Julia Morley: అందంతో కీర్తి.. మహిళల్లో స్ఫూర్తి
ABN , Publish Date - May 09 , 2025 | 02:40 AM
అందాల పోటీలు కేవలం అందాన్ని ప్రదర్శించడానికి కాదు.. అందమైన విజయాలు సాధించడానికి, మహిళలకు అందమైన స్ఫూర్తి కలిగించడానికి, సంతోషాలతో కూడిన అందమైన ప్రపంచాన్ని సృష్టించడానికి.. అని మిస్ వరల్డ్ సంస్థ చైర్‌పర్సన్, సీఈవో జూలియా మోర్లీ అన్నారు.
మిస్ వరల్డ్ విజేతలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నారు
ఆఫ్రికాలోని పేద దేశాల్లోనూ గణనీయమైన మార్పులు
రాష్ట్రాన్ని కొత్తగా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాం
ఈసారి ‘హ్యుమానిటేరియన్ అవార్డ్’ సోనూసూద్‌కు
‘ఆంధ్రజ్యోతి’తో మిస్ వరల్డ్ చైర్‌పర్సన్, సీఈవో జూలియా
తెలంగాణకు గొప్ప సాంస్కృతిక వారసత్వం
ఇక్కడి ప్రజల ఆతిథ్యం నన్నెంతో ఆకర్షించింది
హైదరాబాద్, మే 8 (ఆంధ్రజ్యోతి): ‘అందాల పోటీలు కేవలం అందాన్ని ప్రదర్శించడానికి కాదు.. అందమైన విజయాలు సాధించడానికి, మహిళలకు అందమైన స్ఫూర్తి కలిగించడానికి, సంతోషాలతో కూడిన అందమైన ప్రపంచాన్ని సృష్టించడానికి’.. అని మిస్ వరల్డ్ సంస్థ చైర్‌పర్సన్, సీఈవో జూలియా మోర్లీ అన్నారు. తెలంగాణ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్ పోటీలతో సేవారంగంలో ప్రపంచానికి ఒక మంచి సందేశం ఇవ్వనున్నామని, తెలంగాణ పర్యాటకాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లనున్నామని చెప్పారు. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకంగా జరిగే అందాల పోటీలకు గత 25 ఏళ్లుగా చైౖర్‌పర్సన్‌గా ఉన్న జూలియా.. శనివారం నుంచి 72వ మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణను ఎంపిక చేయడం వెనక కారణం?
72వ మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు తెలంగాణను ఎంచుకోవడం గర్వంగా, సంతోషంగా ఉంది. ఇక్కడి సాంస్కృతిక వారసత్వం ఎంతో చారిత్రక ప్రాశస్త్యాన్ని కలిగి ఉంది. భిన్న మతాలు, సంస్కృతుల సమ్మేళనమైన తెలంగాణలోని ప్రజల హృదయపూర్వక ఆతిథ్యం నన్ను ఎంతో ఆకర్షించింది. తరతరాలుగా కొనసాగుతున్న చేనేత లాంటి కళలు ఈ రాష్ట్రం ప్రత్యేకత. ఇక్కడ శతాబ్దాల చరిత్ర ఉన్న అత్యంత సుందరమైన వారసత్వ కట్టడాలున్నాయి. యునెస్కో గుర్తింపు పొందిన ఆలయాలున్నాయి. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో హైదరాబాద్ అంతర్జాతీయ ప్రముఖ నగరాలతో పోటీపడుతోంది. ఇలాంటి ఎన్నో విశేషాలున్న తమ రాష్ట్రం గురించి ప్రపంచానికి తెలపాలని ఇక్కడి ప్రభుత్వం ఎంతో పట్టుదలతో ఉంది. ఇలాంటి చారిత్రక నగరంలో పోటీలు నిర్వహించడం, ఇందులో మేమంతా భాగస్వామ్యం కావడం గర్వంగా భావిస్తున్నాను. మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణను ఎందుకు ఎంచుకున్నారని (వై ఇన్ తెలంగాణ? అని) చాలామంది నన్ను ప్రశ్నిస్తున్నారు. వారందరికీ నా సమాధానం ఒక్కటే.. ‘వై నాట్ తెలంగాణ’!
