధ్యే పోటీ
పీఆర్‌టీయూ నేపథ్యం ఉన్న నలుగురు తాజా, మాజీలు
కొరవడిన బీసీ ఐక్యత.. ఎవరిదారి వారిదే అన్నట్లు ఆ నేతల తీరు
బీసీ జేఏసీ అభ్యర్థికి జాజుల.. బీజేపీకి ఆర్ కృష్ణయ్య మద్దతు
అధికారికంగా ఎవరికీ మద్దతు ప్రకటించని కాంగ్రెస్, బీఆర్‌ఎస్
వరంగల్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పీఆర్‌టీయూ నేపథ్యం ఉన్న అభ్యర్థులు-బీసీ వాదానికి మధ్య పోరుగా మారాయి. వరంగల్, ఖమ్మం, నల్లగొండ, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది ఉన్నా ప్రధాన పోటీ ఐదారుగురి మధ్యే ఉంది. వీరిలో నలుగురు పీఆర్‌టీయూ నేపథ్యం ఉన్న అభ్యర్థులు ఉంటే.. వారిలో ఒకరు ప్రధానంగా బీసీ వాదాన్నే నమ్ముకున్నారు. ఈనెల 27న పోలింగ్ జరగనుంది. అధికార కాంగ్రె్‌సతో పాటు బీఆర్‌ఎస్ కూడా ఏ అభ్యర్థికీ మద్దతు ప్రకటించకపోవడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. 2019 ఎన్నికల్లో పీఆర్‌టీయూ నుంచి ఇద్దరు పోటీ చేయడం.. ఫలితంగా ఓట్లు చీలడంతో యూటీఎఫ్ అభ్యర్థికి ఎమ్మెల్సీ స్థానం దక్కింది. దీంతో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నిక పీఆర్‌టీయూకు సవాలుగా మారింది. ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తంగా 25,797 మంది ఓటర్లు ఉండగా, 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11,355 ఓట్లున్నాయి. వీటిలో 5,215ఓట్లు హనుమకొండ జిల్లాలో, 2,352 ఓట్లు వరంగల్ జిల్లాలో ఉన్నాయి. ఫలితంగా ప్రచారం మొత్తం వరంగల్ కేంద్రంగానే జరిగింది. ఈ ఎన్నికల్లో పీఆర్‌టీయూ నుంచి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి పోటీ చేస్తున్నారు.
ఇదే సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ బీసీ సంఘాల మద్దతుతో పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న పులి సరోత్తమ్‌రెడ్డి కూడా పూర్వ పీఆర్‌టీయూ అధ్యక్షుడే. వీరితో పాటు స్వత్రంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షన్‌వర్దన్‌రెడ్డి కూడా పీఆర్‌టీయూ నేపథ్యం నుంచి వచ్చిన వారే. నలుగురు అభ్యర్థులకూ పీఆర్‌టీయూ నేపథ్యం ఉండటంతో ఉపాధ్యాయులు మొగ్గు ఏటు? అనేది చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల్లో మొత్తంగా 18,885 ఓట్లు పోలయ్యాయి. వీటిలో చెల్లని ఓట్లు పోగా 18,027 ఓట్లు లెక్కించారు. వీటిలో యూటీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసిన నర్సిరెడ్డికి 8,976ఓట్లు పోలవ్వగా, పీఆర్‌టీయూ అభ్యర్థిగా పోటీ చేసిన పూల రవీందర్‌కు 6,279 ఓట్లు వచ్చాయి. నర్సిరెడ్డికి మరో 38 ఓట్లు తక్కువ పడటంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో నర్సిరెడ్డి 9,021 ఓట్లు, పూల రవీందర్‌కు 6,292ఓట్లు పోలయ్యాయి. దీంతో 2,729ఓట్ల ఆధిక్యతతో నర్సిరెడ్డి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో పీఆర్‌టీయూ రెబల్ అభ్యర్థిగా బరిలో దిగిన సరోత్తమ్‌రెడ్డికి 1,883 ఓట్లు పోలయ్యాయి. పీఆర్‌టీయూ ఓట్లు భారీగా చీలటంతో యూటీఎ్‌ఫకు లబ్ధిచేకూరిందని భావిస్తున్న పీఆర్‌టీయూ ఈసారి ఎమ్మెల్సీ సీటును దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. పీఆర్‌టీయూతో పాటు ఆ సంఘం చీలిక సంఘాల బాధ్యులు కూడా పోటీలో ఉండటంతో ఎన్నికలు ఉత్కంఠగా మారుతున్నాయి. బీజేపీ కూడా టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని సవాలుగా తీసుకుంటోంది. ఆ పార్టీ కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు కీలక నేతలు ఈటల రాజేందర్, డీకే.అరుణ తదితరులు టీచర్ ఎమ్మెల్సీ కోసం ప్రచారం చేస్తున్నారు. ఇక రెండోసారి ఎమ్మెల్సీ సీటును దక్కించుకోవాలని యూటీఎఫ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిని బరిలో దించింది. ప్రైవేటు విద్యాసంస్థల అధిపతి సుందరాజ్‌యాదవ్ కూడా పోటీలో ఉన్నారు.
