Share News

KTR: చేతకాకుంటే రాజీనామా చేయాలి

ABN , Publish Date - May 07 , 2025 | 06:16 AM

బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పరిపాలన చేతకాకుంటే రాజీనామా చేయాలని, తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీయడాన్ని సహించబోమని హెచ్చరించారు.

 KTR: చేతకాకుంటే రాజీనామా చేయాలి

  • కాంగ్రెస్‌.. దొంగ చేతికి తాళాలు ఇచ్చింది

  • ఆ కారణంగానే ఎక్కడా అప్పు పుట్టడం లేదు

  • మరోసారి కేసీఆర్‌ను విమర్శిస్తే

  • నాలుక చీరేస్తాం: కేటీఆర్‌

హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి) : పరిపాలన చేతకాకుంటే సీఎం పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు. నోట్ల కట్లతో దొరికిన దొంగ రేవంత్‌ రెడ్డి అని, అందుకే ఎక్కడా అప్పు పుట్టడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ.. దొంగ చేతికి తాళాలిచ్చిందని, ఆయన్ను సీఎం చేసి.. ఏఐసీసీ, రాహుల్‌గాంధీ తప్పుచేశారని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ‘నన్ను కోసినా ఉన్న ఆదాయానికి మించి ఉద్యోగులకు పైసా ఇవ్వలేను’ అని మాట్లాడడం.. సీఎం స్థాయి వ్యక్తికి తగదని, ఇంత అసమర్థ సీఎం దేశంలోనే ఎవరూ లేరన్నారు. బీఆర్‌ఎ్‌సను, వ్యక్తిగతంగా తమను తిట్టినా భరించామని.. తెలంగాణ ప్రతిష్ఠ దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదన్నారు. ఉద్యమం వేళ ఉద్యోగుల త్యాగాల గురించి రేవంత్‌కు ఇసుమంత కూడా తెలియదని, ప్రజల ముందు వారిని విలన్లుగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అందాల పోటీల కోసం ప్రభుత్వం రూ.200కోట్లు ఖర్చు చేస్తోందని, ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్‌ ఉద్యోగుల ప్రయోజనాల చెల్లింపులకు మాత్రం డబ్బుల్లేవని చెబుతోందని దుయ్యబట్టారు. ప్రజలు ఇచ్చిన హామీలను అడగొద్దంటున్న రేవంత్‌రెడ్డి.. రానున్న రోజుల్లో పెట్రోల్‌ ధరను రూ.200కు పెంచినా పెంచుతారని, రికవరీ యాక్ట్‌ కింద కేసీఆర్‌ హయాంలో పెంచిన జీతాలను వెనక్కి ఇవ్వమంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


ఏడాదిన్నరలోనే సీఎం కుటుంబ ఆస్తులు భారీగా ఎలా పెరిగాయి? ఫోర్త్‌సిటీలో 2వేల ఎకరాలు ఎలా కొన్నారు? జూబ్లీహిల్స్‌ ప్యాలెస్‌ మూడింతలు ఎలా పెరిగింది? సీఎం తమ్ముడు వెయ్యి కోట్లతో స్వచ్ఛ బయో కంపెనీ ఎలా పెట్టారు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీకి ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం చేస్తున్నానని సీఎం అబద్ధాలు చెప్తున్నారని, ఆయన ప్రైవేట్‌ ట్రిప్పులకు సంబంధించిన ఫొటోలను త్వరలోనే బయట పెడతామన్నారు. సీఎం, మంత్రుల పర్యటనలకు అయిన ఖర్చుపై దమ్ముంటే శేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవానికి తోడు పదేళ్లు సీఎంగా పని చేసిన కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి నోటికొచ్చినట్లు దూషిస్తున్నారని, మరో సారి అలా మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. కాగా, ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని, తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - May 07 , 2025 | 06:17 AM