KTR: మా పార్టీలో రేవంత్ కోవర్టులుండొచ్చు
ABN , Publish Date - May 25 , 2025 | 03:39 AM
పార్టీలో అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు, అంశాలను అంతర్గతంగానే మాట్లాడాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరైనా, ఏ హోదాలో ఉన్నా అలాగే చేయాలని చెప్పారు.
ఒక్కోసారి వాళ్లంతట వాళ్లే బయటపడ్తరు
లేఖ రాయడం పెద్ద విషయమేమీ కాదు
పార్టీలో అంతర్గతంగానే మాట్లాడాలి
ఎంత పెద్ద నేతలైనా ఇదే సూత్రం: కేటీఆర్
ఫామ్‌హౌ్‌సకి ఎవర్నీ రానివ్వని కేసీఆర్?
హైదరాబాద్, మే 24 (ఆంధ్రజ్యోతి): పార్టీలో అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు, అంశాలను అంతర్గతంగానే మాట్లాడాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరైనా, ఏ హోదాలో ఉన్నా అలాగే చేయాలని చెప్పారు. ఈ సూత్రం పార్టీలోని అందరికీ వర్తిస్తుందన్నారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరాయని చెల్లెలు కవిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో శనివారం విలేకరుల సమావేశంలో కేటీఆర్ ఆమె వ్యాఖ్యలపై స్పందించారు. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో చెల్లెలి వ్యాఖ్యలపై ముక్తసరిగా స్పందించారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని, ఎవరైనా తమ సూచనలు, సలహాలను ఏ విధంగానైనా తమకు ఇవ్వొచ్చని చెప్పారు. పార్టీ అధ్యక్షుడిని నేరుగా కలవొచ్చని, పార్టీ వేదికలు కూడా ఉన్నాయని, పార్టీ ఆఫీస్ బేరర్స్‌లో ఎవరినైనా కలిసి చెప్పే అవకాశం ఉందని గుర్తు చేశారు. సలహాలు, సూచనలను లిఖిత రూపంగా, మౌఖికంగానైనా చెప్పొచ్చన్న ఆయన అంతర్గత విషయాలను మాత్రం అంతర్గతంగానే మాట్లాడాలన్నారు. కవిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరంటూ విలేకరులు ప్రశ్నించగా, తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్, రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ అని కేటీఆర్ బదులిచ్చారు. దయ్యాన్ని, శనిని ఎలా వదిలించుకోవాలనేదే తమ లక్ష్యమని కేటీఆర్ సమాధానం చెప్పారు. లేఖలు రాయడం పెద్ద విషయంగా భావించి బాధ పడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యల గురించి విలేకరులు ప్రస్తావించగా, అన్ని పార్టీల్లోనూ కోవర్టులు ఉంటారని, రేవంత్‌రెడ్డికి కూడా తమ పార్టీలో ఉంటే ఉండొచ్చని, సమయం వచ్చినప్పుడు వాళ్లెవరో తెలుస్తుందని, ఒక్కోసారి వారంతట వారే బయట పడతారని వ్యాఖ్యానించారు.
రాష్ట్రం పరువు తీశారు.. రాజీనామా చేయాలి
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరును చేర్చిందని, ఇది రాష్ట్రానికి చాలా అవమానకరమని కేటీఆర్ అన్నారు. రేవంత్‌రెడ్డి 2015లో ఓటుకు నోటు కుంభకోణానికి పాల్పడితే ఇప్పుడు సీటుకు రూటు కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. రేవంత్ రూ.50 కోట్లు ఖర్చు పెట్టి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నారని స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టంగా చెప్పారని తెలిపారు. ఇప్పుడు ఈడీ చార్జిషీటులో ఎవరెన్ని డబ్బులు ఇచ్చారో, ఏ పదవిని ఎంతకు అమ్ముకున్నారో స్పష్టంగా చెబుతోందన్నారు. ఈడీ చార్జిషీటులో రేవంత్‌రెడ్డి పేరు ఉన్నందున నైతికత ఉంటే ముఖ్యమంత్రి పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులైనా స్పందించి రేవంత్‌తో రాజీనామా చేయించి నిష్పక్షపాతంగా విచారణకు సహకరించాలని అన్నారు. రేవంత్‌కు ఇద్దరు బాస్‌లని, రాహుల్, మోదీలను ప్రసన్నం చేసుకోవడానికే ఆయన తరచూ ఢిల్లీ వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. బిల్డర్లు, కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ బాస్‌లకు వేల కోట్ల చందాలు త ప్ప సీఎంగా రేవంత్ ఏమీ చేయలేదన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో చార్జిషీటులో పార్టీ ముఖ్యమంత్రి పేరు ఉంటే రాహుల్‌గాంధీ స్పందించరేమని ప్రశ్నించారు. సీఎం జపాన్ పర్యటనకు వెళ్లినప్పుడే తమకు అనుమానం వచ్చిందని, ఆ సమయంలోనే ఈడీ రాహుల్, సోనియాగాంధీలను ఏ1, ఏ2గా చేర్చిందని తెలిపారు. అప్పుడు దేశంలోని కాంగ్రెస్ నేతలంతా స్పందించారని, రేవంత్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదని అన్నారు. చార్జిషీటులో పేరున్న కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కర్ణాటక బీజేపీ డిమాండ్ చేస్తోందని, తెలంగాణ బీజేపీ మాత్రం రేవంత్‌రెడ్డి విషయంలో మౌనంగా ఉంటోందని ప్రస్తావించారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్యసంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవాలని సూచించారు. బీజేపీ ఎంపీలు చేస్తున్న భూ దందాలకు ముఖ్యమంత్రి వత్తాసు పలకడమే ఈ మౌనానికి కారణమని అనుమానం వ్యక్తం చేశారు. రేవంత్ బిల్డర్ల దగ్గర నుంచి చదరపు అడుగుకు రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారని చెప్పారు. అవినీతి వ్యవహారాల మీద నెల రోజుల పాటు వేచి చూస్తామని, అప్పటికీ కేంద్రం స్పందించకుంటే బీఆర్‌ఎస్ కార్యాచరణలోకి దిగుతుందని ప్రకటించారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో ముఖ్యమంత్రిపై విచారణకు ఆదేశించాలని గవర్నర్‌ను కలిసి కోరతామని చెప్పారు. సీఎం విచారణకు హాజరు కావాల్సిందేనని, ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబడాల్సిందేనని, చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు.
ఇవి కూడా చదవండి
Government Doctor: భార్యను పుట్టింటికి పంపించి.. వేరే మగాళ్లతో ఇంట్లో ఆ వీడియోలు..
Telangana: కవిత చెప్పిన దెయ్యాలు వారే.. సామ సంచలన కామెంట్స్..