Seethakka: నేను ఎవరి మీదా ఫిర్యాదు చేయలేదు: మంత్రి సీతక్క
ABN , Publish Date - Oct 12 , 2025 | 05:16 PM
మేడారం ఆలయ అభివృద్ధి పనుల విషయంలో PCC చీఫ్‌కు తాను ఎవరి మీదా ఫిర్యాదు చేయలేదని మంత్రి సీతక్క స్పష్టతనిచ్చారు. సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయని ఆమె తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 12: మేడారం ఆలయ అభివృద్ధి పనుల విషయంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు తాను ఎవరి మీదా ఫిర్యాదు చేయలేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. 'సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.. మీడియాలో వచ్చిన వార్తలను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లా. వీలైనంత త్వరగా వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా చూడాలని పీసీసీ చీఫ్ ను కోరాను' అని మంత్రి సీతక్క తెలిపారు.
ఆదివాసీ వీర వనితలు సమ్మక్క, సారలమ్మ ఆలయ అభివృద్ధి పనుల చుట్టూ ఏ చిన్న పాటి వివాదం ఉండకూడదన్న ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా పీసీసీ చీఫ్ దృష్టికి మీడియాలో వచ్చిన వార్తలను తీసుకెళ్లానని మంత్రి వివరణ ఇచ్చారు. 'ఆలయ అభివృద్ధి పనులు అత్యంత ప్రాధాన్యమైనవి. వాటి చుట్టూ ఎలాంటి అపార్థాలు లేకుండా, పనులు సజావుగా పూర్తి కావాలి. సున్నితమైన అంశం కావడంతో, వీలైనంత త్వరగా అపార్థాలు తొలగిపోయి అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగేలా చూడమని కోరాను. అంతే తప్ప నేను ఎవరి మీద పీసీసీ చీఫ్ కు ఫిర్యాదు చేయలేదు' అని సీతక్క అన్నారు.
మేడారం ఆలయం అభివృద్ధి మన అందరి బాధ్యతని చెప్పిన మంత్రి.. పనులు నిర్ణీత గడువులో పూర్తయ్యేలా సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా కొనసాగిస్తున్నామని వివరించారు.
ఇవి కూడా చదవండి..
కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!
For More National News And Telugu News