Share News

KTR: మరో పార్టీలో బీఆర్‌ఎస్‌ విలీనం అవాస్తవం

ABN , Publish Date - Jul 28 , 2025 | 03:21 AM

బీఆర్‌ఎస్‌ను ఏదో పార్టీలోకి విలీనం చేయబోతున్నామంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని.. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు బీఆర్‌ఎస్‌ ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు.

KTR: మరో పార్టీలో బీఆర్‌ఎస్‌ విలీనం అవాస్తవం

  • తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్‌ఎస్‌ ఉంటుంది

  • ప్రభుత్వాన్ని నడిపే దమ్ము రేవంత్‌రెడ్డికి లేదు

  • ఇంత ఇజ్జత్‌ లేని సీఎంను ఎప్పుడూ చూడలే

  • మేడిగడ్డ పిల్లర్లు కుంగడం వెనక కాంగ్రెస్‌ ఉందేమోనని సందేహాలు వస్తున్నాయి

  • భూపాలపల్లి జిల్లా పార్టీ సమావేశాల్లో కేటీఆర్‌

భూపాలపల్లి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ను ఏదో పార్టీలోకి విలీనం చేయబోతున్నామంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని.. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు బీఆర్‌ఎస్‌ ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి ప్రభుత్వాన్ని నడిపే దమ్ము లేదని.. అప్పుల పేరుతో నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డి లాంటి ఇజ్జత్‌ లేని ముఖ్యమంత్రిని తాను ఇంతవరకు చూడలేదని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో కేవలం రెండు పిల్లర్లు కుంగినందుకు కాంగ్రెస్‌ ఇంత రాద్ధాంతం చేయడం అనుమానం కలిగిస్తోందని పేర్కొన్నారు. అసలు ఈ వ్యవహారం వెనుక కాంగ్రెస్‌ ఉందేమోనని సందేహం వస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా ఆదివారం భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి, చిట్యాల, భూపాలపల్లిలలో కేటీఆర్‌ పర్యటించారు. కార్యకర్తలతో నిర్వహించిన సమావేశాల్లో మాట్లాడారు.


తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో పంటల సాగుకు ముందే రైతుబంధు నిధులు ఇచ్చామని, కాంగ్రెస్‌ మాత్రం ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే రైతు భరోసా ఇస్తోందని కేటీఆర్‌ విమర్శించారు. రూ.15 వేలు రైతు భరోసా, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రూ.4 వేలు పెన్షన్‌ ఇస్తామని చెప్పి కాంగ్రెస్‌ మోసం చేసిందని ఆరోపించారు. ఎరువులకు ఆధార్‌తో రేషన్‌ పెట్టడం, మహిళా రైతులపై కేసులుపెట్టి జైలుకు పంపడం వంటి దౌర్భాగ్యం రాష్ట్రంలో కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. జల వనరులున్న ప్రతి గ్రామంలో చేప విత్తనాలు పంపిణీ చేసి నీలి విప్లవం తెచ్చిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని దుష్ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌లో రెండు పిల్లర్లు కుంగినందుకు రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఫుడ్‌ పాయిజన్‌ జరిగి 111 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం బాధ కలిగిందని కేటీఆర్‌ చెప్పారు. అందాల పోటీల్లో భామల భోజనానికి ప్లేటుకు రూ.లక్ష ఖర్చు చేశారని.. విద్యార్థులకు వంద, రూ.150 ఖర్చుపెట్టి మంచి భోజనం అందించలేరా? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపుతో కాంగ్రె్‌సకు తలతిరిగిపోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి...

గాజాపై దాడులకు విరామం.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం

కంబోడియా, థాయ్‌లాండ్ తక్షణం చర్చలు చేపట్టేందుకు రెడీ.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 28 , 2025 | 03:21 AM