Share News

KTR: కంచ గచ్చిబౌలి భూములపై తలోమాట

ABN , Publish Date - Apr 13 , 2025 | 04:21 AM

కంచి గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని తాకట్టుపెట్టినట్లు టీపీసీసీ అధ్యక్షుడు చెబుతుంటే, తాకట్టు పెట్టలేదని మంత్రులు, ముఖ్యమంత్రి చెబుతున్నారని, అందరూ ఒక గదిలో కూర్చుని అసలు అమ్ముకున్నారో, కుదవపెట్టారో చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

KTR: కంచ గచ్చిబౌలి భూములపై తలోమాట

  • అమ్ముకున్నారా.. తాకట్టు పెట్టారా? చెప్పండి

  • వాటిపై ప్రభుత్వం చూపిస్తున్న పత్రాలు నకిలీ

  • ఆ భూముల్లో రూ.10 వేల కోట్ల అవినీతి నిజం: కేటీఆర్‌

కరీంనగర్‌ టౌన్‌/ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): కంచి గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని తాకట్టుపెట్టినట్లు టీపీసీసీ అధ్యక్షుడు చెబుతుంటే, తాకట్టు పెట్టలేదని మంత్రులు, ముఖ్యమంత్రి చెబుతున్నారని, అందరూ ఒక గదిలో కూర్చుని అసలు అమ్ముకున్నారో, కుదవపెట్టారో చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ భూవివాదం దేశంలోనే అది పెద్ద మోసం అని ఆరోపించారు. ఈ భూమిని ఎవరు కొన్నా 2028లో అధికారంలోకి వచ్చిన తర్వాత అంగుళం కూడా వదిలిపెట్టకుండా తీసుకుంటామని, గ్రీన్‌ జోన్‌ చేస్తామన్నారు. శనివారం కరీంనగర్‌లోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా నియోజకవర్గ ఇన్‌చార్జిలతో కలిసి కేటీఆర్‌ విలేకరులతో మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న పత్రాలు నకిలీవని, ఎందుకంటే సీఎం రేవంత్‌ రెడ్డి కూడా నకిలీ వ్యక్తి అని, అనేక అంశాలపై పదే పదే మాట మార్చే మనిషి అని వ్యాఖ్యానించారు.


బీకాన్‌ అనే సంస్థకు భూములు కుదువపెట్టారని, ఆ పత్రాలను బయటపెట్టానని, అవి అవాస్తవమైతే ప్రభుత్వం తేల్చాలన్నారు. రూ.10 వేల కోట్ల రుణానికి రూ.170 కోట్ల కమీషన్‌ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ ముంబై బ్రోకర్‌ సంస్థను తీసుకుని రాగా... దాని సాయంతో ప్రభుత్వం డబ్బులు తెచ్చుకుందన్నారు. దీనికి బదులుగా ప్రభుత్వం బీజేపీ ఎంపీకి సహాయం చేస్తోందని ఆరోపించారు. ఆ సహాయం బీజేపీ ఎంపీకి చేరగానే ఆయన పేరును, ఆయనకు పొందిన లాభాన్ని, ఆయనతో ముఖ్యమంత్రికి ఉన్న పాత దందాలను కూడా బయటపెడతానన్నారు. 15 నెలలుగా రేవంత్‌ రెడ్డిని బీజేపీ అన్ని రకాలుగా కాపాడుతోందన్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌... రేవంత్‌ రెడ్డికి అండగా నిలబడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటి కాకుంటే దీనిపై ఆర్‌బీఐ, సెబీ వంటి సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా అప్పటి గవర్నర్‌ పలు విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులకు గురిచేశారని, కాంగ్రెస్‌ పాలనలో ఇంత అవినీతి జరుగుతున్నా గవర్నర్‌ పత్తా లేరన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 04:21 AM