బీసీల ఐక్యతకు సవాలుగా...
రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నప్పటికీ రాజకీయ వర్గాలను ఆకర్షిస్తోంది మాత్రం వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికనే. ఈనెల 2వ తేదీన వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన బీసీ గర్జన సభ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు మావే.. సీట్లు మావే అనే నినాదంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించుకుంటామని బీసీ సంఘం నేతలు ప్రకటనలు చేశారు. ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో 25,797 ఓట్లలో 20వేల ఓట్లు బీసీ ఉపాధ్యాయ ఓటర్లవే అని లెక్క కట్టారు. అయితే పోలింగ్ దగ్గర పడుతున్నకొద్దీ సంఘ నేతలు ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బీసీ గర్జన సభలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రకటన చేయటం చర్చనీయాంశంగా మారింది. బీసీ జాక్ పేరుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌కు బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సతో పాటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు మద్దతు ఇస్తున్నారు. బీసీ సంఘాల మద్దతులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వరంగల్‌లో భారీ బీసీ గర్జనకు ఏర్పాట్లు చేసిన సుందర్‌రాజ్‌యాదవ్‌కు మద్దతు కరువైంది. ఎక్కువ మంది బీసీ నేతలే పోటీలో ఉండటంతో ఓట్లు చీలి లక్ష్యం చెదిరిపోతుందనే ఆందోళన బీసీ వర్లాల్లో నెలకొంది. బీసీ నేతలంతా ఒక్కటిగా అభ్యర్థిని నిలిపితే రాజకీయాల్లో బీసీల ఐక్యత బలంగా కనిపించేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
తటస్థ వైఖరిలోనేకాంగ్రెస్, బీఆర్‌ఎస్..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎ్‌సలు తటస్థ వైఖరిని అవలంభిస్తున్నాయి. ఆ పార్టీ మద్దతు దారులు పోటీలో ఉన్నా ఎవ్వరికీ మద్దతు ప్రకటించటం లేదు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, టీచర్ జాక్ మద్దతుతో పోటీ చేస్తున్న గాల్‌రెడ్డి హర్షవర్దన్‌రెడ్డి ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ అభిమానులు మాత్రం పరోక్షంగా గాల్‌రెడ్డి హర్షన్‌వర్దన్‌రెడ్డికి మద్దతుగా పని చేస్తున్నట్టు సమాచారం. బీఆర్‌ఎస్ నేత, మాజీ వరంగల్ కుడా చైర్మన్ సుందరాజ్‌యాదవ్ టీచర్ ఎమ్మెల్సీ బరిలో ఉండడగా.. గులాబీ పార్టీ పరోక్షంగా కూడా మద్దతు ఇవ్వటం లేదు. బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని కాంగ్రె్‌సపై ఒత్తిడి తెస్తున్న బీఆర్‌ఎస్ బీసీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని బీసీ సంఘాల నేతలు కోరుతున్నా గులాబీ అధిష్ఠానం ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో ఉపాధ్యాయ సంఘాలతో ఒక్క బీజేపీనే ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొంటోంది.
ఇవి కూడా చదవండి...
CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి
Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..
TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..
Read Latest Telangana News And Telugu News