Share News

Mahesh Kumar Goud: కుల సర్వే జరిపించడం నాకు గర్వకారణం

ABN , Publish Date - May 24 , 2025 | 04:51 AM

టీపీసీసీ అధ్యక్షుడిగా తన ఏడు నెలల పదవీకాలంలో అత్యంత సంతృప్తికర అంశం కుల సర్వే అని మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. తెలంగాణలో చేసిన కుల సర్వే దేశానికే ఆదర్శంగా నిలవడం, బీసీలు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతుండటంతో ప్రధాని మోదీ సైతం కలవరపడి దేశవ్యాప్తంగా కులగణన జరిపిస్తామని ప్రకటించారని చెప్పారు.

Mahesh Kumar Goud: కుల సర్వే జరిపించడం నాకు గర్వకారణం

  • కేసీఆర్‌ నియంత.. రేవంత్‌ ప్రజాస్వామికవాది

  • బీఆర్‌ఎస్‌ ముక్కలవడం ఖాయం: మహేశ్‌గౌడ్‌

  • జన్మదినం సందర్భంగా ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ

  • ఆయన మద్దతుతోనే పీసీసీ చీఫ్‌ పదవి

  • మంత్రులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు

  • 2028లో మళ్లీ తెలంగాణలో.. 2029లో కేంద్రంలో అధికారంలోకి..

  • నెలాఖరులోపు పీసీసీ కార్యవర్గం

  • రెండు నెలాల్లో మండల, జిల్లా అధ్యక్షుల నియామకం: మహేశ్‌గౌడ్‌

న్యూఢిల్లీ, మే 23 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధ్యక్షుడిగా తన ఏడు నెలల పదవీకాలంలో అత్యంత సంతృప్తికర అంశం కుల సర్వే అని మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. తెలంగాణలో చేసిన కుల సర్వే దేశానికే ఆదర్శంగా నిలవడం, బీసీలు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతుండటంతో ప్రధాని మోదీ సైతం కలవరపడి దేశవ్యాప్తంగా కులగణన జరిపిస్తామని ప్రకటించారని చెప్పారు. ఇందుకు తాను గర్వపడుతున్నానని పేర్కొన్నారు. నిజానికి ఆర్‌ఎ్‌సఎస్‌ కులగణనను వ్యతిరేకించిందన్న విషయాన్ని గుర్తు చేశారు. రాహుల్‌ గాంధీ సమక్షంలో కులగణనపై ఇతర రాష్ట్రాల నేతలకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చే అవకాశాన్ని తనకు ఇచ్చారని తెలిపారు. శనివారం తన జన్మదినం సందర్భంగా ఢిల్లీలో ఆంధ్రజ్యోతి ప్రతినిధికి మహేశ్‌గౌడ్‌ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో.. రేవంత్‌రెడ్డి పీసీసీ అఽధ్యక్షుడిగా, తాను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కులగణన, బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ వాగ్దానం చేశామని, ఆరు గ్యారంటీలను ప్రకటించామని.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు కారణమయ్యాయని చెప్పారు. ఆ హామీలన్నీ నెరవేర్చడంతో దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందన్నారు. రేవంత్‌ రెడ్డి వర్గానికి చెందినప్పటికీ రాష్ట్రంలో బీసీలు కాంగ్రె్‌సకు సానుకూలంగా మారేందుకు తోడ్పడ్డారని.. సోనియా, రాహుల్‌ వాగ్దానాలు, రేవంత్‌ ఆకర్షణ కాంగ్రె్‌సను గెలిపించాయని పేర్కొన్నారు.


కలసికట్టుగా పనిచేస్తున్నాం..

గత ఏడు నెలలుగా పార్టీ, ప్రభుత్వం చక్కటి సమన్వయంతో పనిచేశాయని, అందువల్లే ప్రజల్లో ప్రభావం చూపించగలిగామని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ చెప్పారు. తాను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు రేవంత్‌ తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని.. ఇప్పుడు రేవంత్‌ సీఎంగా, తాను పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని ప్రజల్లోకి విజయవంతంగా తీసుకువెళుతున్నామని పేర్కొన్నారు. రేవంత్‌తో ప్రయాణం అత్యంత సంతృప్తికరంగా ఉందని తెలిపారు. కేసీఆర్‌ నియంత అని, ప్రజాస్వామ్య లక్షణాలు మచ్చుకైనా లేవని విమర్శించారు. అదే రేవంత్‌ ప్రజాస్వామిక వాది అని, ఆయన నాయకత్వంలో మంత్రులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. చెన్నారెడ్డి, డి.శ్రీనివాస్‌ తనను రాజకీయాల్లో ప్రోత్సహించారని చెప్పారు. రేవంత్‌ మద్దతుతోనే తాను పీసీసీ అధ్యక్షుడు కాగలిగానని వివరించారు.


నెలాఖరులోపు పీసీసీ కార్యవర్గం

గత ఏడు నెలల్లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో ఎంతో బలోపేతమైందని మహేశ్‌కుమార్‌గౌడ్‌ చెప్పారు. ఈ నెలాఖరులోపు పీసీసీ కార్యవర్గం ఏర్పాటవుతుందని తెలిపారు. అందులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మహిళలకు స్థానం దక్కుతుందని వెల్లడించారు. తర్వాత రెండు నెలల్లో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధ్యక్షులను నియమిస్తామని.. ఎంపికలో కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల ఎంపికలో జిల్లా అధ్యక్షుల అభిప్రాయాలకే విలువ ఉంటుందని తెలిపారు. వికేంద్రీకరణ, బూత్‌ స్థాయి నుంచి కమిటీల నియామకం వంటి చర్యలతో పార్టీని పటిష్టం చేయాలని రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారన్నారు.


కవిత లేఖతో కుమ్మక్కు తేలిపోయింది

బీఆర్‌ఎస్‌, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని కేసీఆర్‌ కుమార్తె కవిత లేఖతో తేలిపోయిందని మహేశ్‌కుమార్‌గౌడ్‌ చెప్పారు. బీజేపీని కేసీఆర్‌ సరిగా విమర్శించలేదని కవిత గుర్తుచేశారన్నారు. ఈ లేఖతో కేసీఆర్‌ కుటుంబంలో కుమ్ములాటలు బహిర్గతం అయ్యాయని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ భవిష్యత్తులో మూడు ముక్కలు అవుతుందని వ్యాఖ్యానించారు. అందులో ఒక ముక్క బీజేపీతో చేతులు కలుపుతుందని.. దీనివల్ల కాంగ్రె్‌సకు ఎలాంటి ఢోకా ఉండదని పేర్కొన్నారు. పహల్గాం ఘటన తర్వాత పాకిస్థాన్‌కు దీటుగా జవాబు చెప్పలేదని ప్రజలు మోదీ పట్ల ఆగ్రహంతో ఉన్నారని.. మోదీ గ్రాఫ్‌ రోజురోజుకూ పడిపోతోందని మహేశ్‌గౌడ్‌ పేర్కొన్నారు. 2028లో మళ్లీ తెలంగాణలో, 2029లో కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు.


ఇవి కూడా చదవండి

Genelia D Souza: డ్రైవర్ తొందరపాటు.. జెనీలియాకు తప్పిన పెను ప్రమాదం

Viral Video: ఇండియన్ ఆక్వామ్యాన్.. ఉప్పొంగుతున్న మ్యాన్‌ హోల్‌లోంచి..

Updated Date - May 24 , 2025 | 04:51 AM