KTR: కక్షగట్టి కమిషన్ల పేరిట వేధింపులు దుర్మార్గం
ABN , Publish Date - Aug 15 , 2025 | 05:05 AM
జూరాల, మంజీరా, సింగూరు బ్యారేజీలకు ప్రమాద ఘంటికలు మోగుతున్నా పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీ నేతలు.. కాళేశ్వరంపై మాత్రం బురదజల్లుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
కాళేశ్వరంపై బురదజల్లడం కాంగ్రెస్, బీజేపీ నేతల దిగజారుడుతనం: కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): జూరాల, మంజీరా, సింగూరు బ్యారేజీలకు ప్రమాద ఘంటికలు మోగుతున్నా పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీ నేతలు.. కాళేశ్వరంపై మాత్రం బురదజల్లుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇది వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ప్రాజెక్టులు కట్టాక మరమ్మతులు రావడం సహజమని, మేడిగడ్డ బ్యారేజీలోని రెండు పిల్లర్లను బూచిగా చూపుతున్నారని ధ్వజమెత్తారు. కక్షగట్టి కమిషన్ల పేరిట వేధించడం దుర్మార్గమని గురువారం కేటీఆర్ ఎక్స్‌లో పేర్కొన్నారు. హైదరాబాద్ జంట నగరాలకు మంచి నీరందించే మంజీరా బ్యారేజీకి ప్రమాదం పొంచి ఉందని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నిపుణుల బృందం చేసిన హెచ్చరికపై సోయి లేకపోతే మంజీరాకు మనుగడ ఉంటుందా? అని అడిగారు. సింగూరు డ్యామ్‌కు కూడా డేంజర్‌బెల్స్ మోగుతున్నాయని, అదే ఎన్‌డీఎ్‌సఏ హెచ్చరికను పెడచెవిన పెట్టి ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తారా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. అన్ని ప్రాజెక్టులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
అప్పు పుట్టట్లేదని వాహనాలపై ట్యాక్స్ పెంచుతారా?:హరీశ్
హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): అప్పులు పుట్టడం లేదని వాహనాల లైఫ్ ట్యాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతావా? అంటూ సీఎంరేవంత్‌రెడ్డిని మాజీమంత్రి హరీశ్ ప్రశ్నించారు. ఆదాయం కోసం కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి పేద, మధ్యతరగతి ప్రజల రక్తం పీలుస్తావా? అంటూ గురువారం ఓ ప్రకటనలో నిలదీశారు. ప్రస్తుత ధరల ప్రకారం ద్విచక్ర వాహనం ఏది కొన్నా.. రూ.లక్షకు పైగా ఉంటుందని, రైతులు, చిరు వ్యాపారులు కొనే ద్విచక్ర వాహనాలపై లైఫ్ ట్యాక్సును 12 నుంచి 15 శాతానికి పెంచడం దుర్మార్గమని ఆరోపించారు. కార్లు, వాణిజ్య వాహనాలపైనా అడ్డగోలుగా పన్నులు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ప్రజలపై భారం మోపేలా రేవంత్ చేపట్టిన ఈ దుర్మార్గ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసుల విద్యార్హతపై.. డీజీపీ కీలక వ్యాఖ్యలు
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