Share News

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 18

ABN , Publish Date - Jan 19 , 2025 | 04:22 AM

ఛత్తీస్‌గఢ్ లోని దక్షిణ బస్తర్‌ మారేడుబాక అడవుల్లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య 12 కాదా?

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 18

  • నిర్ధారిస్తూ లేఖ విడుదల చేసిన మావోయిస్టులు .. 12 మంది చనిపోయినట్లు పోలీసుల ప్రకటన

వరంగల్‌ ప్రతినిధి/చర్ల, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్ లోని దక్షిణ బస్తర్‌ మారేడుబాక అడవుల్లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య 12 కాదా? మొత్తం 18 మంది చనిపోయారా? వీరిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ ఉన్నారా? ఈ ప్రశ్నలకు మావోయిస్టు పార్టీ ఔననే పేర్కొంటూ దక్షిణ బస్తర్‌ కార్యదర్శి గంగా పేరుతో శనివారం మీడియాకు ఓ లేఖ పంపింది. అంతేకాదు.. ఈ ఎన్‌కౌంటర్‌లో పోలీసుల వైపు కూడా మరణాలు నమోదయ్యాయని, దామోదర్‌ వీరోచితంగా పోరాడి, అమరుడయ్యారని ఆ లేఖలో వెల్లడించింది. అయితే.. అటు ఛత్తీస్‌గఢ్ , ఇటు తెలంగాణ పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. చనిపోయిన మావోయిస్టుల్లో పెద్ద నాయకులెవరూ లేరని ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. శనివారం మధ్యాహ్నం దక్షిణ బస్తర్‌ కమిటీ కార్యదర్శి గంగా పేరుతో మీడియాకు విడుదలైన ప్రెస్‌నోట్‌లో.. ‘‘12 మంది చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే.. మొత్తం 18 మంది చనిపోయారు.


ఆరు మృతదేహాలను మా వెంట తీసుకెళ్లాం. మృతుల్లో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చొక్కారావు అలియాస్‌ దామోదర్‌, హంగి, దెవే, జోగా, నర్సింహారావు ఉన్నారు. దామోదర్‌పై రూ.50 లక్షల రివార్డు ఉంది’’ అని పేర్కొన్నారు. శనివారం సాయంత్రం బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ కూడా ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. అయితే.. నక్సల్స్‌ లేఖను ధ్రువీకరించకుండా.. ‘‘18 మంది చనిపోయారని మావోయిస్టులు చెబుతున్నారు. వారిలో దామోదర్‌ ఉన్నట్లు వారు(నక్సల్స్‌) అంగీకరిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. కానీ, ఆ వివరాలను ధ్రువీకరించలేదు. తెలంగాణ స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఎ్‌సఐబీ) అధికారులు కూడా ఆ లేఖను ధ్రువీకరించలేదు. ‘‘మాకు అందిన సమాచారం ప్రకారం ఆ ఎన్‌కౌంటర్‌లో పెద్ద నాయకులెవరూ లేరు. నర్సింహారావు అనే తెలుగు మావోయిస్టు మృతిచెందినట్లు నిర్ధారణ అయ్యింది’’ అని స్పష్టం చేశారు.


ఎవరీ దామోదర్‌?

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే బతుకమ్మ-ఎల్లయ్య దంపతులకు చిన్న కుమారుడు బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ స్కూలులో చదవుతున్నప్పుడే.. అతని పెదనాన్న కుమారులు బడే నాగేశ్వర్‌రావు, పూర్ణచందర్‌ నక్సలిజం వైపు మళ్లారు. వారి ప్రభావం దామోదర్‌పై పడి.. గోవిందరావుపేటలో ఇంటర్‌ చదువుతున్నప్పుడు అప్పటి పీపుల్స్‌వార్‌ అనుబంధ సంస్థ రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌(ఆర్‌ఎ్‌సయూ)లో వరంగల్‌ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 1993లో అజ్ఞాత దళంలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి.. తెలంగాణ యాక్షన్‌ టీమ్‌ కమాండర్‌గా పనిచేశారు. 2021లో కొవిడ్‌ సమయంలో యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ మరణంతో రెండేళ్ల పాటు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి స్థానం ఖాళీగా ఉంది. కేంద్ర కమిటీ ఆదేశాలతో దామోదర్‌ 2023 జనవరిలో ఆ బాధ్యతలను స్వీకరించారు. దామోదర్‌ మరణించాడనే ప్రచారంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


22 మంది మిలీషియా సభ్యుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్ లోని సుకుమా జిల్లా ఎర్రపల్లికి చెందిన 22 మంది మిలీషియా సభ్యులు శనివారం భద్రాద్రి-కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌ రాజ్‌ ఎదుట లొంగిపోయారు. వీరిని అన్నిరకాలుగా ఆదుకుంటామని ఎస్పీ ఈ సందర్భంగా ప్రకటించారు. చర్ల పోలీ్‌సస్టేషన్‌లో సీఐ రాజువర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన అజ్ఞాత దళ సభ్యుల కుటుంబీకులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా మిలీషియా సభ్యులు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఏడాది కాలంలో తెలంగాణలో మావోయిస్టుల సంఖ్య తగ్గిందన్నారు. గతంలో 36 మంది నక్సల్స్‌ ఉండగా.. ఇప్పుడు వారి సంఖ్య నాలుగుకు చేరిందని పేర్కొన్నారు. భద్రాద్రి-కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఆజాద్‌, సభ్యులు మధు, వెంకటేశ్‌, చంద్రన్న కూడా పోలీసుల ఎదుట లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. నక్సల్స్‌ కుటుంబ సభ్యులు, లొంగిపోయిన మిలీషియా సభ్యులతో కలిసి ఎస్పీ సహపంక్తి భోజనం చేశారు.

Updated Date - Jan 19 , 2025 | 04:22 AM