ఉత్తర తెలంగాణలో స్వల్ప భూకంపం
ABN , Publish Date - May 06 , 2025 | 06:04 AM
ఉత్తర తెలంగాణలో సోమవారం సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది. నిర్మల్, నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాలపై ఈ ప్రభావం కనిపించింది.
రిక్టర్ స్కేల్‌పై 3.8 తీవ్రత.. భయంతో రోడ్లపైకి వచ్చిన ప్రజలు
ఆ వెంటనే ఈదురుగాలులు
విద్యుత్తు సరఫరాకు అంతరాయం
కరీంనగర్, నిర్మల్, దుబ్బాక, మే 5 (ఆంధ్రజ్యోతి): ఉత్తర తెలంగాణలో సోమవారం సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది. నిర్మల్, నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాలపై ఈ ప్రభావం కనిపించింది. సోమవారం సాయంత్రం 6.50 గంటల సమయంలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.8గా నమోదైంది. భూకంప కేంద్రం ఆసిఫాబాద్ వద్ద ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో భూకంపం వచ్చిన కాసేపటికే ఈదురు గాలులు వీయడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయమేర్పడింది. భయంతో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. గత నెలలోనే 10-17 తేదీల మధ్య ఈ ప్రాంతాల్లో భూకంపం రానున్నట్లు శాస్త్రవేత్తలు ముం దుగానే హెచ్చరించారు. అప్పట్లో భూకంపం రాకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. అనూహ్యంగా సోమవారం స్వల్ప భూప్రకంపనలు, ఈదురు గాలులతో ప్రజలు ఆందోళన చెందారు.
కరీంనగర్‌లోని కొత్తపల్లి, చొప్పదండి, తిమ్మాపూర్, మానకొండూర్, గన్నేరువరం, గంగాధర, రామడుగు మండలాల్లో.. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి, మల్లాపూర్, ఎండపల్లి, వెల్గటూర్ మండలాల్లో.. రాజన్న-సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోని పెద్దపల్లి, రామగుండం, గోదావరిఖని, సుల్తానాబాద్, ధర్మారం, పాలకుర్తి, కమాన్‌పూర్ మండలాలు, ఆసిఫాబాద్‌లోని రెబ్బెన మండలం, మంచిర్యాల జిల్లా జన్నారం మండలా ల్లో భూప్రకంపనలు వచ్చాయి. జగిత్యాలలోని మునిసిపల్ కార్యాలయం లో భూకంపంతో ఫైళ్లు, టేబుళ్లు కదలగా.. మునిసిపల్ కమిషనర్ స్పం దన, ఉద్యోగులు బయటకు వచ్చారు. జగిత్యాల మండలం తిప్పన్నపేటలో ఓ ఇంటి గోడలకు పగుళ్లు రాగా.. భీమారంలోని హనుమాన్‌వాడలో ఓ ఇంటి పైకప్పులు స్వల్పంగా కూలిపోయాయి. అటు నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోని ఖానాపూర్, కమ్మర్‌పల్లి, మోర్తాడ్, సిరికొండ ప్రాం తాల్లో 2 సెకన్లపాటు భూమి కంపించినట్లు సీసీకెమెరాల్లో రికార్డయింది. ఈ ప్రాంతాల్లో రాత్రిళ్లు కూడా భయంతో ప్రజలు బయటే పడిగాపులుకాస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేటలో సాయం త్రం 6.59-7.01 గంటల మధ్య రెండు సెకన్లపాటు భూమి కంపించింది. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా భూకంపం ప్రభావం కనిపించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..
WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
TGSRTC: బస్ భవన్‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం
For Telangna News And Telugu News