KTR: అధికారంలోకి వస్తాం.. లెక్కలు సరి చేస్తాం!
ABN , Publish Date - Aug 08 , 2025 | 04:45 AM
గత పదేళ్లలో రేషన్ కార్డులే ఇవ్వలేదంటూ కొందరు ఐఏఎ్‌సలు అబద్ధాలు చెబుతున్నారని, వారి హోదాకు రాజకీయాలు మాట్లాడడం తగదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఐఏఎ్‌సలు రాజకీయాలెలా మాట్లాడతారు?
బీసీ రిజర్వేషన్లపై రేవంత్‌రెడ్డిది డ్రామానే
ఆయనకు కేసీఆర్ ఫోబియా: కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : గత పదేళ్లలో రేషన్ కార్డులే ఇవ్వలేదంటూ కొందరు ఐఏఎ్‌సలు అబద్ధాలు చెబుతున్నారని, వారి హోదాకు రాజకీయాలు మాట్లాడడం తగదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రెండున్నరేళ్లలో తాము అధికారంలోకి వస్తామని, అప్పుడు అందరి లెక్కలు సరి చేస్తామని హెచ్చరించారు. పోలీసులు సైతం అధికార పార్టీ నేతల ఆదేశాలు పాటిస్తూ.. బీఆర్‌ఎస్ శ్రేణులపై దౌర్జన్యానికి దిగుతున్నారని, కానీ.. ఇది ఎంతో కాలం నడవదన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం పరిగికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్‌రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొన్న కాంగ్రెస్.. ఇప్పుడు రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యాక ఇస్తామనడం విచిత్రంగా ఉందన్నారు.
సీఎంకు కేసీఆర్ ఫోబియా పట్టుకొందని, ఆయన పేరు తీయకుండా ఉండలేని రుగ్మతతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎ్‌సను వీడిన 10మంది ఎమ్మెల్యేలది దౌర్భాగ్యమని, వారు ఏపార్టీలో ఉన్నామో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు అవినీతి డబ్బును కాంగ్రెస్ తేనుందని, జాగ్రత్తపడాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ అరాచకాలు తగ్గాలంటే.. స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సను గెలిపించాలని ప్రజలను కోరారు. బీఆర్‌ఎస్ పదేళ్లపాలనలో తెలంగాణ అభివృద్ధిపై మాత్రమే దృష్టి సారించామని, పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదని పేర్కొన్న కేటీఆర్.. ఈ సారి అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను అన్నివిధాలా అభివృద్ధి పథంలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉన్నంత కాలం గులాబీ కండువా ఉంటుందని, కాంగ్రెస్, బీజేపీని మట్టి కరిపించి మళ్లీ కేసీఆర్‌ను సీఎంను చేసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. జాతీయ చేనేతదినోత్సవాన్ని పురస్కరించుకొని నేతన్నలకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గువ్వల రాజీనామా.. స్పందించిన బీఆర్ఎస్
తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు