MSP Hike: వరికి తక్కువ ఇతర పంటలకు ఎక్కువ!
ABN , Publish Date - May 29 , 2025 | 04:48 AM
కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను పెంచుతూ రైతులకు శుభవార్త చెప్పింది. ప్రధాన పంట అయిన వరికి మాత్రం క్వింటాకు కేవలం రూ.69 పెంచిన కేంద్రం.. ఇతర పంటలకు కాస్త మెరుగ్గా కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)ను పెంచింది.
పత్తి కనీస మద్దతు ధర క్వింటాకు రూ.589 పెంపు.. వరికి కేంద్రం పెంచింది రూ.69 మాత్రమే
కేంద్రం నిర్ణయంపై రైతుల్లో మిశ్రమ స్పందన
హైదరాబాద్, మే 28 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను పెంచుతూ రైతులకు శుభవార్త చెప్పింది. ప్రధాన పంట అయిన వరికి మాత్రం క్వింటాకు కేవలం రూ.69 పెంచిన కేంద్రం.. ఇతర పంటలకు కాస్త మెరుగ్గా కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)ను పెంచింది. పత్తి పంటకు క్వింటాకు రూ.589 చొప్పున ఎమ్మెస్పీ పెరిగింది. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై వరి రైతులు కాస్త నైరాశ్యాన్ని, పత్తి రైతులు హర్షాన్ని వ్యక్తంచేస్తున్నారు. కనీస మద్దతు ధరల పెంపుపై రైతుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో వరి ప్రధాన పంటగా సాగవుతున్న విషయం తెలిసిందే..! ఈ ఏడాది వానాకాలంలో 67 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ తన ప్రణాళికలో పేర్కొంది. ఇందులో 45 లక్షల ఎకరాల్లో సన్నాలు, 22 లక్షల ఎకరాల్లో దొడ్డు రకాలు సాగుకానున్నట్లు తెలిపింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి మద్దతు ధరలను ప్రకటించింది. వరి సాధారణ రకానికి ఇదివరకు రూ. 2,300 ఉండేది. ఇప్పుడు రూ. 69 పెరగటంతో రూ. 2,369కి చేరుకుంది. గ్రేడ్ ‘ఏ’ రకానికి ఇదివరకు రూ.2,320 ఉండగా ఇప్పుడు రూ. 2,389కి చేరింది. వాస్తవానికి రాష్ట్రంలో సన్నాలు సాగుచేస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తోంది. దీంతో సాధారణ రకాలైన సన్నాలకు క్వింటాలుకు రూ. 2,869 చొప్పున, గ్రేడ్-‘ఏ’ రకం సన్నాలకు రూ. 2,889 చొప్పున రైతులకు గిట్టుబాటు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కనీసం రూ.200పెంచినా.. దొడ్డు ధాన్యానికి రూ.2,500 దాటేదని, సన్నాలకైతే బోన్‌సతో కలిపి రూ.3 వేలు దాటేదనే అభిప్రాయాన్ని రైతులు వ్యక్తంచేస్తున్నారు.
ఇతర పంటలకు రైతుల హర్షం
కేంద్ర ప్రభుత్వం పత్తికి రూ.589 చొప్పున ఎమ్మెస్పీని పెంచింది. దీంతో.. పింజ పొడువు మధ్యస్థంగా ఉండే పత్తి ధర రూ.7,710కి పెరగ్గా, పొడవు ఎక్కువగా ఉండే పత్తి ధర క్వింటాకు రూ. 8,110కి చేరుకుంది. ఈ పెంపు రైతులకు కాస్త ఉపశమనమిస్తోంది. పత్తి కొనుగోళ్లు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నేరుగా చేస్తోంది. రైతులు నేరుగా సీసీఐకి పత్తి విక్రయిస్తే.. ఎమ్మెస్పీ రైతుల ఖాతాల్లో పడుతుంది. 2013-14తో పోలిస్తే ఇప్పుడు పత్తి మద్దతు ధర 103ు నుంచి 108ు వరకు పెరిగిందని కేంద్రం వెల్లడించింది. జొన్నలకు రూ. 328, సజ్జలకు రూ.150, రాగులకు రూ.596, మొక్కజొన్నకు రూ.175, పెసర్లకు రూ.86, కందులకు రూ.450, వేరుశనగకు రూ.480, మినుములకు రూ.400, పొద్దుతిరుగుడుకు రూ.441, కుసుమలకు రూ.579, సోయాబీన్‌కు రూ.436, నువ్వులకు రూ.820 చొప్పున ఎమ్మెస్పీ పెరిగింది. ఇతర పంటలను ఎక్కువగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వరి మద్దతు ధరను తక్కువగా, నూనెగింజలు, పప్పుదినులు, ఇతర ఆహార ధాన్యాల ధరలను కాస్త ఎక్కువగా పెంచిందని వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, రైతులు ఎక్కువ సాగుచేసే పంటలకు తక్కువ ఎమ్మెస్పీ పెంచారని, తక్కువగా సాగయ్యే పంటలకు ఎక్కువ ఎమ్మెస్పీ పెంచారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నింటికంటే ఒలిశలు(గడ్డి నువ్వులు) ఎమ్మెస్పీని రూ.820 మేర పెంచడంతో.. వాటి ధర క్వింటాకు రూ.9,537కు చేరుకుంది. వీటి సాగు రాష్ట్రంలో పెద్దగా ఉండదని రైతులు చెబుతున్నారు. దీంతో ఇక్కడి రైతులకు కలిగే ప్రయోజనం ఏమీ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జొన్నలు, సజ్జల ఎమ్మెస్పీ కూడా చాలా స్వల్పంగా పెరిగింది. మొక్కజొన్న సాగు కూడా రాష్ట్రంలో రెండు సీజన్లలో కలిపి 13-15 లక్షల ఎకరాల వరకు ఉంటుంది.
తెలంగాణ రైతులకు మేలు: కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ: 14 పంటలకు ఎమ్మెస్పీని పెం చుతూ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణతోపా టు.. దేశవ్యాప్తంగా రైతులకు ఎంతగానో మేలు కలుగుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్రం నిర్ణయం ప్రకారం వరి కనీస మద్దతు ధర రూ.2,369కి, పత్తి మద్దతు ధర రూ.7,710కి పెరిగిందని వివరించారు.
Also Read:
తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఎవరంటే
For More Telangana News and Telugu News..