Share News

Telangana: సామ రామ్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ ఫిక్స్ అయినట్లేనా..

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:21 PM

Telangana MLA Quota MLC Elections: సామ రామ్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ ఫిక్స్ అయ్యిందా.. ఢిల్లీ నుంచి అధిష్టానం ఏం సిగ్నల్స్ పంపింది.. సామకు ఎమ్మెల్సీ ఇస్తే యువతకు ప్రోత్సాహం లభిస్తుందా.. కాంగ్రెస్‌లో యువ నాయకులు ఏం కోరుకుంటున్నారు.. ప్రత్యేక కథనం మీకోసం..

Telangana: సామ రామ్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ ఫిక్స్ అయినట్లేనా..
Sama Rammohan Reddy

హైదరాబాద్, మార్చి 07: తెలంగాణలో ఉపాధ్యాయ, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ముగిసింది. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోరు షురూ అయ్యింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మార్చి 29వ తేదీ నాటికి శాసన మండలిలో ఐదు స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ స్థానాలు భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 20వ తేదీన పోలింగ్ జరుగనుంది. దీంతో ప్రధాన పార్టీల్లోని ఆశావహులు ఎమ్మెల్సీ సీటు దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు పొందేందుకు రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు లాబీయింగ్‌లు చేస్తున్నారు. ఈ 5 సీట్లలో కాంగ్రెస్‌కు 4 దక్కే అవకాశం ఉంది.


4 ఎమ్మెల్సీలు గెలిచే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల తాకిడీ ఎక్కువైంది. టిక్కెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఎమ్మెల్సీ రేసులో జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, వేం నరేందర్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, జట్టి కుసుమ కుమార్, కుమార్ రావు, హర్కార వేణు గోపాల్ రావు, అంజన్ కుమార్ యాదవ్, చరణ్ కౌశిక్, సునీతా రావు, సరితా యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరంతా పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.


సామకు కన్ఫామా..

ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా.. ఎమ్మెల్యే కోటాలో టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ కన్ఫామ్ అయినట్లు సమాచారం అందుతోంది. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్‌గా, పార్టీ అధికార ప్రతినిధిగా ఎదిగారు సామ. అడ్వకేట్‌గా, మీడియా స్పోక్స్‌పర్సన్‌గా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో విధాలుగా సేవలు అందిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో సామ కృషి కూడా ఉందని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. బలమైన బీఆర్ఎస్ పార్టీ నేతలను తన వాగ్ధాటితో ఎదుర్కొని.. ప్రజల్లో నాటి ప్రభుత్వ తీరును, అరాచకాలను, అక్రమాలను ఎండగట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. యువ నాయకుడిగా.. నిత్యం ప్రజలతో మమేకమవుతూ వచ్చిన సామకు ఎమ్మెల్సీ ఇస్తే పార్టీకి మరింత ప్రయోజనం చేకూరుతుందంటున్నారు.


యువ నాయకుడికే మద్ధతు..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సారథ్యంలో పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. యువతకు అవకాశాలు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ మరింత బలపడే అవకాశం అధికంగా ఉంటుంది. అందుకే.. రాష్ట్రంలోనూ యువ నాయకులను పార్టీ ప్రోత్సహస్తోంది. అందులోనూ సామా రామ్మోహన్ రెడ్డి చాలా నేర్పరి. బీఆర్ఎస్‌లోని అగ్ర నాయకులను సైతం ఎదుర్కొన్న రాజకీయ చతురత కలిగిన నాయకుడు. ఇలాంటి నాయకుడికి ఎమ్మెల్సీ ఇస్తే.. యువతకు మంచి సందేశం పంపినట్లు అవుతుందని పార్టీలోని యువ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్‌గానే.. విపక్ష నాయకులను చెడుగుడు ఆడుకుంటున్న సామకు.. ఎమ్మెల్సీ ఇస్తే మరింత బలం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. కష్ట సమయాల్లోనూ కాంగ్రెస్‌కు అండగా ఉంటూ.. కాంగ్రెస్ అధికారి ప్రతినిధిగా సేవలందించిన సామకే ఎమ్మెల్సీ ఇవ్వాలని పార్టీలోని యువ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సామకు ఎమ్మెల్సీ ఇస్తే.. పార్టీలో యువతను మరింత ప్రోత్సహించినట్లు అవుతుందని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


అధిష్టానం సైతం..

కాంగ్రెస్ ఖతం అనుకున్న సమయంలో.. పార్టీని నిలబెట్టేందుకు సామ రామ్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన మాటలతో, పదునైన ప్రశ్నలతో నాటి అధికార బీఆర్ఎస్‌ను, ఆ పార్టీ నేతలను ఇరుకునపెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నాటి ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపి.. కాంగ్రెస్ వస్తే మేలు జరుగుతుందనే భావన ప్రజల్లో కల్పించడంలో సామ సూపర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయంలో సామ కృషి ఏమాత్రం తీసిపోలేనిది. అందుకే.. ఈ కష్టాన్ని గుర్తించిన అధిష్టానం.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటును సామకే ఇవ్వాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన పేరు కన్ఫామ్ అయిందని, అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు.

Updated Date - Mar 07 , 2025 | 12:38 PM