Mahesh Kumar Goud: బీజేపీ నేతలు చేతగాని దద్దమ్మలు
ABN , Publish Date - Aug 07 , 2025 | 03:47 AM
బీజేపీ నేతలు చేతగాని దద్దమ్మలంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు పగలంతా ముస్లింలను తిడతారని, సాయంత్రమైతే వాళ్ల జపం చేస్తారని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి మొనగాడు
ఎస్సీ, ఎస్టీ, బీసీల మద్దతు లేకుండా
కిషన్‌రెడ్డి నామినేషన్ వేయగలరా?
బండి సంజయ్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
న్యూఢిల్లీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): బీజేపీ నేతలు చేతగాని దద్దమ్మలంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు పగలంతా ముస్లింలను తిడతారని, సాయంత్రమైతే వాళ్ల జపం చేస్తారని ఆరోపించారు. ఈ మేరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన బీసీ ధర్నాలో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. బీసీల వేదన కేంద్రానికి తెలియజేయాలనే ‘వన్ వాయిస్.. వన్ విజన్.. యునైటెడ్ బీసీ’ నినాదంతో ఈ మహా ధర్నా నిర్వహించామని తెలిపారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీల మద్దతు లేకుండా సికింద్రాబాద్‌లో నామినేషన్ వేయగలవా? అంటూ కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. బీసీల పేరు చెప్పుకుని ఎన్నికల్లో గెలిచిన బండి సంజయ్ ఇప్పుడు కిషన్ రెడ్డికి వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు.
మతాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో గెలవడం బీజేపీ నేతలకు అలవాటేనని, వారిది ద్వంద్వ నీతి అని ఆరోపించారు. గుజరాత్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నామని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల వీడియోను కిషన్ రెడ్డి చూడాలని, ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలకు ఉన్న రిజర్వేషన్లపై అధ్యయనం చేయాలని సూచించారు. తెలంగాణ అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతుగా ఓటు వేసిన బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఎంత దూరమైనా వెళతామని, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల కంటే బీసీ రిజర్వేషన్లే ముఖ్యమని చెప్పారు. ‘ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి మొనగాడు. రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకోవాలంటే దమ్ము, ధైర్యం అవసరం’ అని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశంసించారు. సీఎం రేవంత్ నిర్ణయం పట్ల ప్రధాని మోదీ పరేషాన్‌లో పడ్డారని తెలిపారు. కుల సర్వే దేశానికి దిక్సూచని, తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు
ఈడీ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు