Singireddy Niranjan Reddy: కవితపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపాటు
ABN , Publish Date - Nov 24 , 2025 | 07:31 PM
కవిత ఎవరినో సంతోషపెట్టాలని తనపై ఎందుకు దూర్బాషాలాడుతుందో తెలియడం లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లినప్పుడు కేసీఆర్ అభిమానులంతా దు:ఖ సాగరంలో మునిగిపోయామని గుర్తు చేసుకున్నారు.
వనపర్తి, నవంబర్ 24: రైతుల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. మరికొద్ది రోజుల్లో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటై రెండు ఏళ్లు పూర్తి చేసుకోబోతోందని.. ఈ కాలంలో 720 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. సోమవారం వనపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 10 శాతం పనులు పూర్తి చేస్తే అయిపోతుందని.. కానీ పాలమూరు బిడ్డ సీఎం రేవంత్ ఎందుకు స్పందించడం లేదని వ్యంగ్యంగా పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపకుండా తనపై దుర్భాషలాడడం ఎంత వరకు సమంజసమన్నారు. తాను ఒక్కసారి కూడా కవితపై పల్లెత్తు మాట అనలేదని తెలిపారు. డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్లు తనపై సోషల్ మీడియాలో కావాలనే బ్లేమ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కవిత ఎవరిని సంతోషపెట్టాలని తనపై ఎందుకు దూర్బాషాలాడుతుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కక్ష పూరితంగా ఎవరి మీద కేసులు పెట్టించ లేదన్నారు. ఒక వేళ అలా ఏమైనా ఉంటే నిరూపించాలని అంతేకాని అసత్య ఆరోపణలు చేయవద్దని కవితకు సూచించారు. తాను ఎంతో మంది విద్యార్థులను స్వంత ఖర్చులతో చదివించానని గుర్తు చేశారు. కానీ వాటిని తాను ప్రచారం చేసుకోలేదన్నారు. తాను గతంలో న్యాయవాదిగా ఉన్నప్పుడు పెబ్బేరు సంత భూమి విషయంలో 2003, 2007లో పూజారులకే చెందుతుందని తీర్పు వచ్చిందని గుర్తు చేశారు. కానీ తాను కబ్జా చేశాననడం అసత్య ప్రచారమన్నారు. పూర్తి విషయ పరిజ్ఞానం లేకుండా తాను దేవుడి మాన్యాన్ని కబ్జా చేశానంటూ కవిత ఆరోపణలు చేయడం సిగ్గు చేటు అన్నారు.
తమ పార్టీ ఇప్పుడు అధికారంలో లేదని.. తనపై వచ్చిన ఆరోపణలను రుజువు చేయాలంటూ ప్రత్యర్థులకు ఆయన సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు సైతం కేసీఆర్‌ను కానీ.. ఆయన పార్టీ జెండాను కానీ వదల లేదన్నారు. తండ్రి వయస్సు ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలను ఇంటికి పిలిపించుకుని మాట్లాడుతున్నావంటూ కవితపై నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తమలాంటి నలుగురు, ఐదుగురిపై విషం చీమ్ముతున్నావని కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
నీళ్ల నిరంజన్ రెడ్డి అని తాను కావాలని పిలిపించుకోలేదని.. నీవే లిక్కర్ రాణి అని పిలిపించు కోవాలంటూ కల్వకుంట్ల కవితకు చురకలంటించారు. తాను లక్షా 20 వేల ఎకరాలకు నీళ్లు తెచ్చినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. నీకు హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇళ్లు, గండిపేటలో విలాసవంతమైన ఫౌం హౌస్‌లు.. ఎక్కడి నుంచి వచ్చాయని కవితను ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు. తనకు ఎక్కడా ఫాం హౌస్‌లు లేవన్నారు.
తన సొంత ఊరిలో ఒక వ్యవసాయ క్షేత్రం ఉందన్నారు. కేసీఆర్ కూతురివి కనుక ఇంకా నీకు గౌరవమిస్తున్నానని చెప్పారు. ఆ గౌరవాన్ని కాపాడుకోవడం లేదన్నారు. తాను కేసీఆర్ మనిషినని.. ఆయన మాటను ఆదేశాలకు తుచా తప్పకుండా పాటిస్తానని స్పష్టం చేశారు. తాము కేసీఆర్‌కు వన్నె తెస్తుంటే.. నీవు మాత్రం కేసీఆర్‌ను మానసికంగా వేధిస్తున్నావంటూ కవితపై మండిపడ్డారు. లిక్కర్ కేసులో నీవు జైలుకు వెళ్లినప్పుడు కేసీఆర్ అభిమానులంతా దు:ఖ సాగరంలో మునిగిపోయారని ఈ సందర్బంగా నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నగరంలో ఈ ప్రాంతాల్లో నిలిచిపోనున్న మంచినీటి సరఫరా..
సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..
For More TG News And Telugu News