Uttam Kumar Reddy: సింగూరు డ్యామ్ రక్షణకు చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:09 AM
సింగూరు కట్ట రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ప్రమాదంలో సింగూరు రిజర్వాయర్’ శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై మంత్రి స్పందించారు.
అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు
సింగూరు ప్రాజెక్టుకు ఇప్పటికిప్పుడే ప్రమాదమేమీ లేదు
చిన్న చిన్న లీకేజీలను సరిచేస్తాం
ఈఎన్‌సీ మహ్మద్ అంజద్‌హుస్సేన్
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల పునరుద్ధరణకు రూట్‌మ్యాప్
హైదరాబాద్, పుల్‌కల్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): సింగూరు కట్ట రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ప్రమాదంలో సింగూరు రిజర్వాయర్’ శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై మంత్రి స్పందించారు. సచివాలయంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్‌సీ (జనరల్) మహ్మద్ అంజద్ హుస్సేన్ తదితరులతో సమీక్షించారు. సింగూరు రిజర్వాయర్ మరమ్మతులకు ఎందుకు చర్యలు తీసుకోలేదని మంత్రి ఆరా తీయగా.. సంగారెడ్డి ఎస్‌ఈ, సీఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఏ పని చేయాలన్నా ఈ రెండు పోస్టుల్లో అధికారులు అవసరమని అధికారులు వివరించినట్లు సమాచారం. ఎస్‌ఈ పదోన్నతుల ఫైల్ ఆమోదం పొందిందని, తక్షణమే పోస్టింగులపై నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
అనంతరం ప్రాజెక్టును పరిశీలించి చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. మంత్రి ఆదేశాలతో ఈఎన్‌సీ మహ్మద్ అంజద్ హుస్సేన్, ఈఎన్‌సీ (ఓ అండ్ ఎం) టి.శ్రీనివాస్... చీఫ్ ఇంజనీర్ ఎం.సత్యనారాయణరెడ్డి, ఈఈ (సెంట్రల్ డిజైన్స్) ఎంఎన్‌వీ చంద్రశేఖర్‌లతో సింగూరు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం మీడియాతో ఈఎన్‌సీ అంజద్ హుస్సేన్ మాట్లాడుతూ తాత్కాలికంగా ఇసుక, కంకర బస్తాలతో దెబ్బతిన్న ఆనకట్ట ప్రాంతానికి మరమ్మతులు చేపట్టి పటిష్ఠం చేస్తామన్నారు. అయితే నీటి నిల్వలు గరిష్ఠంగా ఉంటే పనులు చేపట్టలేమని, నీటి నిల్వలు తగ్గాక పూర్తి స్థాయి పనులు చేపడతామని తెలిపారు. సింగూరు ప్రాజెక్టుకు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమీలేదన్నారు. ప్రాజెక్టు డేంజర్ జోన్‌లో ఏమీ లేదని, చిన్నచిన్న లీకేజీలను సరిచేస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టులో కొన్ని సాంకేతిక సమస్యలను సరి చేస్తామని తెలిపారు. ఆనకట్ట భద్రత కమిటీ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసి పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్
‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’
For More AndhraPradesh News And Telugu News