Share News

KTR Questions Amit Shah: కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతిపై విచారణకు ఆదేశించరెందుకు

ABN , Publish Date - Jun 30 , 2025 | 03:38 AM

తెలంగాణలోని రేవంత్‌ సర్కారు.. ఢిల్లీలోని కాంగ్రెస్‌ పెద్దలకు ఏటీఎంగా మారిందని ఆరోపించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ అంశంపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు.

 KTR Questions Amit Shah: కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతిపై విచారణకు ఆదేశించరెందుకు

  • కాంగ్రెస్‌ పెద్దలకు ఏటీఎంగా రేవంత్‌ సర్కార్‌ అని మీరే అంటారు..

  • కేంద్ర దర్యాప్తు సంస్థలు మీ వద్దే ఉన్నాయి

  • షా ఎందుకు స్పందించరు?: కేటీఆర్‌

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని రేవంత్‌ సర్కారు.. ఢిల్లీలోని కాంగ్రెస్‌ పెద్దలకు ఏటీఎంగా మారిందని ఆరోపించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ అంశంపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థలైన సీబీఐ,ఈడీతో అవినీతి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విచారణ జరపడానికి కేంద్రానికి ఏం అడ్డువస్తుందో తెలంగాణ ప్రజలకు వివరించాలని అని కేటీఆర్‌ అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ తో బీజేపీ కుస్తీ, తెలంగాణలో మాత్రం దోస్తీ అన్నట్లుగా సాగుతున్న కుమ్మక్కు రాజకీయాల వల్లే రేవంత్‌ను వెనకేసుకుని వస్తున్నారనే ఆరోపణలకు సమాధానం ఉందా అని ఆదివారం ఆయన ఎక్స్‌లో ప్రశ్నించారు. నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్‌ఎ్‌సను ఒంటరిగా ఎదుర్కోలేక, రేవంత్‌ను బీజేపీ పావుగా వాడుకుంటున్న మాట వాస్తవం కాదా అని నిలదీశారు.


గతంలో ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినపుడు రేవంత్‌, రాహుల్‌ను కలిపి ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరిట దోచుకుంటున్నారని ఆరోపించారని, కానీ, నేటి వరకు ఈ అంశంపై ఎందుకు దర్యాప్తుకు ఆదేశించలేదని ప్రశ్నించారు. ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినా, ఇద్దరు కేంద్ర మంత్రులున్నా తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా, ఒక్క ఐఐటీ, ఐఐఎం, మెడికల్‌ కాలేజీలు లాంటి ఉన్నత విద్యాసంస్థలు మంజూరు చేయకుండా బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. కేంద్ర బడ్జెట్‌లో పసుపు బోర్డుకు పైసా కే టాయించకుండా పేరుకు మాత్రం పసుపు బోర్డు పెట్టి రిబ్బన్‌ కత్తిరిస్తే ప్రయోజనమేమిటని, కనీసం సొంత భవనం కూడా లేకుండా కేసీఆర్‌ హయాంలోని క్యాంపు కార్యాలయంలో పసుపు బోర్డు ఆఫీసును ప్రారంభించడం సమంజసమా అని ప్రశ్నించారు. ఏపీలోని టీడీపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్లకు నదుల అనుసంధానం ముసుగులో కేంద్రం బంగారు బాటలు వేయడం గోదావరిపై తెలంగాణ రైతుల హక్కులు కాలరాయడం కాదా అని కేటీఆర్‌ నిలదీశారు.

Updated Date - Jun 30 , 2025 | 07:14 AM