భారత్ ప్రదర్శన ఎలా ఉంటోంది?
ఇండియా అంటే వ్యక్తిగతంగా నాకు ప్రత్యేక ఆసక్తి. ప్రపంచంలో ఏ దేశంలో లేని భిన్నత్వం ఇక్కడ కనిపిస్తుంది. అందంలోనే కాదు అన్ని రంగాల్లో ఇక్కడి మహిళలు ప్రపంచంపై తమ ముద్ర చూపుతున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లోనూ భారత్ తన ప్రత్యేక ముద్ర చాటుతోంది. తొలిసారి 1966లో మిస్ వరల్డ్ కిరీటం కైవసంతో భారత్ పేరు మార్మోగింది. ఇప్పటివరకు ఈ దేశ యువతులు ఆరుసార్లు ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. అందాల పోటీల్లో పాల్గొనడమే కాదు.. నిర్వహణలోనూ ఇప్పుడు భారత్ ప్రత్యేకత సాధించింది. బ్రిటన్ తర్వాత వరుసగా రెండుసార్లు మిస్ వరల్డ్‌కు ఆతిథ్యమిచ్చిన దేశంగా భారత్ పేరు నిలిచిపోతుంది.
ఈసారి ప్రత్యేకత?
అందాల పోటీలంటే శారీరక సౌందర్యం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యత, సమస్యల్లో ఉన్న వర్గాలకు చేయూత అందించడం మిస్ వరల్డ్ సంస్థగా మా కీలకమైన బాధ్యత. పోటీలు నిర్వహించే ప్రదేశం నుంచి ప్రపంచానికి ఓ శక్తిమంతమైన సందేశం పంపాలన్నదే మా లక్ష్యం. దీంట్లో భాగంగానే.. గొప్ప సేవా కార్యక్రమాలు చేపడుతున్న వారికి ‘హ్యుమానిటేరియన్ అవార్డ్’ కూడా ప్రకటిస్తున్నాం. గత ఏడాది ముంబైలో జరిగిన 71వ మిస్ వరల్డ్ పోటీల్లో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీకి అవార్డు ప్రదానం చేయగా.. ఈసారి సూద్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ నటుడు సోనూసూద్‌కు అందిస్తున్నాం. కొవిడ్ సమయంలో సోనూసూద్ చేసిన సేవా కార్యక్రమాలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళలకు సూద్ ఫౌండేషన్ ఉచితంగా శస్త్ర చికిత్సలు జరిపిస్తూ వారిని ఆదుకుంటోంది. ప్రపంచం అంతా మిస్ వరల్డ్ పోటీలను తిలకిస్తుంది.
మిస్ వరల్డ్ పోటీలు మహిళల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయి?
72 ఏళ్లుగా సాగుతున్న ప్రయాణంలో ప్రపంచ మహిళలకు మిస్ వరల్డ్ ఎన్నో విజయాలు అందించింది. మహిళా సాధికారత ఏమాత్రం లేని అత్యంత పేద, నిరక్షరాస్య దేశాల నుంచి కూడా యువతులు ఈ పోటీల్లో పాల్గొని విజయాలు సాధించారు. తమ దేశాల్లో మార్పునకు శ్రీకారం చుట్టారు. ఆఫ్రికన్ దేశాలైన నైజీరియా, బోట్స్‌వానా నుంచి విజేతలుగా గెలుపొందిన యువతులు.. తమ దేశంలోని యువతులు, మహిళలకు ఆదర్శంగా నిలిచారు. అక్షరాస్యత పెరుగుదల, బాలికల విద్య, మహిళా సాధికారతకు కృషి చేసి అక్కడి ప్రజల్లో స్ఫూర్తి నింపారు. ప్రతి మిస్ వరల్డ్ విజేత ప్రపంచాన్ని ప్రభావితం చేయాలన్నది, ప్రపంచ మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలన్నది మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ లక్ష్యం. అందుకే ఏటా విజేతలను ప్రపంచ అంబాసిడర్‌గా నియమించి పలు దేశాల సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా చేస్తాం.
ఈ వార్తలు కూడా చదవండి..
నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక
హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
For More AP News and Telugu News