Share News

12 మంది మావోయిస్టుల కాల్చివేత

ABN , Publish Date - Jan 17 , 2025 | 04:23 AM

తెలంగాణ సరిహద్దులకు 15 కిలోమీటర్ల దూరంలో.. ఛత్తీ్‌సగఢ్‌లోని మారేడుబాక అడవుల్లో తుపాకులు గర్జించాయి. డీఆర్‌జీ, కోబ్రా బలగాలకు చెందిన వెయ్యిమంది నిర్వహించిన ఆపరేషన్‌లో.. తమకు తారసపడ్డ మావోయిస్టులను రెండు కిలోమీటర్ల దూరం వరకు వెంటాడి.. వేటాడి కాల్చిచంపారు.

12 మంది మావోయిస్టుల కాల్చివేత

  • రెండు కిలోమీటర్ల మేర వెంటాడిన భద్రతా దళాలు

  • తెలంగాణ సరిహద్దు మారేడుబాక అడవుల్లో ఘటన

  • వెయ్యిమందితో ఆపరేషన్‌.. భారీగా ఆయుధాల స్వాధీనం

  • మావోయిస్టుల సాంకేతిక టీమ్‌ కమాండర్‌ లొంగుబాటు

చర్ల, జనవరి(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సరిహద్దులకు 15 కిలోమీటర్ల దూరంలో.. ఛత్తీ్‌సగఢ్‌లోని మారేడుబాక అడవుల్లో తుపాకులు గర్జించాయి. డీఆర్‌జీ, కోబ్రా బలగాలకు చెందిన వెయ్యిమంది నిర్వహించిన ఆపరేషన్‌లో.. తమకు తారసపడ్డ మావోయిస్టులను రెండు కిలోమీటర్ల దూరం వరకు వెంటాడి.. వేటాడి కాల్చిచంపారు. పోలీసుల కథనం ప్రకారం.. బీజాపూర్‌ జిల్లా పూజారికాంకేర్‌ సమీపంలోని మారేడుబాక అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్లు బలగాలకు ఉప్పందింది. దీంతో.. గురువారం ఉదయం సుమారు వెయ్యి మంది డీఆర్జీ, కోబ్రా బలగాలు కూంబింగ్‌కు ఉపక్రమించాయి. ఉదయం 9 గంటల సమయంలో బలగాలకు మావోయిస్టులు తారసపడడంతో.. ఇరువైపులా కాల్పులు మొదలయ్యాయి.


మధ్యాహ్నం మూడు గంటల వరకు కాల్పులు కొనసాగాయి. ఓ దశలో తమవైపు నష్టం జరుగుతున్నట్లు గుర్తించిన మావోయిస్టులు అడవుల్లోకి వెళ్లగా.. బలగాలు వారిని రెండు కిలోమీటర్ల దూరం వరకు వెంటాడాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 12 మంది మావోయిస్టుల మృతదేహాలను, భారీగా ఆయుధాలు, మందుపాతరలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను గుర్తించాల్సి ఉందన్నారు. మృతుల్లో తెలుగువారు ఉండిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారానికి వివరాలు తెలుస్తాయని చెప్పారు. కాగా.. ఈ ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇప్పటి వరకు 20 మంది నక్సల్స్‌ మృతిచెందినట్లు బస్తర్‌ రేంజ్‌ ఐజీ కార్యాలయం తెలిపింది. ఈ నెల 12న బీజాపూర్‌లో జరిగిన నేషనల్‌పార్క్‌ ఎన్‌కౌంటర్లో ఐదుగురు, సుకుమా జిల్లా పాలగూడ అడవుల్లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు చొప్పున మావోయిస్టులు మృతిచెందినట్లు గుర్తుచేసింది.


కమల్‌దాస్‌ ఉసెండీ లొగుబాటు

మావోయిస్టు పార్టీలో టెక్నికల్‌ టీమ్‌ కమాండర్‌గా పనిచేస్తున్న గింజురాం అలియాస్‌ కమల్‌దాస్‌ ఉసెండీ గురువారం ఛత్తీ్‌సగఢ్‌లోని కొండగావ్‌ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 27 ఏళ్లుగా ఇతను నక్సల్‌బరి ఉద్యమం, మావోయిస్టు పార్టీలో పనిచేశాడు. మిలీషియా సభ్యుడుగా కూడా పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం టెక్నికల్‌ టీమ్‌ కమాండర్‌గా పనిచేస్తున్నాడు. కమల్‌దా్‌సపై రూ.25 లక్షల రివార్డు ఉందని, ప్రభుత్వం తరఫున ఇతనికి ప్యాకేజీని అందజేస్తామని పోలీసులు వెల్లడించారు.

Updated Date - Jan 17 , 2025 | 04:23 AM